ప్రధాని మోదీ కంట్లో పడ్డ రష్మిక మందన్న వీడియో
Rashmika Mandanna: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నెల 20వ తేదీన అయిదో విడత పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, లఢక్‌లల్లో మొత్తం 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ రెండు హైఓల్టేజ్ సీట్లు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాయ్‌బరేలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, బారాముల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల ప్రచారానికి శనివారం నాటితో తెరపడనుంది.

ఈ పరిస్థితుల్లో ప్రముఖ నటి రష్మిక మందన్న చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ముంబైలో నిర్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి ట్రాన్స్ హార్బర్ లింక్ బ్రిడ్జికి సంబంధించిన వీడియో అది. సంక్షిప్తంగా అటల్ సేతు అని పిలుస్తారు. మనదేశంలో సముద్రంపై నిర్మించిన అతిపెద్ద బ్రిడ్జి అదొక్కటే.
ఆరు లేన్ల విస్తీర్ణం గల ఈ అటల్ సేతు పొడవు 22 కిలోమీటర్లు. ముంబైలోని సేవ్రీ నుంచి నౌవాను కనెక్ట్ చేస్తూ నిర్మితమైందీ వంతెన. ఏడుసంవత్సరాల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్మించింది. గతంలో ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించడానికి రెండు గంటల సమయం పట్టేది. అటల్ సేతు వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. 20 నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలను చేరుకోవచ్చు.
ఈ వంతెన కోసం కేంద్ర ప్రభుత్వం 17,840 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. వడాలా, కొలాబా, ముంబై పోర్ట్.. వంటి ప్రాంతాలకు కనెక్టివిటీని కల్పించారు ఈ బ్రిడ్జీ ద్వారా. ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ముంబైకర్స్ ఈ వంతెనను వినియోగిస్తుంటారు.

ఈ అటల్ సేతుపై ఓ షార్ట్ వీడియోను షూట్ చేశారు రష్మిక మందన్న. దీన్ని అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. భారత్.. ఇలాంటి ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరని, అసాధ్యం అనుకున్న దాన్ని ఏడేళ్ల వ్యవధిలో సుసాధ్యం అయిందనీ చెప్పారు. ఈ వంతెనపై ప్రయాణం ఓ మధురానుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు.
వికసిత్ భారత్‌కు ఈ బ్రిడ్జి అద్దం పడుతోందని అన్నారు. యంగ్ ఇండియా.. అన్‌స్టాపబుల్ డెవలప్మెంట్ సాధిస్తోందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఇలాంటి అటల్ సేతులను ఇంకా ఎన్నో నిర్మించాల్సి ఉందని, అందుకే అభివృద్ధికి ఓటు వేయాలని రష్మిక మందన్న విజ్ఞప్తి చేశారు.
Absolutely! Nothing more satisfying than connecting people and improving lives. https://t.co/GZ3gbLN2bb
— Narendra Modi (@narendramodi) May 16, 2024
ఈ వీడియోపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. రష్మిక మందన్న పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌ను ఆయన తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా రీట్వీట్ చేశారు. దేశ ప్రజలతో అనుబంధాన్ని కలిగి ఉండటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి మించిన సంతృప్తి మరొకటి ఉండబోదంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications