కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు నిలిపేయాలని నియామక బోర్డ్ ఆదేశం
హైదరాబాద్: కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నలు తప్పుగా రావడంతో నాలుగు మార్కులు కలపాలని హైకోర్టు కొన్ని రోజుల క్రితం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, కోర్టు ఆదేశించినా నియామక ప్రక్రియ కొనసాగుతుందంటూ పలువురు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో మెడికల్ టెస్టులు నిలిపివేయాలని కోర్టు సూచించింది. దీంతో మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని నియామక బోర్డు ఆదేశించింది. ఇది ఇలా ఉండగా, ఇప్పటికే పలు ఉద్యోగ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

తెలంగాణ డీఎస్సీ వాయిదా
తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (DSC) వాయిదా పడింది. నవంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి 30 వరకు టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు.
అయితే, నవంబర్ 30న ఎన్నికలు జరగనుండటంతో టీఆర్టీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల కారణంగానే ఇటీవల తెలంగాణ గ్రూప్-2 పరీక్షలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.
తెలంగాణ గ్రూప్-2 మరోసారి వాయిదా, కొత్త తేదీలివే
ముందుగా నిర్ణయించిన ప్రకారం నవంబర్ 2, 3న గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్ చేశారు. గ్రూప్-2 పరీక్షను వచ్చే ఏడాది(2024) జనవరి 6,7 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఓ ప్రకటనలో వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా, కొత్త తేదీల ఖరారుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications