పందుల పెంపకంతో ఏడాదికి 8 లక్షల ఆదాయం.. గిరిజన మహిళ అద్భుత ఘనత!
చేతనైన పని చేసుకుంటూ సాధారణంగా జీవించడం వేరు.. చేసే పనిలో నిజాయితీ వెతుక్కుని, దానికి కష్టాన్ని జోడించి విజయం సాధించడం వేరు. సమాజంలో కొన్ని పనులను చులకనగా చూసే ధోరణి ఇంకా పోలేదు. కానీ, ఏ పనినైనా చిన్నచూపు చూడకుండా, దాన్ని ఒక అద్భుతమైన వ్యాపార అవకాశంగా మార్చుకుంటే లాభాల పంట పండించవచ్చని నిరూపించింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక గిరిజన మహిళ. ఆలోచన మంచిదైతే, శ్రమించే తత్వం ఉంటే ఆదాయం వెతుక్కుంటూ వస్తుందని నిరూపిస్తూ, తీవ్ర పేదరికంలో ఉన్న తన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా, ఊరంతటికీ సరికొత్త బతుకుదెరువును చూపించి ఆదర్శంగా నిలిచింది 'లఖ్పతీ దీదీ' దిల్‌మతి.
ఒకప్పటి పేదరికం.. 'మా దుర్గ' గ్రూపుతో మారిన రాత!
ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతమైన బలరాంపూర్ జిల్లా లడువా గ్రామానికి చెందిన దిల్‌మతి కుటుంబం కొన్నేళ్ల క్రితం వరకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేది. సాంప్రదాయ వ్యవసాయంపై వచ్చే అరకొర ఆదాయంతో ఇల్లు గడవడం గగనంగా మారిన తరుణంలో ఆమె జీవితం ఒక మలుపు తిరిగింది. స్థానిక 'మా దుర్గా మహిళా స్వయం సహాయక సంఘం' (SHG) (డ్వాక్రా గ్రూప్) లో సభ్యురాలిగా చేరిన దిల్‌మతి.. పొదుపు సంఘం సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేది. అక్కడ అధికారులు చెప్పిన స్వయం ఉపాధి మార్గాల గురించి విని, ఎవరూ పెద్దగా ఆసక్తి చూపని 'పందుల పెంపకం' (Piggery) చేపట్టాలని నిర్ణయించుకుంది.

రూ. 1 లక్ష అప్పు.. నేడు లక్షల టర్నోవర్!
సొంతంగా వ్యాపారం ప్రారంభించేందుకు గ్రూపు ద్వారా రూ. లక్ష లోన్ తీసుకున్న దిల్‌మతి.. పక్క రాష్ట్రమైన జార్ఖండ్ నుంచి 10 పందులను కొనుగోలు చేసి ఫామ్ ప్రారంభించింది. మొదట్లో ఎన్నో సవాళ్లు, హేళనలు. ఊరంతా ఛీ కొట్టి.. అసహ్యించుకుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా ఆమె వెనకడుగు వేయలేదు. ఎందుకంటే తాను తప్పు చేయడం లేదని బలంగా నమ్మింది.
ఏడాది తిరిగేసరికి పందుల పెంపకం ద్వారాఆమెకు ఆదాయం రావడం మొదలైంది. ఒక ఆడ పంది ఒకేసారి 9 నుంచి 10 పిల్లలకు జన్మనిస్తుందని, ఒక్కో పిల్ల అమ్మకం ద్వారా రూ. 5 వేల వరకు ఆదాయం వస్తుందని దిల్‌మతి తెలిపింది. దీని ద్వారా ప్రతి ఆరు నెలలకూ రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు లాభం రావడం ప్రారంభమైంది.
ప్రస్తుతం ఆమె ఫామ్‌లో 9 పెద్ద ఆడ పందులు ఉన్నాయి. పందులపై వచ్చిన ఆధాయంతోనే కోళ్ల పెంపకం, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆర్గానిక్ కూరగాయల సాగు, వరి, మొక్కజొన్న నూర్పిడి యంత్రాలను కూడా కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ మల్టీ బిజినెస్ ద్వారా ఆమె కుటుంబం ఏడాదికి ఏకంగా రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు సంపాదిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంది.
ఊరంతా అదే బాట.. కలెక్టర్ ప్రశంసలు!
దిల్‌మతి సాధించిన అసాధారణ విజయాన్ని చూసి మొదట్లో పెదవి విరిచిన స్థానికులు.. ఇప్పుడు ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. లడువా పంచాయతీలోని దాదాపు 10 నుంచి 15 కుటుంబాలు ప్రస్తుతం పందుల పెంపకాన్ని ఉపాధిగా ఎంచుకుని మంచి లాభాలు గడిస్తున్నాయి. ఒక మహిళ తెగింపు ఒక ఊరి ఆలోచనా విధానాన్ని మార్చేయగా.. దిల్‌మతి ప్రతిభను బలరాంపూర్ జిల్లా కలెక్టర్ చందన్ సంజయ్ త్రిపాఠి ప్రత్యేకంగా అభినందించారు.
రాబోయే రోజుల్లో వ్యవసాయ శాఖ సహకారంతో ఇక్కడ 'గోట్ క్లస్టర్' (మేకల పెంపకం కేంద్రం) ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. లఖ్పతీ దీదీలకు మేలు రకమైన మేక పిల్లలను అందించి, మరింత మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. తానే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజం బాగుపడాలని కోరుకునే దిల్‌మతి లాంటి మహిళలు నిజంగా దేశానికే గర్వకారణం.












Click it and Unblock the Notifications