pushpa2:రూ.1239 అంటే ఎంత కష్టం... వినపడిందా అల్లు అర్జున్, మైత్రీ?
పుష్ప2 చిత్రం మరో 24 గంటల్లో విడుదల కాబోతోంది. కొన్ని ప్రాంతాల్లో నాలుగోతేదీ రాత్రి 11.00 గంటలకు, ఒంటిగంటకు షోలు వేయబోతున్నారు. మరికొన్ని చోట్ల 9.00 గంటలకే షో వేస్తున్నారు. ఆ తర్వాతరోజు నుంచి మల్టీప్లెక్స్, థియేటర్ల ధరలు వారానికోసారి మారతాయి. గరిష్టంగా ఒక టికెట్ ధర రూ.1239 అవుతుంది. అంత ఖర్చుపెట్టి సినిమా చూడాలా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తమ అభిమానాన్ని మీరు క్యాష్ చేసుకుంటున్నారా? అంటూ గట్టిగానే నిలదీస్తున్నారు. నిర్మాతలకు ఈ చేదు అనుభవం హైదరాబాద్ లో జరిగి ముందస్తు విడుదల వేడుకలో ఎదురైంది.
అభిమానాన్ని దోచుకుంటున్నారా?
వేడుకలో భాగంగా మాట్లాడటానికి నిర్మాత నవీన్ మైక తీసుకొని వచ్చారు. అయితే అభిమానుల నుంచి టికెట్ రూ.1200 అంటే చాలా కష్టం.. ఇవేం ధరలు.. దోచుకుంటున్నారా? అంటూ బిగ్గరగా అరిచారు. నవీన్ పక్కనే అల్లు అర్జున్ కూడా ఉన్నారు. వెంటనే ఏం చెప్పాలో నిర్మాత నవీన్ కు అర్థం కాలేదు. వెంటనే విషయాన్ని పక్కకు మళ్లించారు. అభిమానులు అడిగిన టాపిక్ తో సంబంధం లేకుండా వేరే విషయాలు మాట్లాడి క్లోజ్ చేశారు. ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉండటంతో వారికి కావల్సినంత ధరకు టికెట్లు పెంచుకున్నారంటూ అభిమానులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. దీనిపై అభిమానులు భగ్గుమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగింది.

నిర్మాతలపై విరుచుకుపడుతున్న అభిమానులు
సామాజిక మాధ్యమాల్లో బన్నీ అభిమానులతోపాటు సినీ ప్రియులంతా నిర్మాతలను పూర్తిగా ఏకేస్తున్నారు. అయినా అదంతా సోషల్ మీడియాలోనేగా.. ప్రధాన మీడియాలో కాదుగా అని నిర్మాతలు పట్టించుకోలేదు. అయితే ఏకంగా యూసఫ్ గూడలో జరిగిన సినిమా ముందస్తు విడుదల వేడుకలో అభిమానులే నేరుగా అడిగేయడంతో నిర్మాతలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. డబ్బుల కోసం సినిమా తీయడంలో తప్పులేదని, కానీ లాభాల కోసం అభిమానాన్ని దోచుకోవడం మాత్రం కచ్చితంగా తప్పే అంటున్నారు. ఇప్పుడు పుష్ప2ను చూసి రేపు మరో నిర్మాత తన టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి అనుమతి తెచ్చుకుంటారు. ఆ తర్వాత వంతు మరో నిర్మాతది. ఇలా ఎంతమంది అడిగితే అంతమందికి ధరల పెంపునకు అనుమతిచ్చుకుంటూ పోతే చివరకు ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఆ ప్రభావం ఎన్నికల్లో ఎంతో కొంత పడుతుంది. చిన్న సినిమాలకు ఒక లెక్క, పెద్ద సినిమాలకు ఒక లెక్క అంటూ తేడా చూపించకుండా అన్ని సినిమాలను సమానంగా ఆదరించినప్పుడే పరిశ్రమ నాలుగు కాలాలపాటు బాగుంటుంది. లేదంటే నలుగురికే పరిమితమవుతుంది. తర్వాత ఆ నలుగురు కూడా నష్టపోవాల్సి వస్తుంది.












Click it and Unblock the Notifications