లాభాల్లో వాటా కోసం నిర్మాతతో గొడవ పడుతున్న 'హనుమాన్' డైరెక్టర్?
ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో హనుమాన్ సంచలన విజయం సాధించింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలై దాదాపు రూ.300 కోట్ల వసూళ్లకు దగ్గరలో ఉంది. తెలుగులో థియేటర్లు కేటాయించకుండా సినీ పెద్దలు అడ్డుపడ్డప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో రిలీజ్ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి ముందుగా ఇచ్చిన పారితోషికం కాకుండా హీరో తేజకు రూ.5 కోట్లు, దర్శకుడు ప్రశాంత్ వర్మకు రూ.6 కోట్లు ఇచ్చారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక విషయం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. సినిమా విడుదల విషయంలో హీరో, నిర్మాత, దర్శకుడు ఒకేమాట నిలబడి ఐకమత్యం చాటారు. అయితే సినిమాకు వచ్చిన వసూళ్లు నిర్మాత, దర్శకుడి మధ్య చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ తనకు లాభాల్లో వాటా కావాలని నిర్మాతతో గొడవ పడుతున్నట్లు సినీవర్గాల సమాచారం. రూ.30 కోట్లు తనకు షేర్ గా ఇవ్వాలని దర్శకుడు ఒత్తిడి తెస్తున్నారంటున్నారు.

హనుమాన్ సీక్వెల్ "జై హనుమాన్" మూవీకి రెమ్యునరేషన్ కింద మరో 30 కోట్లు అడ్వాన్స్, లాభాల్లో వాటా కావాలని భీష్మించుకు కూర్చున్నట్లు తెలుస్తోంది. జై హనుమాన్ సినిమాకు సంబంధించి దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా భారీగా తీయాల్సి ఉన్న తరుణంలో దర్శకుడు వర్మ నిర్మాతకు పెద్ద షాకే ఇచ్చాడంటున్నారు.
ఒకవేళ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రశాంత్ వర్మ షరతులకు ఒప్పుకోకపోతే "జై హనుమాన్"పై ఆ ప్రభావం పడుతుందంటున్నారు. వివాదం ముదిరితే సినిమా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. మొత్తానికి ఎంతో విజయాన్ని అందించిన హనుమాన్ వల్ల నిర్మాతకు, డైరెక్టర్ కు.. ఇద్దరికీ సంతోషం లేకుండా పోయింది. డైరెక్టర్ అడిగినంత నిర్మాత ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications