బాలకృష్ణ - నాగార్జున కాంబినేషన్ లో మిస్సైన మల్టీస్టారర్ సినిమాలు
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోరుమీద ఉన్నారు. తన సహచర కథానాయకులైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కన్నా ఎంతో వేగంగా సినిమాలు చేయడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తున్నారు. వరుసగా హ్యాట్రిక్ సూపర్ హిట్ సినమాలు అందించిన బాలయ్య ప్రస్తుతం తన 109వ సినిమాగా బాబీ దర్శకత్వంలో చేయబోతున్నారు. విజయదశమికి విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
అలాగే మన్మథుడు అక్కినేని నాగార్జున ఇటీవలి కాలంలో వరుసగా పరాజయాలు పలకరించడంతో కసిమీద నా సామిరంగ అనే సినిమా తీసి మంచి హిట్ కొట్టారు. సంక్రాంతికి సినిమా విడుదలైతే హిట్ అనే ముద్ర నాగార్జునమీద పడిపోయింది. ఈసారి సంక్రాంతికి కూడా రాబోతున్నానంటూ ముందుగానే చెప్పేశారు. వాస్తవానికి నందమూరి తారకరామారావు వారసుడైన బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు వారసుడైన నాగార్జున కు ప్రస్తుతం పరిశ్రమలో మంచి సంబంధాలు లేవని అంటుంటారు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రూపుదిద్దుకోవాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలవల్ల అది సాధ్యపడలేదు. మళయాళంలో ఘనవిజయం సాధించిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమాను చేద్దామనుకున్నారుకానీ డేట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. తర్వాత నేరుగా ఒక కథను సిద్ధం చేసుకొని సినిమా చేయాలనుకున్నారు బాలకృష్ణ, నాగార్జున.
వీరిద్దరి ఇమేజ్ కు సరిపడా కథ దొరక్కపోవడంతో ఆ ప్రయత్నాన్ని కూడా విరమించుకున్నారు. అలా ఇద్దరు హీరోలు గట్టిగానే ప్రయత్నించినప్పటికీ మల్టీస్టారర్ సినిమా మాత్రం చేయలేకపోయారు. దీంతో నందమూరి, అక్కినేని అభిమానులు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే వీరిద్దరి కాంబినేషన్ లో రావడం అసాధ్యమని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications