మోడీ కేబినెట్ ప్రక్షాళన ఖరారు..! ఇప్పటికే నలుగురు అవుట్-త్వరలో మరో నలుగురు.!
కేంద్ర కేబినెట్లో మంత్రులు వరుసగా రాజీనామాల బాట పడుతున్నారు. తాజాగా కేబినెట్ సహాయమంత్రి ఎల్ మురుగన్ తన పదవితో పాటు రాజ్యసభ సీటునూ వదులుకున్నారు. అంతకు ముందు ధర్మేంద్ర ప్రధాన్, జార్జి కురియన్, రవ్ నీత్ సింగ్ బిట్టూ తమ పదవుల్ని వదులుకున్నారు. మరో ఇద్దరు కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరీ, బీఎల్ వర్మ రాజ్యసభ పదవీకాలం ముగుస్తోంది. దీంతో కేబినెట్లో ఆరు ఖాళీలు ఏర్పడ్డాయి. వీరితో పాటు ప్రస్తుతం కేబినెట్లో ఉన్న పలువురు మంత్రులకు రాష్ట్రాల్లో బీజేపీ ఇన్ ఛార్జ్ లుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో కేబినెట్ ప్రక్షాళన (Modi Cabinet Reshuffle ) చేయక తప్పని పరిస్ధితి ప్రధాని మోడీకి ఎదురవుతోంది. ఇంతకీ ఈ కేంద్రమంత్రుల రాజీనామాల పర్వం ఎప్పుడు మొదలైందో ఓసారి చూద్దాం..
ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు కేంద్ర కేబినెట్ ప్రక్షాళన చేపట్టాలని ప్రధాని మోడీ భావించారు. అప్పటికి ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యలు, ఆందోళనలు లేవు. అయితే ప్రధాని మోడీ బిజీ షెడ్యూల్స్ కారణంగా దీన్ని వాయిదా వేశారు. అయితే పార్లమెంట్ సమావేశాల సమయంలో నీట్ అక్రమాలు తెరపైకి రావడం, జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టడంతో కేంద్రం ఆత్మరక్షణలో పడింది. దీంతో విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాల్సి వచ్చింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ఓట్ల చోరీ ఆరోపణలపై సీఈసీ జ్ఞానేష్ రాజీనామా కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే వీటితో ఎలాంటి సంబంధం లేకుండానే మరో కేంద్రమంత్రి మురుగన్ రాజీనామా చేశారు. రాజ్యసభ సీటునూ వదులుకున్నారు. దీంతో మరోసారి కేబినెట్ ప్రక్షాళన తెరపైకి వస్తోంది.

వచ్చే నెలలో రాజ్యసభ పదవీకాలం ముగించుకుని రాజీనామా చేయబోతున్న ఇద్దరు కేంద్రమంత్రులు హర్దీప్ పూరీ, బీఎల్ వర్మతో కలుపుకుని ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో ఆరు ఖాళీలున్నాయి. యూపీ, ఢిల్లీ బీజేపీ ఇన్ ఛార్జ్ లుకా నియమితులైన మరో ఇద్దరు మంత్రులు పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రా త్వరలో రాజీనామా చేయబోతున్నారు. దీంతో మొత్తంగా కేబినెట్లో 8 ఖాళీలు ఏర్పడబోతున్నాయి. వీరు కాకుండా కేబినెట్లో మరో 10 ఖాళీలున్నాయి. అంటే 18 మంది కొత్త మంత్రుల్ని తీసుకునే వెసులుబాటు ప్రధాని మోడీ వద్ద ఉంది. దీంతో దీపావళికి ముందు కేబినెట్ ప్రక్షాళన, విస్తరణ కార్యక్రమం చేపట్టేందుకు మోడీ సిద్దమవుతున్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో త్వరలో ఎన్నికలు జరిగే యూపీ, గుజరాత్, పంజాబ్ నుంచి ఎక్కువ మంది మంత్రుల్ని తీసుకుబోతున్నట్లు సమాచారం. అలాగే రాజ్యసభకు కూడా మురుగన్ రాజీనామాతో ఖాళీ అయ్యే సీటులో మరో కొత్త వ్యక్తికి అవకాశం కల్పించి ఆర్థికమంత్రిని చేయబోతున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
