గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల ఎంపికపై టీజీపీఎస్‌సి కీలక నిర్ణయం...
తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ అభ్యర్థుల ఎంపికపై టీజీపీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్‌సి స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్దంగా గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కుదరదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సి) తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను 1:50 నిష్పత్తిలోనే ఎంపికచేయనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 19వ తేదిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను కమిషన్ ప్రకటించింది. ఇక, ఈ పోస్టులకు గాను జూన్ 9వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. త్వరలోనే వీటి ఫలితాలను కూడా టీజీపీఎస్‌సి విడుదల చేయనుంది. ఇప్పటికే మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించిన కమిషన్.. తాజాగా మెయిన్స్ అభ్యర్థుల ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంది.

గత కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మెయిన్స్ పరీక్షకు 1:100 ప్రాతిపదికన ఎంపికచేయాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు జీఏడీ జారీ చేసిన జీఓ నం. 29, 55 మేరకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని కమిషన్ వెల్లడించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్‌సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా గ్రూప్-1 ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొంటూ టీజీపీఎస్సీ ఓ ఉద్యోగ ప్రకటనను కూడా జారీ చేసింది.












Click it and Unblock the Notifications