తరగతి గదిలో బిగ్ బాస్ రచ్చ: షాకింగ్ నిజాలు వెలుగులోకి.. కేంద్రం సీరియస్ యాక్షన్!
ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణాలు, తరగతి గదులను వాణిజ్య వినోద కార్యక్రమాల ప్రచార వేదికలుగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నల్గొండ పట్టణంలోని ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాల తరగతి గదిలో బిగ్బాస్ తెలు సీజన్-10 రియాలిటీ కంటెస్టెంట్కు ఓట్లు వేయాలంటూ ప్రచారం నిర్వహించిన ఉదంతంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అధికారులను ఆదేశించాయి.
వాణిజ్య ప్రచారం మైనర్లు: కేతిరెడ్డి ఫిర్యాదు
నల్గొండ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులతో బిగ్బాస్ ఓటింగ్ ప్రచారం చేయించినట్లు వచ్చిన దృశ్యాలను గమనించిన తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి కార్యాలయానికి, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు, జాతీయ బాలల పరిరక్షణ కమిషన్కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే వేదికలు. వాటిని ప్రైవేట్ రియాలిటీ షోల ఓటింగ్ ప్రచారానికి ఉపయోగించడం చట్టవిరుద్ధం. మైనర్ విద్యార్థులను వాణిజ్య ప్రచారాలలో భాగస్వాములను చేయడం బాలల హక్కుల తీవ్ర ఉల్లంఘన" అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005, జువైనల్ జస్టిస్ చట్టం 2015 నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.
జిల్లా కలెక్టర్కు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారిక లేఖ
తమిళనాడు తెలుగు యువశక్తి చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు పంపింది. ఫిర్యాదులోని అంశాల తీవ్రతను గుర్తించిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్కు అధికారిక లేఖ జారీ చేసింది. ఈ విషయంపై చట్టపరమైన నిబంధనల ప్రకారం సమగ్ర విచారణ జరిపి తీసుకున్న చర్యల వివరాలను కమిషన్తో పాటు ఫిర్యాదుదారునికి సమర్పించాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) తన లేఖలో స్పష్టం చేసింది.
సమగ్ర విచారణకు డిమాండ్
ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ముఖ్యంగా కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. విద్యాసంస్థ ప్రాంగణంలోకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కళాశాల యాజమాన్యం నుంచి ముందస్తు అనుమతులు ఉన్నాయా లేదా అనేది తేలాలన్నారు. ఈ ప్రచారంలో పాల్గొన్న మైనర్ విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఉందా? వారి అనుమతి తీసుకున్నారా అనే విషయంపై స్పష్టత రావాలన్నారు. జియో హాట్స్టార్ లేదా ఇతర వేదికల ద్వారా మైనర్ విద్యార్థులతో ఓట్లు వేయించమని ఒత్తిడి తెచ్చారా? అనే దానిపై తేలాలని ఆయన పేర్కొన్నారు.
కళాశాలలోని సీసీటీవీ ఫుటేజ్, వీడియో రికార్డులు, అనుమతి పత్రాలు పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే బాధ్యులైన అధికారులపై, నిర్వాహకులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆయన విజ్ఞప్తి చేశారు.














Click it and Unblock the Notifications
