పూజాహెగ్డే అందుకే తప్పుకుంది: 'గుంటూరు కారం' నిర్మాత నాగవంశీ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో ఏ సినిమా విషయంలో రానన్ని రూమర్లు ఈ సినిమాపై వచ్చాయి.. ప్రస్తుతం కూడా వస్తున్నాయి. కథ మార్చారని, సంగీత దర్శకుడు మారాడని, కొన్ని సన్నివేశాలు రీషూట్ చేశారంటూ.. రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రూమర్లను ఖండించారు. పూజా హెగ్డే ఎందుకు నటించడంలేదో తెలిపారు.
త్వరలోనే ఫస్ట్ సింగిల్
గుంటూరు కారం చిత్రాన్ని ముందుగా ఆగస్టులో విడుదల చేద్దామనుకున్నామని, అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో 2024 సంక్రాంతికి మార్చామన్నారు. అదే సమయానికి పూజా హెగ్డే ఓ హిందీ సినిమాకు డేట్లు ఇచ్చారన్నారు. దీంతో ఆమెకు డేట్లు సర్దుబాటు కాకపోవడంతో మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు నాగవంశీ తెలిపారు. దీనికే కొందరు ఎందుకు అంత హంగామా చేశారో అర్థం కావడంలేదన్నారు.

పండగకు రావల్సిన సినిమాలో ఎన్ని అంశాలుంటాయో అన్నీ ఇందులో ఉన్నాయన్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు విభిన్నంగా కనిపిస్తారని, ప్రస్తుతానికి రెండు పాటలు పూర్తయ్యాయన్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సంక్రాంతికే ఈ సినిమా విడుదలవుతుందని, అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. పూజాహెగ్డే, శ్రీలల ఈ సినిమాకు హీరోయిన్లుగా ఎంపికవగా పూజాకు డేట్లు క్లాష్ అవడంతో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.
త్రివిక్రమ్ తో రెండు సినిమాలు
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోందని, అందులో ఎటువంటి మార్పులు చేయలేదన్నారు. రష్మికను ఎంపిక చేశారంటూ వార్తలు వచ్చాయని, ఇంతవరకు తాము ఆమెను అసలు సంప్రదించలేదన్నారు. అలాగే బాలకృష్ణ-బాబీ కాంబినేషన్ లో నిర్మించే చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుందన్నారు. అల్లు అర్జున్-త్రివిక్రమ్, తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తదుపరి సినిమాలు చేయబోతున్నట్లు నాగవంశీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications