Video: దూసుకెళ్లిన వందేభారత్.. స్పీడ్ పెంచి వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి
భారతీయ రైల్వే చరిత్రలో మరో అద్భుతమైన మైలురాయి నమోదైంది. దేశాన్ని విస్మయపరిచే ఇంజనీరింగ్ అద్భుతాలుగా నిలిచిన చీనాబ్- అంజి వంతెనలపై తొలిసారిగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. జమ్ము-శ్రీనగర్ రైలు మార్గంలో ఈ రెండు ప్రసిద్ధ వంతెనలపై ఈ వేగంతో రైలు నడపడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చారిత్రక ఘట్టానికి సంబంధించిన అద్భుతమైన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలతో పంచుకున్నారు. దేశ ఇంజనీరింగ్ ప్రతిష్టను చాటే ఈ దృశ్యాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని ఉంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గంలో (యూఎస్‌బీఆర్‌ఎల్) అత్యంత కీలకమైన 111 కిలోమీటర్ల కత్రా-బనిహాల్ సెక్షన్‌లో రైళ్ల టాప్ స్పీడ్ లిమిట్ పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ గత ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. భద్రతా ప్రమాణాలన్నీ కచ్చితంగా నెరవేరాయని నిర్ధారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ఈ మార్గంలో రైళ్లు తక్కువ వేగంతోనే ప్రయాణించేవి. ముఖ్యంగా శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి సంగల్దాన్ మధ్య గరిష్టంగా 85 కి.మీ, సంగల్దాన్ నుంచి బనిహాల్ మధ్య 75 కి.మీ వేగంతో మాత్రమే నడిచేవి. ఇప్పుడు వేగ పరిమితిని 100 కి.మీకి పెంచడంతో ప్రయాణ సమయం మరింత తగ్గడంతో పాటు ప్రయాణం ఎంతో వేగవంతం కానుంది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ వంతెన ప్రత్యేకతలు
ఈ మొత్తం రైలు మార్గం హిమాలయాల అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల మధ్య నిర్మించబడింది. ఇందులో ఉన్న చీనాబ్ రైలు వంతెన నది మట్టానికి ఏకంగా 359 మీటర్ల ఎత్తులో, 1,315 మీటర్ల పొడవుతో నిర్మితమైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జిగా ప్రభుత్వ రికార్డుల్లో నిలిచింది.
అలాగే అంజి ఖద్ వంతెన భారతదేశపు మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెనగా గుర్తింపు పొందింది. ఈ మార్గంలో దాదాపు 119 కిలోమీటర్ల పొడవున 36 టన్నెల్స్, 900లకు పైగా వంతెనలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉన్న 'టి-50' టన్నెల్ ఏకంగా 12.77 కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోనే అత్యంత పొడవైన ఆపరేషనల్ రవాణా సొరంగ మార్గంగా రికార్డు సృష్టించింది.
100 km/h over India’s engineering pride! 🇮🇳 pic.twitter.com/4GlR5QJTva
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 2, 2026
కశ్మీర్ లోయను దేశంతో అనుసంధానిస్తున్న అద్భుత రైలు మార్గం
కాశ్మీర్ లోయను మిగిలిన భారతదేశ రైల్వే నెట్‌వర్క్‌తో అన్ని కాలాల్లోనూ అనుసంధానించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 272 కిలోమీటర్ల యూఎస్‌బీఆర్‌ఎల్ ప్రాజెక్టు 2025 జూన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆ సమయంలో కత్రా-సంగల్దాన్ సెక్షన్ ప్రారంభం కాగా, కత్రా నుంచి శ్రీనగర్ వరకు వందేభారత్ సర్వీసులు మొదలయ్యాయి.
ఆ తర్వాత 2026 ఏప్రిల్‌లో ఈ సర్వీసులను జమ్ము తవి వరకు పొడిగించడంతో పాటు బోగీల సంఖ్యను 8 నుంచి 20కి పెంచారు. మే 2 నుంచి జమ్ము-శ్రీనగర్ మధ్య రెగ్యులర్ సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ మార్గంలో గరిష్ట వేగాన్ని 100 కి.మీకి పెంచడం ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లయింది.














Click it and Unblock the Notifications
