పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.. గాయత్రి గుప్తా కౌంటర్ !!
తెలుగు ప్రేక్షకులకు నటి గాయత్రి గుప్తా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించి.. ఆ తర్వాత 'ఫిదా', 'కొబ్బరి మట్ట', 'ఐస్ క్రీం' వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత వివాదాలతో.. బోల్డ్ కామెంట్స్ తోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. గతంలో మీటూ ఉద్యమం సమయంలో గాయత్రి గుప్త చేసిన ఆరోపణలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలను కుదిపేశాయి.
ఇప్పుడు మరోసారి గాయత్రి గుప్తా మరోసారి వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
కాగా అంతకు ముందు దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చగా మారాయి. హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చేటప్పుడు పద్ధతిగా ఉండాలని, చీరలు కట్టుకుని రావడం మరింత అందంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్లామర్ ఒక స్థాయి వరకు బాగుంటుందని, కానీ హద్దులు దాటితే గౌరవం తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పాతతరం నటీమణులు సావిత్రి, సౌందర్యలను ఉదాహరణగా పేర్కొన్న శివాజీ, వారు ఎప్పుడూ పద్ధతిగా ఉంటూనే నటనతో ప్రేక్షకులను మెప్పించారని చెప్పారు. నేటితరం హీరోయిన్లు కూడా అందాల ప్రదర్శనకంటే నటనకు ప్రాధాన్యం ఇవ్వాలని హితవు పలికారు.

అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన గాయత్రి గుప్తా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. చీర కట్టుకోవాలా వద్దా అనేది తన ఇష్టమని.. ఎవరో శివాజీ అన్నారని చీర కట్టుకోనని వివరించారు. తనకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అదే వేసుకుంటానని తెలిపారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట.. అన్నట్టు ఆయన వ్యవహారం ఉందని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మనం చూసే చూపులో లోపం పెట్టుకుని ఎదుటివారిని విమర్శించడం సరికాదని హితవు పలికారు.
ఇక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, హీరోగా మారి లవర్‌బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న శివాజీ, కొన్నేళ్ల గ్యాప్ తర్వాత 'కోర్టు' సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో ఆయన పోషించిన మంగపతి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దీంతో మళ్లీ వరుస అవకాశాలు ఆయన తలుపుతడుతున్నాయి. ఇప్పటికే ఆ ఘటనపై అనసూయ, చిన్మయి వంటి వారు కూడా స్పందించడం.. శివాజీ క్షమాపణలు చెప్పడం కూడా జరిగిపోయాయి. ఈ తరుణంలో ఈమె చేసిన కామెంట్స్ మళ్లీ కొత్త వివాదానికి తెర లేపుతాయా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications