ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్: ఒక్కరోజులో 41 షోలు
Guntur kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం.. గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ఇది.
హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ.. ఇతర కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ మాస్ మసాలా మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

విడుదల తేదీ సమీపించిన నేపథ్యంలో- గుంటూరు కారం సినిమా నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే- సినిమా విడుదల రోజైన జనవరి 12వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు బెనిఫిట్ షోను ప్రదర్శించడానికీ పర్మిషన్ జారీ చేసింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లల్లో టికెట్ ఒక్కింటికి 65 రూపాయలు, మల్టీ ప్లెక్స్‌లల్లో 100 రూపాయలను పెంచుకోవచ్చు. వారం రోజుల పాటు అంటే 12 నుంచి 18వ తేదీ వరకు ఈ పెంచిన టికెట్లు అమలులో ఉంటాయి. అలాగే- ఈ వారం రోజుల పాటు కూడా రోజూ ఆరు ఆటలను ప్రదర్శించుకోవడానికీ అనుమతులు లభించాయి. దీని ప్రకారం చూస్తే- తెల్లవారు జామున 4 గంటలకే మొదటి ఆట మొదలవుతుంది.
గుంటూరుకారం సినిమా విడుదల రోజున హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్.. ఓ సరికొత్త చరిత్రను సృష్టించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. విడుడల రోజున ఈ మల్టీప్లెక్స్‌లో ఏకంగా 41 షోలు ప్రదర్శితం కానున్నాయి. ఈ మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ స్థాయిలో షోలను వేయబోతోండటం ఇదే తొలిసారి.
12వ తేదీన ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఉన్న అన్ని స్క్రీన్లల్లో కూడా రోజంతా గుంటూరు కారం సినిమానే ప్రదర్శిస్తారు. ఇది ఆల్‌టైమ్ రికార్డ్. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్‌లో సలార్- పార్ట్ 1 సీస్‌ఫైర్, డంకీ, యానిమల్, అక్వామన్, డెవిల్, హాయ్ నాన్న సినిమాలు ప్రదర్శితమౌతోన్నాయి. గుంటూరు కారం విడుదల రోజున అవేవీ ఉండవు. అన్ని స్క్రీన్లల్లోనూ గుంటూరుకారం ఉంటుంది.












Click it and Unblock the Notifications