విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది టాలీవుడ్ ప్రముఖులపై ఈడీ కేసు నమోదు
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించిన కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎంటరైంది. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్ సహా 29 మంది సినీ ప్రముఖులపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లను మనీలాండరింగ్ కింద విచారించనుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖ తెలుగు నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, యాంకర్ శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి తదితరులపై కేసు నమోదు చేశారు.
ఇక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లలో నీతూ అగర్వాల్, విష్ణుప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత తదితరుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. వీరితో పాటు పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. భారతీయ న్యాయ సంహితలోని 318(4), 112, రెడ్‌విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్‌లోని 3, 3(ఎ), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.

పంజాగుట్ట పోలీసులు ఇదివరకే యాంకర్లు విష్ణు ప్రియ, రీతు చౌదరి, శ్రీముఖి, శ్యామలను విచారించిన సంగతి తెలిసిందే. అదే విధంగా 19 మంది యాప్ యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈడీ విచారణకు కారణమైన యాప్‌లలో జంగిల్ రమ్మి డాట్ కామ్, ఏ23, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్ విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధని బుక్ 365, మామ 247, తెలుగు 365, ఎస్365, జై365, జెట్ ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్రా365 వంటి వాటి పేర్లు ఉన్నాయి. కేసు నమోదు కావడంతో ఈడీ విచారణ ముమ్మరంగా సాగే అవకాశముంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేయడానికి ఈడీ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications