ఈ ఏడాదిలో ఇదే చివరి గ్రహణం.. కానీ మనం చూడలేం!
విశ్వాంతరాళంలో తరచూ అనేక వింతలు, వింత విశేషాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల గమనాలను నిశితంగా పరిశీలించే ఖగోళ ప్రేమికులకు ఈ ఏడాది ముగిసేలోగా ఒక అరుదైన విజువల్ ఫీస్ట్ అందుబాటులోకి రానుంది. రాబోయే ఆగస్టు నెలాఖరులో నింగిలో ఒక అద్భుతమైన ఖగోళ ఘట్టం చోటుచేసుకోబోతోంది. ఈ ఏడాదిలో ఇదే చివరిది కావడం మరో విశేషం. నింగిలో మెరిసే చందమామ కాసేపు తన రంగును మార్చుకుని ఎర్రటి రంగులోకి మారి అలరించబోతోంది.
దాదాపు పూర్తిగా కప్పేయనున్న భూమి నీడ!
ఈ ఏడాది ఆగస్టు 27, 28 తేదీల మధ్య రాత్రి వేళల్లో ఈ అరుదైన చంద్ర గ్రహణం సంభవించనుంది. సాధారణంగా గ్రహణం అనగానే చందమామ పూర్తిగా కనిపించకుండా పోవడం లేదా కొంత భాగామే దాక్కోవడం చూస్తుంటాం. కానీ ఈసారి జరగబోయేది చాలా ప్రత్యేకమైన 'గాఢ పాక్షిక గ్రహణం' (Deep Partial Lunar Eclipse). ఈ సమయంలో భూమి యొక్క నల్లటి గాఢమైన నీడ చందమామపై పడి, దాదాపు 96.2 శాతం భాగాన్ని కప్పేస్తుంది. కేవలం స్వల్ప భాగం మాత్రమే నీడ బయట ఉంటుంది. సూర్యకాంతి భూ వాతావరణం గుండా ప్రసరించి చంద్రుడిపై పడటం వల్ల జాబిల్లి ముదురు ఎరుపు, నారింజ రంగులో కొద్దిసేపు మిలమిలా మెరుస్తూ "బ్లడ్ మూన్" లాంటి రూపాన్ని సంతరించుకోనుంది.

సుదీర్ఘంగా సాగనున్న ఖగోళ తంతు
ఖగోళ శాస్త్రవేత్తల ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ మొత్తం గ్రహణ ఘట్టం సుమారు 5 గంటల 38 నిమిషాల పాటు సాగనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 27 అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమై, 28న వేకువజామున ముగియనుంది. గ్రహణం తన పరాకాష్ఠకు చేరుకునే సమయం అంతర్జాతీయ కాలమానం (UTC) ప్రకారం ఉదయం 4:12 గంటలుగా లెక్కించారు. ఈ సుదీర్ఘమైన సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంటే ఖగోళ ప్రేమికులకు పండుగే అని చెప్పవచ్చు.
మన దేశంలో కనిపిస్తుందా? పెదవి విరుస్తున్న భారతీయులు
ఈ అద్భుతాన్ని కళ్లారా చూడాలని ఆశపడుతున్న భారతీయ ఖగోళ ప్రేమికులకు మాత్రం తీవ్ర నిరాశే ఎదురవనుంది. ఈ గ్రహణ దృశ్యం మన దేశంలో ఎక్కడా కనిపించదు. మన దేశ పశ్చిమ సరిహద్దు ప్రాంతాలకు అతి సమీపంలోకి వచ్చినప్పటికీ, కాలమానం , భూభాగాల స్థానాల వల్ల మనకు ఈ గ్రహణం తిలకించే అవకాశం దక్కడం లేదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లోని ప్రజలకు ఈ దృశ్యం అద్భుతంగా దర్శనమివ్వనుంది. అలాగే ఆసియాలోని కొన్ని పశ్చిమ ప్రాంతాలు, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల పరిధిలోని ప్రజలు దీనిని వీక్షించవచ్చు.
ప్రత్యేక అద్దాలు అక్కర్లేదు.. నేరుగా చూడొచ్చు!
సూర్యగ్రహణాన్ని చూసేటప్పుడు కళ్లకు రక్షణగా ప్రత్యేకమైన ఫిల్టర్లు, సేఫ్టీ గ్లాసెస్ వాడటం తప్పనిసరి. కానీ చంద్రగ్రహణానికి అలాంటి ఎలాంటి నిబంధనలు ఉండవు. చంద్రుడి కాంతి వల్ల కళ్లకు ఎలాంటి హాని జరగదు కాబట్టి, ఈ గ్రహణాన్ని నేరుగా నగ్న నేత్రాలతోనే చూడవచ్చు. గ్రహణం స్పష్టంగా కనిపించే ప్రాంతాల్లో ఉన్నవారు భవనాలు, చెట్ల అడ్డంకులు లేని మైదాన ప్రాంతాలను ఎంచుకుంటే చాలు. ఒకవేళ చంద్రుని ఉపరితలాన్ని మరింత స్పష్టంగా చూడాలనుకుంటే చిన్న టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ వాడితే సరిపోతుంది. అయితే ఆకాశంలో మబ్బులు లేకుండా స్పష్టంగా ఉండటం అత్యంత ముఖ్యం.
మళ్లీ అరుదైన గ్రహణం ఎప్పుడు?
సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడటమే చంద్రగ్రహణం. ఆగస్టులో జరగబోయే ఈ విశేష ఘట్టం ముగిసిన తర్వాత, మళ్లీ వచ్చే ఏడాది అంటే 2027 ఫిబ్రవరి 20న మరొక చంద్రగ్రహణం సంభవించనుంది. అది పాక్షిక గ్రహణం మాత్రమే కావడం గమనార్హం. ఆ తదుపరి గ్రహణాన్ని అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ఖండాలతో పాటు పశ్చిమ ఆస్ట్రేలియా వాసులు తిలకించే వీలుంటుంది.














Click it and Unblock the Notifications