ఆ బ్యూటీకి లక్కీ ఛాన్స్.. నందమూరి హీరోతో రొమాన్స్!
వరుస విజయాలతో హిట్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇటీవల 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి.. తన తదుపరి చిత్రాన్ని ఓ క్రేజీ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేశారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటించబోతున్న ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రంలో ఏ స్థాయిలో ఉండబోతోందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ?
ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ కథానాయికగా 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. కృతి శెట్టి ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన జంటగా నటించబోతున్నట్లు తెలిసింది. ఉప్పెన తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కృతికి అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ రావడం ఓ బంపరాఫర్ అని చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్-కృతి శెట్టి జోడీ తెరపై సరికొత్తగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెంకటేష్- కీర్తి సురేష్ క్రేజీ కాంబినేషన్
మరోవైపు ఈ మల్టీస్టారర్‌లో విక్టరీ వెంకటేష్ సరసన ఎవరు నటిస్తారనే దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. మహానటి కీర్తి సురేష్, విక్టరీ వెంకటేష్ కు జోడీగా నటించబోతున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి గతంలో వెంకటేష్‌తో చేసిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించాయి. ఇప్పుడు కీర్తి సురేష్ వంటి టాలెంటెడ్ హీరోయిన్ తోడవ్వడంతో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

2027 సంక్రాంతి లక్ష్యంగా..
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించి సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేయాలని డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ అంటేనే అనిల్ రావిపూడికి కలిసొచ్చే సమయం. అందుకే ఈ సారి ఇద్దరు స్టార్ హీరోలతో బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా చేసేందుకు రెడీ అయ్యారు. ఇద్దరు అగ్ర హీరోలు, ఇద్దరు స్టార్ హీరోయిన్లు, అనిల్ రావిపూడి టేకింగ్ వెరసి.. ఈ సినిమా మల్టీస్టారర్ చిత్రాల్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications