వాళ్ల పేర్లు కూడా నా దగ్గర ఎత్తొద్దు: బాలకృష్ణ
భారీ వర్షాలు, వరదలవల్ల ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా విజయవాడ నగరాన్ని బుడమేరు ముంచెత్తడంతో సగం నగరం మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ విపత్తు నుంచి ప్రజలు బయటపడుతున్నారు. ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలను ప్రకటిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అయితే ఈ వరదలు ప్రభుత్వ సృష్టి అని, కృత్రిమ వరదలని, దీనికి ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
రచ్చచేయడం సబబు కాదు
కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి అర్థం పర్థం లేని ఆరోపణలతో వరదలను ప్రభుత్వ సృష్టి అనడంకంటే హాస్యాస్పదం ఉందా? అంటూ హిందూపురం ఎమ్మెల్యే, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. వరదలపై లేనిపోని రచ్చ చేశారని, అలా రచ్చ చేయడం కూడా సబబు కాదని, ప్రజలను ఆదుకోవాలన్న విషయాన్నే వారు మరిచిపోయారని, వారిపేర్లు ఎత్తడం, వారిగురించి మాట్లాడం కూడా అనవసరమన్నారు. వరదలపై అనవసరమైన రచ్చ చేయొద్దంటూ గట్టిగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన విరాళాల చెక్కులను అందించేందుకు ఆయన విజయవాడ వచ్చారు. బాలయ్యతోపాటు యువ నటులు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ కూడా ఉన్నారు.

సిద్ధును, విశ్వక్ ను కొనియాడిన బాలయ్య
ముఖ్యమంత్రి సహాయ నిధికి సిద్ధు జొన్నలగడ్డ రూ.15 లక్షలు, విశ్వక్ సేన్ రూ.5 లక్షలు ప్రకటించారు. విరాళాలివ్వడానికి ఇటువంటి యువనటులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమంటూ వారిని బాలయ్య కొనియాడారు. గతంలో విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం ఎన్టీఆర్ జోలె పట్టిన విషయాన్ని గుర్తుచేశారు. బాలయ్య, సిద్ధు, విశ్వక్ తోపాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, అనన్య నాగళ్ల లాంటి నటులంతా తమ విరాళాలను ప్రకటించారు. ఆపదలో ఉన్న రాష్ట్రానికి తమవంతుగా చేయూతనందిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications