మోడీకి నాగార్జున థ్యాంక్స్, ఎందుకంటే?
టాలీవుడ్ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. భారతీయ సినిమాకు నాగేశ్వరరావు చేసిన కృషిని కొనియాడారు. తాజాగా జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ అక్కినేని నాగేశ్వరరావుపై చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన టాలీవుడ్ హీరో నాగార్జున ధన్యవాదాలు తెలిపారు.
'ఐకానిక్ లెజెండ్స్‌తో పాటు మా తండ్రి అక్కినేని నాగేశ్వరరావును ఆయన శతజయవంతి సందర్భంగా మీరు (ప్రధాని నరేంద్ర మోడీ) గౌరవించడం ఆనందకరం. ఏఎన్నార్ దూరదృష్టి, భారత సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి' అని నాగార్జున పేర్కొన్నారు. కాగా, ఏఎన్నార్ తన ఏడు దశాబ్దాల కెరీర్‌లో తెలుగు సినిమా వృద్ధి, విజయంలో కీలక పాత్ర పోషించిన అనేక బ్లాక్ బ్లస్తర్లను అందించారు. అన్నపూర్ణ స్టూడియోను నిర్మించడం ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకురావడంలో నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు.

ఏఎన్నార్ తోపాటు బాలీవుడు దర్శకుడు తపన్ సిన్హా, రాజ్‌కపూర్‌ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని మోడీ కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు.. తెలుగు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారని తెలిపారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా చక్కగా చూపించేవారని ప్రశంసించారు. మరోవైపు, తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
భారతీయ సినిమా రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు. తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమావేశాలను వచ్చే ఏడాది మనదేశంలో నిర్వహించబోతున్నామని.. ఈ సమావేశాల్లో మీడియా, వినోద పరిశ్రమ చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని తెలిపారు ప్రధాని మోడీ.












Click it and Unblock the Notifications