"ఓదెల 2" మూవీ రివ్యూ.. తమన్నా సినిమా హిట్టా ? ఫట్టా ?
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "ఓదెల 2" అశోక్ తేజ డైరెక్షన్‌లో, సంపత్ నంది డైరెక్షన్ సూపర్‌విజన్‌లో రూపొందింది. ఈ సినిమాను మధు అనే కొత్త నిర్మాత నిర్మించగా, ప్రమోషన్స్‌తో సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. కరోనా సమయంలో ఓటీటీలో రిలీజ్ అయిన "ఓదెల రైల్వే స్టేషన్" అనే సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ప్రమోషన్స్ ఆసక్తికరంగా ఉండడం, సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా అనిపించడంతో, సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అందరూ ఎదురుచూసిన విధంగానే ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఓదెల 2 కథ: ఈ "ఓదెల 2" స్టోరీ "ఓదెల రైల్వే స్టేషన్" కథ ముగిసినప్పటి నుంచి మొదలవుతుంది. ఊరిలో ఎంతోమంది కొత్తగా పెళ్లయిన ఆడవాళ్లను శోభనం రాత్రి రేప్ చేసి చంపేస్తున్న తన భర్త తిరుపతి (వశిష్ట సింహ)ను రాధా (హెబ్బా పటేల్) తల నరికి చంపేస్తుంది. దీంతో ఆమె జైలు పాలవుతుంది. అయితే, ఊరివాళ్లందరూ కలిసి తిరుపతికి సమాధి బంధం అనే శిక్ష విధిస్తారు. ఈ క్రమంలో తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది. ఊరిలో మళ్లీ పెళ్లయిన ఆడవాళ్ల శోభనం రోజు రాత్రి వారిని రేప్ చేసి చంపేస్తున్న ఘటనలు మొదలవుతాయి. అయితే, దానికి కారణం ఊరి పూజారి శ్రీకాంత్ అయ్యంగార్, మయన్న అని అనుకుని వాళ్లను శిక్షించడానికి సిద్ధమైతే, తిరుపతి ఆత్మ కారణమని చెబుతాడు ఊరిలో తాయత్తులు వేసే అల్లా భక్షు (మురళీ శర్మ). దీంతో ఈ సమస్య నుంచి కాపాడాలని మళ్లీ రాధను కోరతారు ఊరివాళ్లు. ఇది నా వల్ల కాదని, తన అక్క, ఇప్పుడు అఘోరీగా మారిన భైరవి (తమన్నా) వల్లే కుదురుతుందని చెప్పి పంపడంతో, ఆ ఊరివాళ్లు ఆమెను వెనక్కి తీసుకుని వస్తారు. మరి ఊరిని తిరుపతి బారి నుంచి భైరవి కాపాడిందా? రాధ ఎలా మరణించింది? చివరికి ఏమైంది? అనేది తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

నిజానికి ఈ సినిమా కథ ఏమిటనే విషయం ప్రమోషన్స్‌లోనే అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. రాక్షసుడిగా మారి, ఊరి ఆడపిల్లల మీద పడి, రేప్ చేస్తూ చంపేస్తున్న మొగుడిని రాధ తల నరికి చంపేస్తుంది. ఆ తర్వాత, అతనికి ఊరు విధించిన శిక్ష కారణంగా అతను ప్రేతాత్మగా మారతాడు. ఆ ప్రేతాత్మ తర్వాత ఎలాంటి దారుణాలకు తెగబడింది? అతని దారుణాల వల్ల ఊరి వారందరూ ఎలా ఇబ్బందులు పడ్డారు? ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఏమిటి? ఈ విషయాల చుట్టూ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఆద్యంతం కథను నడిపించిన తీరు ఆసక్తికరంగా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమాలో నాగ సాధు అఘోరీగా నటించిన తమన్నా తన లైఫ్‌టైమ్‌లో బెస్ట్ రోల్ పట్టేసిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె, ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించే అవకాశం దక్కించుకుంది. కొన్ని సీన్స్‌లో తమన్నా నటన, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి. ఇక తిరుపతి అనే ఆత్మగా మారిన వ్యక్తిగా వశిష్ట సింహ కూడా ఇరగదీశాడు. ప్రేతాత్మగా అందరినీ భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇక హెబ్బా పటేల్ నటన గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది. మిగిలిన పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టు సరిపోయింది. ముఖ్యంగా, క్లైమాక్స్ ఎపిసోడ్‌లో కనిపించే శివుడితో పాటు నంది సీక్వెన్స్ బాగుంది. శివుడిని ఇంకా బాగా చూపించి ఉండవచ్చు. సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు.
ఫైనల్‌గా, 'ఓదెల 2'... గూస్‌బంప్స్ గ్యారంటీ ఫిల్మ్
Rating:3/5












Click it and Unblock the Notifications