బిగ్ బ్రేకింగ్.. ఫోన్ ట్యాపింగ్ రాధాకిషన్ రావు కేసులో ప్రముఖ నిర్మాత
తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతమైన సంస్థగా మైత్రీ మూవీస్ ఎదిగింది. శ్రీమంతుడు సినిమాతో ప్రారంభించి ప్రస్తుతం పుష్ప2 సినిమా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని నవీన్ పై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కీలక సూత్రధారిగా ఉన్న మాజీ డీసీసీ రాధాకిషన్ రావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు చెన్నుపాటి వేణు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును నమోదు చేశారు. తాజాగా నిర్మాత నవీన్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

గతంలో క్రియా హెల్త్ కేర్ ను వేణు ప్రారంభించారు. సంస్థలో ఒక డైరెక్టర్ గా ఉన్న మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ తోపాటు మరికొందరు డైరెక్టర్లు చంద్రశేఖర్ అనే వ్యక్తితో కలిసి తనను కిడ్నాప్ చేయించారని, సంస్థను వేరేవారి పేరుమీద బదలాయించడంలో రాధాకిషన్ రావు బెదిరింపులకు గురిచేశారని వేణు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కిడ్నాప్ లో వీరందరి ప్రమేయం ఉందని వేణు వెల్లడించారు.
ఎర్నేని నవీన్ ప్రస్తుతం పుష్ప2 సినిమాను అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడు కాగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. హిందీ బెల్ట్ లో కూడా దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నారు. భారీ చిత్రాలకు పెట్టింది పేరైన మైత్రీ మూవీస్ యాజమాన్యం కిడ్నాప్ కేసులో చిక్కుకోవడంతో భవిష్యత్తులో వీరు ఏం చేస్తారనేది చూడాలి. నైజాంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా వీరు దిగారు. దిల్ రాజుకు పోటీగా సినిమాలను పంపిణీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications