స్థానిక ఎన్నికలపై సాయిరెడ్డి జోస్యం..! గెలిచేది వారే..! 2029లో మాత్రం..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడుతోంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీలు, జడ్పీలు, ఎంపీపీలు ఇలా వరుసగా ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో ఎలాగైనా గెలిచి తీరాలని కూటమి పార్టీలు పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకుని, రాష్ట్రంలో ఉనికి చాటుకుంటున్న విపక్ష వైఎస్సార్సీపీ కూడా సత్తా చాటుకునేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుతం కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న విజయసాయిరెడ్డి స్పందించారు.
ఏపీ స్ధాన్నిక ఎన్నికలను ఉద్దేశించి విజయసాయిరెడ్డి (VijayaSai Reddy) ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ప్రస్తుతం జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరో రెండేళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు 2029 అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపవంటూ ఆయన అంచనా వేశారు. అధికారంలో ఉండటం వల్ల టీడీపీకి సహజంగానే కొంత అనుకూలత ఉంటుందని సాయిరెడ్డి వెల్లడించారు.

ఒకవేళ స్ధానిక సంస్ధల ఎన్నికల్లో టీడీపీ గెలిచినా, అది ఆ పార్టీ ప్రజాదరణకు గీటురాయి కాబోదని సాయిరెడ్డి విశ్లేషించారు. 2029 ఎన్నికలే అసలైన పరీక్ష కానున్నాయని సాయిరెడ్డి పేర్కొన్నారు. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం ఖాయమని తేల్చిచెప్పేశారు. అయితే ఈ ఫలితాలను బట్టి 2029 ఎన్నికల్ని అంచనా వేయలేమని, వాటిపై స్థానిక ఎన్నికల ఫలితాల ప్రభావం ఏమాత్రం ఉండదని తెలిపారు. అయితే రెండున్నరేళ్ల తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల గురించి ఇప్పుడు సాయిరెడ్డి ఎందుకు ప్రస్తావిస్తున్నారనే దానిపై ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. స్థానిక ఎన్నికల్లో గెలువబోతున్న టీడీపీ .. ఆ తర్వాత 2029 ఎన్నికల్లోనూ తమదే విజయం అని చెప్పే ముందే, అలా కాదని చెప్పేందుకే సాయిరెడ్డి ముందే ఈ ట్వీట్ చేసినట్లు అర్థమవుతోంది. అయితే సాయిరెడ్డి వ్యాఖ్యల్ని ప్రస్తుతం టీడీపీ కూటమే కాదు వైఎస్సార్సీపీ కూడా లైట్ తీసుకుంటున్నాయి.














Click it and Unblock the Notifications
