ఉత్తరాంధ్రను ఊపేసిన చిన్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి.. ఎందులో చూడాలంటే..?
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ తీసుకున్నా భారీ బడ్జెట్ సినిమాలు.. భారీ వీఎఫ్ఎక్స్ లు.. మాస్ యాక్షన్ సీన్స్.. భారీ తారాగణం.. హాలీవుడ్ స్థాయి మేకింగ్.. ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే ఇలాంటి సమయంలో కంటెంట్ ఆధారిత సినిమాలు.. వాస్తవ కథనాలతో వస్తున్న సినిమాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన ఓ బయోపిక్ ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సైలెంట్ గా రిలీజ్ అయి అటు విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు.. సాధారణ సినీ ప్రేక్షకుడికి సైతం కనెక్ట్ అయింది. అదే 'గరివిడి లక్ష్మి' మూవీ.. ఉత్తరాంధ్రకు చెందిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ అక్టోబర్ 17 న విడుదలైన సంగతి తెలిసిందే.
ఇటీవలి కాలంలో ఏ హీరోయిన్ అయినా కెరీర్ కోసం గ్లామర్ పాత్రలను ఎంచుకుంటుంటే టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆనంది మాత్రం సాహసం చేసి ఈ మూవీలో టైటిల్ రోల్ లో నటించి గరివిడి లక్ష్మి పాత్రకు ప్రాణం పోసింది. మూవీలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రేక్షకుల నుంచే కాకుండా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా ఆమె నటనను మెచ్చుకున్నారు. ఇక ఈ మూవీలో ఆనందితో పాటుగా సీనియర్ నటి రాశి, రాగ్ మయూర్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఈ చిత్రంతో ఉత్తరాంధ్ర జానపద, బుర్రకథలకు పేరు తీసుకొచ్చిన కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితాన్ని ప్రేక్షకులకు చెప్పాలన్న దర్శకుడు సంకల్పం నెరవేరింది.

చదువు రాని ఓ పల్లెటూరి అమ్మాయి తనకు ఉన్న టాలెంట్ తో ఉన్నత స్థాయికి ఎదిగే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు, నమ్మినవాళ్లే ఆమెను మోసం చేసి గుర్తింపును ఎలా దోచుకున్నారనే హృదయవిదారకమైన విషయాలను ఇందులో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గరివిడి లక్ష్మి మూవీ నవంబర్ 13.. శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఈ సినిమాను ఓటీటీలో చూసే అవకాశం లభించనుంది.












Click it and Unblock the Notifications
