ప్రయాణీకులకు గుడ్ న్యూస్: మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్.. ఛార్జీల వివరాలు ఇవిగో!
హైదరాబాద్ మహానగర పరిధిలోని ప్రయాణీకుల రవాణా అవసరాలను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో ప్రయాణించే పౌరుల కోసం హైదరాబాద్ మెట్రో, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) సంయుక్తంగా రూపొందించిన ఒకే ఉమ్మడి పాస్‌ను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారుల సమక్షంలో ఈ నూతన కామన్ పాస్‌ను ఆవిష్కరించారు.
ఈ కామన్ పాస్ ఆవిష్కరణ వెనుక ప్రధాన లక్ష్యం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరాటంకమైన, సులభతరమైన, సమగ్ర ప్రజారవాణా అనుసంధానాన్ని కల్పించడమే. నిత్యం లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నగరంలో ప్రయాణాల కోసం బస్సులు, మెట్రో రైళ్లపై ఆధారపడుతుంటారు. ఇప్పటివరకు వేర్వేరుగా టికెట్లు లేదా పాస్‌లు తీసుకోవాల్సి రావడం వల్ల సమయం వృథా అవ్వడంతో పాటు ఇబ్బందులు ఎదురవుతుండేవి. ఈ కొత్త విధానం ద్వారా ప్రయాణీకులు ఒక్క కార్డుతోనే రెండు రవాణా వ్యవస్థల సేవలను వినియోగించుకోవచ్చు.

ప్రయాణీకుల సౌకర్యం కోసం ప్రభుత్వం ఈ కామన్ పాస్‌లలో రోజువారీ, నెలవారీ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజువారీ ఉమ్మడి పాస్ ధరను రూ.400గా నిర్ణయించారు. ఇందులో మెట్రో ప్రయాణ ఛార్జీ కింద రూ.300 , ఆర్టీసీ ప్రయాణ ఛార్జీ కింద రూ.100 వేర్వేరుగా లెక్కించబడతాయి. అలాగే రోజూ ప్రయాణించే వారి కోసం నెలవారీ ఉమ్మడి పాస్‌ను రూ.8,500లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నెలవారీ పాస్‌లో మెట్రో వాటా రూ.7,000 కాగా.. ఆర్టీసీ వాటా రూ.1,500గా లెక్కించబడతాయి.
ఈ స్మార్ట్ కార్డ్ డిపాజిట్, వినియోగ నిబంధనలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రయాణీకులు మొదటిసారి ఈ కార్డును కొనుగోలు చేసేటప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ కార్డు అవసరం లేదనుకుని ఆర్టీసీ లేదా మెట్రో యాజమాన్యానికి తిరిగి ఇచ్చేస్తే ఆ రూ.100 డిపాజిట్ సొమ్మును ప్రయాణీకుడికి తిరిగి వాపసు చేస్తారు.
ఈ కామన్ పాస్ వినియోగం లిమిట్స్ విషయానికి వస్తేయ.. ఔటర్ రింగ్ రోడ్(ORR) పరిధి లోపల నడిచే అన్న రకాల ఆర్టీసీ సిటీ బస్సులతో పాటు మెట్రో రైళ్లన్నింటిలోనూ ప్రయాణించడానికి ఇది వర్తిస్తుంది. సిటీ సాధారణ, ఆర్టినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే శంషాబాద్ విమానాశ్రయానికి నడిచే ప్రత్యేక ఏసీ బస్సులు అయిన 'పుష్పక్' సర్వీసులకు మాత్రం ఈ పాస్ వర్తిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నూతన ఉమ్మడి పాస్ విధానం వల్ల నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా ప్రజారవాణా వినియోగం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications
