ఫిల్మ్ ఇండస్ట్రీలో కరోనా కలకలం.. బాలీవుడ్ బ్యూటీకి పాజిటివ్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఒక్కో దేశానికి విస్తరిస్తుండడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఇక మన దేశంలో సైతం చాపకింద నీరులా కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో.. చిత్ర పరిశ్రమను సైతం ఈ మహమ్మారి కలవరపెడుతోంది.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం ప్రజల్లో భయాందోళన పుట్టిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు బంధువు, నటి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీతో పాటు ఆమె తల్లికి సైతం కరోనా పాజిటివ్ రావడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రముఖ బాలీవుడ్ నటి నికితా దత్తా.. కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు. తనతో పాటు తన తల్లికి కూడా ఈ వైరస్ సోకిందని వివరించారు. అంతే కాకుండా ఈ పిలవని అతిథి ఎక్కువ కాలం మాతో ఉండదని ఆశిస్తున్నానని పోస్టులో రాసుకొచ్చారు. ఈ చిన్న క్వారంటైన్ తర్వాత మళ్లీ కలుద్దాం, అందరూ జాగ్రత్తగా ఉండండి అని తెలిపారు. అయితే గతంలో కూడా నికితా దత్తా కొవిడ్ బారిన పడి.. చికిత్స అనంతరం కోలుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 250 దాటడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అంతే కాకుండా మరణాలు సైతం సంభవించడం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM) ఆసుపత్రిలో ఇద్దరు కోవిడ్-19 పాజిటివ్ రోగులు మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. మృతుల్లో ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, 54 ఏళ్ల మహిళ ఉన్నారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.
మాస్కులు ధరించడం సహా అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోవైపు ఆసియా దేశాలైన హాంగ్‌కాంగ్, సింగపూర్ లలో గత కొన్ని రోజులుగా కోవిడ్ కారణంగా ఆస్పత్రి బాట పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.












Click it and Unblock the Notifications