రామ్ చరణ్ "పెద్ది" ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టుగా బాలయ్య...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'. ఈ మూవీపై రోజురోజుకీ అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంతో పాటు క్రికెట్ ఎమోషన్స్‌ను కలగలిపి రూపొందుతున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. ఇప్పటికే దేశవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. ముంబైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా.. ఉత్తర భారత మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ భోపాల్‌లో కూడా భారీ స్థాయి వేడుకను ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్‌లో జూన్ 2న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌పైనే ఉంది. ఈ వేడుకను టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నటసింహం Nandamuri Balakrishna హాజరుకానున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మెగా, నందమూరి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. రెండు కుటుంబాల అభిమానులు ఒకే వేదికపై సంబరాలు చేసుకునే అరుదైన క్షణంగా ఈ వేడుక నిలవబోతుందనే చర్చ జరుగుతోంది.
బాలకృష్ణ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాల వెనుక బలమైన కారణాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. 'పెద్ది' చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు, ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న 'NBK111' చిత్రానికీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒకే నిర్మాణ సంస్థలో బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలు తెరకెక్కుతుండటంతో, పరస్పర మద్దతుగా ఈ వేడుకలో బాలయ్య పాల్గొనే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిర్మాత సైతం ఈ విషయంపై హింట్ ఇవ్వడంతో ప్రచారం మరింత ఊపందుకుంది.
ఇక రామ్ చరణ్, బాలకృష్ణ మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఆహా వేదికగా ప్రసారమైన Unstoppable with NBK కార్యక్రమంలో ఇద్దరి మధ్య కనిపించిన అనుబంధం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రామ్ చరణ్‌ను తాను సొంత కుమారుడిలా భావిస్తానని బాలయ్య చెప్పగా, చరణ్ కూడా ఆయనను ఎంతో గౌరవంగా 'బాబాయ్' అని సంబోధించారు. ఈ నేపథ్యంలో చరణ్ సినిమాను ఆశీర్వదించేందుకు బాలయ్య తప్పకుండా వస్తారనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.
ఇదిలా ఉండగా, 'పెద్ది' ప్రమోషన్స్‌ను జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. క్రికెట్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుండటంతో, భారత మాజీ కెప్టెన్ Mahendra Singh Dhoniను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాంచీలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించే ఆలోచన కూడా ఉందని టాక్ నడుస్తోంది. ఒకవేళ ధోనీ ఈ కార్యక్రమంలో పాల్గొంటే, ఉత్తర భారత మార్కెట్‌లో సినిమాకు భారీ ప్రచారం దక్కడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.












Click it and Unblock the Notifications