కేసీఆర్ కీలక నిర్ణయం: 50వేల వైద్య సిబ్బంది నియామకాలకు ఆదేశం
హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు.
Recommended Video
రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. అంతేగాక, వీరికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలని అన్నారు.

వీరందరికీ కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరైన గుర్తింపునివ్వాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
కష్టకాలంలో ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు రావాలని సీఎం కేసీఆర్ యువ డాక్టర్లకు పిలుపునిచ్చారు.
https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx. డాక్టర్లతోపాటు అర్హత ఉన్న నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు.
వరంగల్, ఆదిలాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రారంభం: 729 మంది వైద్య సిబ్బంది నియామకం
వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్‌లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సీఎంఎస్ఎస్‌వై కింద ఎంజీఎంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటా కింద తక్షణం అందజేయాల్సిన 8 కోట్ల రూపాయలను, రిమ్స్‌లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రభుత్వ వాటా కింద 20 కోట్ల రూపాయలను, మొత్తం 28 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.
అంతేగాక, వరంగల్ ఆస్పత్రి కోసం 363 మంది వైద్య సిబ్బందిని, ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం 366 మంది వైద్య సిబ్బందిని, మొత్తం 729 మంది సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications