TS Mega DSC : 9వేల 800 పోస్టులతో త్వరలోనే మెగా డీఎస్సీ...
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని అంశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మెగా డీఎస్సీపై కూడా ఆయన చర్చిస్తోన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, త్వరలోనే మెగా డీఎస్సీని నిర్వహిస్తారని సమాచారం. ఇందులో భాగంగానే దాదాపు 9వేల 800 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించే ఆలోచన చేస్తోన్నట్లు తెలుస్తోంది.
నిన్న అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ మెగా డీఎస్సీ ప్రస్తావన వచ్చింది. వచ్చే ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని ఆమె స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం మూడున్నర నెలల క్రితం 5,089 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, పీఈటీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మొత్తం లక్షా 76వేల 530 అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.

ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు అత్యధికంగా 60 వేల 190 దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు నవంబరు 20 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీలో భాగంగా ఆ దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
అదనంగా 450 ఖాళీలు ఏర్పడ్డాయి...
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 9,370 ఉపాధ్యాయ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని, గత జులైలో మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. దానికి సంబంధించి గణాంకాలను కూడా సమర్పించింది. విద్యాశాఖ ప్రతిపాదించిన 9,370 ఖాళీలతో పాటు గత అక్టోబరులో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది.
ఈ లెక్కన మొత్తం 9,820 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటీఫికేషన్ రద్దు చేస్తే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తోంది. దీంతో ఇప్పటికే భర్తీ చేయాలని నిర్ణయించిన 5,089 పోస్టులతో కలిపి అనుబంధ నోటిఫికేషన్‌ను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications