బాలయ్య-నాగార్జున నటించిన ఏకైక మల్టీస్టారర్ మూవీ
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కొల్లి బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నారు. దీనికి ముందు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి మంచి జోష్ మీద ఉన్నారు. యువ హీరోలకన్నా వేగంగా సినిమాలు చేస్తూ పరిశ్రమలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. బాబీ సినిమా పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.
సరైన కథ దొరకలేదు
కింగ్ నాగార్జున ఇటీవలే నాసామిరంగ సినిమాతో హిట్ కొట్టారు. ధనుష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తున్నారు. దీని తర్వాత తన 100వ సినిమాను గ్రాండ్ గా తీయాలనే ఉద్దేశంలో ఉండి అందుకు తగ్గ కథలను వింటున్నారు. పరిశ్రమలో బాలకృష్ణ, నాగార్జున మధ్య సన్నిహిత సంబంధాలు లేవనే విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏ విషయంలో అంతరం తలెత్తిందనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. గతంలో మాత్రం వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అంటే బాలయ్యకు ఎంతో అభిమానం. బాబాయ్ అని పిలుస్తుంటారు. సంబంధాలు బాగున్న సమయంలో నాగ్, బాలయ్య కలిసి మల్టీస్టారర్ చేయాలని భావించినప్పటికీ అందుకు తగ్గ కథ దొరకలేదు. ఇప్పుడు కథ దొరికినా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు లేవు.

త్రిమూర్తులు యావరేజ్ గా నిలిచింది
1987లో కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలో త్రిమూర్తులు పేరుతో ఓ సినిమా విడుదలైంది. అందులో వెంకటేష్, అర్జున్, రాజేంద్రప్రసాద్ కథానాయకులుగా నటించారు. ఈ సినిమాలోనే బాలకృష్ణ, నాగార్జున కలిసి అతిథి పాత్రలను పోషించారు. వీరే కాకుండా చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, విజయశాంతి, చంద్రమోహన్, మురళీమోహన్ లాంటి అతిరథ మహారథులంతా అలా తళుక్కున ఈ సినిమాలో మెరిశారు. అయితే ఊహించినంత స్థాయిలో హిట్ అవలేదుకానీ యావరేజ్ గా నిలిచింది. టి.సుబ్బరామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.












Click it and Unblock the Notifications