గుహను వీడిన కూన... సింహంలా: నందమూరి మోక్షజ్ఞ సినిమా ఖరారు
నందమూరి అభిమానులు, సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఏళ్లకు తరబడి ఎదురుచూస్తున్న ఆ ముహూర్తం రానే వచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం కావడానికి పూర్తిస్థాయిలో రంగం సిద్ధమైంది. 'బింబిసార' చిత్రంతో సంచలన విజయం సాధించిన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ తన తొలి అడుగు వేయనుండగా, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
పుట్టినరోజు సందర్భంగా ప్రకటన
మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. బాలకృష్ణ, మోక్షజ్ఞ, దర్శకుడు వశిష్ఠ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ కలసి ఉన్న ప్రత్యేక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. ''కూన గుహను వీడింది.. సింహంలా అడవిలోకి అడుగు పెట్టింది. హ్యాపీ బర్త్‌డే మోక్షజ్ఞ" అంటూ మైత్రీ మూవీ మేకర్స్ పవర్ ఫుల్ క్యాప్షన్‌ను జోడించింది. తన డెబ్యూ ప్రాజెక్ట్ విషయంలో మోక్షజ్ఞ, బాలకృష్ణ చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. కథ ఎంపిక కోసం తగిన సమయం తీసుకుని, నటన, డాన్స్, ఫైట్స్‌లో మోక్షజ్ఞ ఇప్పటికే ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్నారు. గతంలో ప్రశాంత్ వర్మతో సినిమా చర్చలు జరిగినప్పటికీ, చివరికి వశిష్ఠ చెప్పిన ఆకట్టుకునే కథకే మోక్షజ్ఞ ఓటు వేశారు.

సోషియో ఫాంటసీ కథతో
'బింబిసార' చిత్రంతో అలరించిన వశిష్ఠ, మోక్షజ్ఞ ఎంట్రీ కోసం సోషియో-ఫాంటసీ, పీరియాడిక్ అంశాలతో కూడిన భారీ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నందమూరి వంశం నుంచి వస్తున్న మరో వారసుడి ఎంట్రీ కావడంతో పాన్-ఇండియా ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక నిపుణులతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అతి త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుండగా, కథానాయిక, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.














Click it and Unblock the Notifications
