'పుష్ప2'కు షాక్ ఇవ్వబోతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్?
సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో కథానాయకుడిగా నటించారు. డిసెంబరు 5వ తేదీన 12వేలకు పైగా స్క్రీన్లలో భారీగా విడుదల కాబోతోంది. 4వ తేదీ రాత్రి 11.00 గంటల నుంచే షోలు వేస్తున్నారు. సినిమా టికెట్ ధరలకు సంబంధించి నిర్మాతలు తెలంగాణలో కావల్సినంత స్థాయిలో తెచ్చుకున్నారు. అంత ధరలు పెట్టి సినిమాలు చూస్తారా? లేదా? అనేది వారికే తెలియాలి. అంతవరకు బాగానేవుందికానీ ఏపీలో ఇంతవరకు టికెట్ ధరలు ఖరారు కాలేదు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెబుతోంది.
పెంచుతారనే ధీమాలో నిర్మాతలు
ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉండటతో పరిశ్రమకు ఎటువంటి ఢోకా లేదనే ఉద్దేశంలో సినీ పరిశ్రమ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటారనే సంగతి తెలిసిందే. గతంలో విడుదలైన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తాజాగా విడుదల కాబోతున్న పుష్ప2పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనికి కారణం నిర్మాతలు టికెట్ ధరలను భారీగా పెంచుకుంటామని కోరుతుండటమే కారణం. సినిమాకు ఇష్టమొచ్చిన రీతిలో బడ్జెట్ పెట్టి, దానికి రూ.100 కోట్ల వడ్డీ కట్టి కూడా నిర్మాతలు ధీమాగా ఉన్నారంటే కారణం తమకు అనుకూలంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కోరినంత ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తారనే ధీమా ఉండటమే.

పునరాలోచనలో పడిన కూటమి ప్రభుత్వం
అయితే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బెనిఫిట్ షో రూ.1300 నుంచి రూ.1500 వరకు వేస్తున్నారు. మల్టీప్లెక్స్ లో, థియేటర్లలో మొదటి మూడు రోజులు ఒక ధర, ఆ తర్వాత 8 రోజులు మరో ధర, ఆ తర్వాత వారం రోజులు అంటే 23వ తేదీ వరకు మరో ధరను నిర్మాతలు తెచ్చుకున్నారు. మల్టీప్లెక్స్ ల్లో రూ.200కు పైగా పెంపు ఉంటే, థియేటర్లలో రూ.150కిపైగా పెంపు ఉంది. 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు భారీ ధరలతోనే సినిమాలను అభిమానులైనా, ఇతర హీరోల అభిమానులైనా చూడాల్సి ఉంది. కుటుంబాలు థియేటర్లకు వెళ్లే పరిస్థితి కనపడటంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాతలు కోరినంత ధరలు ఇవ్వాలా? వద్దా? అనే డైలామాలో కూటమి ప్రభుత్వం ఉంది. ఏం జరుగుతుందో, ఎం పెంచుకోవడానికి అనుమతిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications