సౌత్ సినిమాల్లో "ఇలియానా"ను బ్యాన్ చేయడానికి రీజన్ ఇదేనా ?
ఇలియానా ... ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసిన స్టార్ హీరోయిన్. 2006లో 'దేవదాసు' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ వెంటనే మహేష్ బాబు సరసన 'పోకిరి'లో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత జల్సా, కిక్, జులాయి వంటి వరుస హిట్ చిత్రాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తక్కువ కాలంలోనే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి అగ్ర హీరోలతో నటించి, సుమారు దశాబ్దం పాటు పరిశ్రమలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
కాగా తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుని పాన్ ఇండియా గుర్తింపు సంపాదించింది. బాలీవుడ్‌లో 'బర్బార్ దేఖో', 'దో ఔర్ దో ప్యార్', 'పఘలెట్' వంటి సినిమాల్లో నటించి అక్కడ కూడా తన నటనకు మంచి మార్కులు పొందింది. అయితే అత్యంత డిమాండ్‌లో ఉన్న సమయంలోనే ఇలియానా అకస్మాత్తుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు దూరమైంది. దీనిపై చాలా కాలంగా పలు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఓ నిర్మాత ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు.

కారణం అదే..
సదరు నిర్మాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ తమిళ నిర్మాత నుంచి ఇలియానా రూ.40 లక్షల అడ్వాన్స్ తీసుకుని, ఆ సినిమాకు డేట్స్ ఇవ్వకపోవడం, డబ్బు తిరిగి చెల్లించకపోవడం వల్ల నిర్మాతల సంఘం ఆమెపై నిషేధం విధించినట్టు చెప్పుకొచ్చారు. నిర్మాతల సంఘం లాగ్ షీట్లను పరిశీలించగా, అడ్వాన్స్ తీసుకున్న కాలంలోనే ఆమె వేరే చిత్రంలో నటించినట్లు తేలిందని తెలిపారు. నిబంధనల ప్రకారం అడ్వాన్స్ తీసుకున్నాక సినిమా చేయాలి లేదా ప్రాజెక్ట్ మొదలుకాకపోతే డబ్బు తిరిగి ఇవ్వాలన్నారు.
ఈ నిబంధన ఉల్లంఘన కారణంగానే ఇలియానాపై టాలీవుడ్, కోలీవుడ్‌లలో నిషేధం విధించారని ఆ నిర్మాత వెల్లడించారు. ఆ సమయంలో ఆమె విజయ్ "స్నేహితుడు" ( తెలుగులో ) సినిమాలో నటిస్తుండగా.. అదే ఆమె చివరి తమిళ చిత్రంగా నిలిచింది. ఈ నిషేధం తర్వాత 2012 నుంచి దాదాపు ఆరేళ్ల పాటు ఇలియానా తెలుగు, తమిళ చిత్రాల్లో కనిపించలేదు. 2018లో రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో ఆమె మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సీక్రెట్ మ్యారేజ్..
ఇక ఈ భామ వ్యక్తిగత జీవితానికి వస్తే ఇలియానా 2014లో భారత పౌరసత్వాన్ని వదిలి పోర్చుగల్ పౌరసత్వాన్ని స్వీకరించింది. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న అమెరికన్ నటుడు మైఖేల్ డోలన్‌ను 2023లో రహస్యంగా వివాహం చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో ఆమె తొలి కుమారుడికి జన్మనిచ్చింది. అతడికి 'కోవా ఫీనిక్స్ డోలన్' అని పేరు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అప్పటివరకు తన వివాహాన్ని గోప్యంగా ఉంచడంతో, ఆమె భర్త ఎవరన్నదానిపై పెద్ద చర్చ నడిచింది.
ఇటీవలే ఇలియానా రెండో బిడ్డకు కూడా జన్మనిచ్చినట్లు సమాచారం. రెండో బిడ్డకు 'కియాను రఫే డోలన్' అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పూర్తిగా కుటుంబ జీవితానికే సమయం కేటాయిస్తూ ఆనందంగా గడుపుతోంది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం తన ఫ్యామిలీ మూమెంట్స్‌ను షేర్ చేస్తూ అభిమానులతో కనెక్ట్ అవుతోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌కే పరిమితమయ్యే ఆలోచనలో ఉందని, సరైన కథ దొరికితే మాత్రమే తిరిగి నటించాలనే భావనలో ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications