రేపు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 ఫలితాలు విడుదల..
జూన్12వ తేదీన తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ 2024 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే టెట్ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్ కీ విడుదల చేసిన విద్యాశాఖ... ఈ కీపై విద్యార్థులనుంచి అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ ఆన్సర్ కీని కూడా రూపొందించింది. రేపు(జూన్ 12) ఫైనల్ ఆన్సర్ కీతోపాటు ఫలితాలను కూడా విడుదల చేయనుంది.
తెలంగాణ టెట్ పరీక్షలు గత నెల 20వ తేది నుంచి జూన్ 2వ తేది వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా టెట్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించడం జరిగింది. ఈ సారి టెట్ పరీక్షలకు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 2,36,487 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక, పేపర్ల వారీగా ఈ వివరాలను ఓసారి పరిశీలిస్తే.. పేపర్-1కు 99,958 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 86.03 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. పేపర్-2కి వస్తే.. 1,86,423 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకోగా, వారిలో 82.58 శాతం మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు.

ఉపాధ్యాయ పోస్టులకు టెట్ తప్పనిసరి...
ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకునేవారు టెట్ పరీక్షలో అర్హత సాధించాల్సిందే. ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీ పరీక్షలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అలాగే ప్రభుత్వ టీచర్ పోస్టుల నియామకాలకు నిర్వహించే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) రాసేందుకు కూడా టీచర్ ఎలిజబిలిటి టెస్ట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సిందే. టెట్ పరీక్షలకు బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్ధులు అర్హులు. తెలంగాణలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ నియామకాలను చేపట్టేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా. డీఎస్సీ పరీక్షలో టెట్ మార్కులకు వెయిటేజీ కల్పించారు. డీఎస్సీ నియామకాల్లో 80 శాతం రాత పరీక్ష మార్కులకు ఉంటే, 20 శాతం టెట్ మార్కులకు కేటాయించడం జరిగింది.












Click it and Unblock the Notifications