రేపే తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల...
రేపు (జూన్ 18) తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. హైదరాబాద్ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో తెలంగాణ పీజీఈసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీటి ఫలితాలను రేపు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ హెచ్‌గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్, అడ్మిషన్ భవనంలో విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం తెలంగాణ పీజీఈసెట్ పరీక్షను నిర్వహించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే వీటి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి.
టీజీ పీజీఈసెట్ నోటిఫికేషన్ మార్చి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 16న ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 10వ తేది నుంచి 13వ తేది వరకు టీజీపీజీఈసెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు ఆన్‌లైన్‌లో జరిగాయి. మొత్తం 22,712 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, అందులో 20,626 (90.82 శాతం) మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ అధికారిక https://pgecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోగలరు.

కనీస అర్హత మార్కులివే..
ఈ పరీక్ష మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో జరిగింది. ఇందులో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి రుణాత్మక మార్కులు లేవు. పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణలోని పీజీ కళాశాలల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications