రేషన్ లబ్దిదారులకు శుభవార్త.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు!
తెలంగాణ రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కుటుంబాలకు క్యూఆర్ కోడ్ తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ప్రింటింగ్ ప్రక్రియను పూర్తి చేసింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్డుల పంపిణీ కి సంబంధించిన తేదీని త్వరలో ప్రకటించనున్నారు. క్యూఆర్ కోడ్ తో ఉన్న ఈ కార్డులను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు పంపించారు.
రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియకు రంగం సిద్ధం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముహూర్తం ఖరారు చేసిన వెంటనే కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు తరహాలో రేషన్ కార్డు రూపొందించింది. దీనిపైన యజమాని పేరు, చిరునామా వంటి వివరాలు ఉంటాయి. ముఖ్యమంత్రి మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు కూడా ఈ కార్డు పైన ముద్రించబడి ఉన్నాయి.

చిన్న సైజు డెబిట్, క్రెడిట్ కార్డు లాగా స్మార్ట్ రేషన్ కార్డు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులను ఈ విధంగా చిన్న సైజు డెబిట్, క్రెడిట్ కార్డు లాగా తీసుకు రావడం ఇదే తొలిసారి. అక్క తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు అందించగా, తెలంగాణ రాష్ట్రం కూడా ఈ మేరకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడానికి రెడీ అవుతోంది.
రేషన్ వారికి నేరుగా చేరేలా నిర్ణయం
ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ తీసుకోవడం లబ్ధిదారులకు ఈజీ అవుతుంది. దీనిపై ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగానే రేషన్ లబ్ధిదారుల కుటుంబ వివరాలు, అప్పటివరకు తీసుకున్న రేషన్ తాలూకా వివరాలు కూడా ఉంటాయి. లబ్ధిదారులకు ఎక్కడ అన్యాయం జరగకుండా, రేషన్ వారికి నేరుగా చేరేలా నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డును అందిస్తుంది.
కార్డ్ స్కాన్ చేస్తే రేషన్ తో సహా అన్ని వివరాలు
రేషన్ లబ్ధిదారు తీసుకున్న రేషన్ తో సహా కార్డ్ స్కాన్ చేస్తే కనిపించే క్రమంలో రేషన్ అక్రమాలకు చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మరోవైపు రేషన్ కార్డులో బయోమెట్రిక్ ఉన్న ఎవరైనా బయోమెట్రిక్ సహాయంతో రేషన్ తీసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం మాత్రమే కాకుండా, కార్డు సంఖ్య చెప్పిన కూడా రేషన్ ఇస్తారు.
రేషన్ యాప్ పైన అధికారుల సూచన
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డుల తయారీ ఖర్చును భరించడం మాత్రమే కాకుండా కార్డుదారుల పైన ఎటువంటి ఆర్థిక భారం ఉండదని చెబుతోంది. ఇది మాత్రమే కాకుండా టీ రేషన్ యాప్ ను ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని ఓటిపి ద్వారా రేషన్ కార్డు కు లింక్ చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.
రేషన్ పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం
ఎం పిన్ కూడా క్రియేట్ చేసుకోవాలని చెబుతున్నారు. ఏది ఏమైనా రేషన్ తీసుకునే వారికి సౌలభ్యంగా ఉండడం కోసం, పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు త్వరలో పంపిణీ చేయనున్నారు.












Click it and Unblock the Notifications