చైనాను దాటి 19 రోజుల్లో రహస్య షూటింగ్.. దలైలామా రక్షణ వెనుక అసలు కథ!
Four Rivers, Six Ranges: దలైలామా 1959లో టిబెట్ నుంచి ఇండియాకు చేరుకున్న ఘట్టం ప్రపంచ చరిత్రలో ఓ కీలకమైన అధ్యాయం. అయితే ఈ యాత్ర వెనుక దలైలామాను తమ ప్రాణాలను పణంగా పెట్టి సురక్షితంగా సరిహద్దులు దాటించిన అజ్ఞాత యోధుల త్యాగాలు, సాయుధ పోరాటాలు ఎవరికీ ఎక్కువగా తెలియవు. అటువంటి సంచలనాత్మక కథాంశంతో తెరకెక్కిన సినిమా 'ఫోర్ రివర్స్, సిక్స్ రేంజెస్'. షెన్‌షెన్ ఖిమ్సర్ దర్శకత్వం వహించిన ఈ అంతర్జాతీయ సినిమా సెప్టెంబర్ 11న ఇండియాలో హిందీ భాషలో విడుదలవుతోంది. అయితే ఈ సినిమా కథ ఎంత ఉత్కంఠభరితంగా ఉందో.. దీని నిర్మాణ ప్రయాణం కూడా అంతకంటే సంచలనాత్మకంగా సాగింది.
రహస్యంగా చిత్రీకరణ
టిబెట్ ఉనికి, చైనా ఆక్రమణ, దలైలామా రక్షణ కోసం పోరాడిన 'చుషి గ్యాంగ్‌డ్రుక్' అనే టిబెటన్ గెరిల్లా బలగాల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. నేపాల్‌లో చైనాకున్న రాజకీయ ప్రభావం దృష్ట్యా ఈ అసలు కథను వెల్లడిస్తే చిత్రీకరణము అడ్డుకుంటారని భావించిన డైరెక్టర్ ఖిమ్సర్.. ఓ తెలివైన ప్లాన్ వేశారు. నేపాల్ ప్రభుత్వ అనుమతి కోసం 'ది హిమాలయన్ రాబిన్ హుడ్' అనే ఱఫేక్ స్క్రిప్ట్, టైటిల్‌ను సమర్పించారు. సాధారణంగా 45 నుంచి 60 రోజుల పాటు జరిగే ఈ షూటింగ్‌ను, స్థానిక పోలీసుల నిఘా నేపథ్యంలో ఏ మాత్రం సందేహం రాకుండా కేవలం 19 రోజుల్లోనే ఈ సినిమాను పూర్తి చేశారు.

నటులకు కఠిన శిక్షణ, ప్రాణాలకు తెగించి చిత్రీకరణ
ఈ సినిమాలో నటించిన కళాకారులకు అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాల్లో గుర్రపు స్వారీ, ఆయుధ ప్రయోగంపై వారం రోజుల్లోనే కఠిన శిక్షణ ఇచ్చారు. యోధుల ఆకలి, అలసట, మానసిక వేదన నటుల ముఖాల్లో సహజంగా కనిపించడం కోసం దర్శకుడు దాదాపు ఓ నెల రోజుల పాటు నటులను స్నానం చేయనివ్వకుండా కఠినమైన నిబంధనలు అమలు చేశారు. ఓ ప్రధాన యాక్షన్ సీన్లలో మంటలు, పేలుళ్ల మధ్య కెమెరా ఆపరేట్ చేయడం ప్రమాదకరంగా మారడంతో దర్శకుడు ఖిమ్సర్ స్వయంగా తడిసిన జనపనార సంచితో రక్షణ కవచం తయారు చేసుకుని ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు.
రీళ్ల రహస్య రవాణా, ఇండియాకు సురక్షిత చేరిక
సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం అసలు సవాలు ఎదురైంది. చిత్రీకరించిన ఫిల్మ్ రీళ్లను నేపాల్ అధికారులు లేదా చైనా ఏజెంట్లు స్వాధీనం చేసుకుంటే ఇన్నేళ్ల కష్టం వృథా అవుతుందని భావించిన మేకర్స్.. మాస్టర్ ఫుటేజ్, డూప్లికేట్ కాపీలను వేర్వేరు వాహనాల్లో ఉంచారు. ఒక వాహనం పట్టుబడినా మరొకటి సురక్షితంగా ఉండాలనే వ్యూహంతో రాత్రికి రాత్రే ఆ రీళ్లను నేపాల్ సరిహద్దు దాటించి ఇండియాకు చేర్చారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ వాయిస్ ఓవర్
టిబెట్ పోరాటం కేవలం ఓ చారిత్రక అంశం మాత్రమే కాదని, అది భారతదేశ భద్రత, హిమాలయా సరిహద్దు భౌగోళిక రాజకీయాలతో ముడిపడి ఉందని దర్శకుడు వెల్లడించారు. ఈ సినిమా విశిష్టతను గుర్తించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఈ సినిమాకు హిందీలో వాయిస్ ఓవర్ అందించారు. చరిత్రలో మరుగునపడిపోయిన అజ్ఞాత వీరుల త్యాగాలను లోకానికి చాటిచెప్పేలా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.













Click it and Unblock the Notifications
