స్టార్ హీరో, హీరోయిన్స్.. ముఖ్యపాత్రలో అమితాబ్.. కానీ రూ.130 కోట్లు బొక్క !!
'బాహుబలి' తర్వాత భారతీయ సినిమా స్థాయి పూర్తిగా మారిపోయింది. రీజనల్ సినిమాలుగా పరిమితమైన కథలు ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్నాయి. భాషా భేదం లేకుండా పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఊపందుకోవడంతో, అన్ని ఇండస్ట్రీల నిర్మాతలు భారీ స్థాయిలో సినిమాలు తెరకెక్కించడానికి ముందుకొస్తున్నారు. ఈ మార్పుకు అనుగుణంగా సినిమాల బడ్జెట్‌లు కూడా గణనీయంగా పెరిగాయి. భారీ సెట్లు, వీఎఫ్‌ఎక్స్, స్టార్ క్యాస్టింగ్, అంతర్జాతీయ ప్రమోషన్లు వంటి అంశాలతో రూ.100 నుంచి రూ.1000 కోట్ల వరకు బడ్జెట్‌లు పెట్టే పరిస్థితి వచ్చింది. అయితే భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన విజయం ఖాయం అనే పరిస్థితి లేదని ఇటీవల కొన్ని సినిమాలు నిరూపించాయి.
ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి రికార్డులు సృష్టిస్తుండగా, మరికొన్ని మాత్రం కనీసం తమ పెట్టుబడిని కూడా రికవర్ చేయలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు నటించిన సినిమాలే ఇలా డిజాస్టర్లుగా మారడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అలాంటి సినిమాల్లో ఒకటిగా బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన 'గణపత్: పార్ట్ 1' నిలిచింది. ఈ సినిమాను హీరో ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏకంగా రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమాపై అంచనాలు పెంచేందుకు విస్తృత స్థాయిలో ప్రమోషన్లు కూడా నిర్వహించారు కానీ మూవీ మాత్రం నిరాశ పరిచింది.

2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్‌కు జోడిగా కృతీ సనన్ హీరోయిన్‌గా నటించింది. అంతేకాకుండా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాకు వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన 'గణపత్' ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. విడుదలైన మొదటి రోజు కేవలం రూ.2.5 కోట్ల ఓపెనింగ్ మాత్రమే సాధించింది. మొత్తంగా చూస్తే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.18 కోట్ల మాత్రమే వసూలు చేసింది. రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమాకు ఇది భారీ షాక్‌గా మారింది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఇది 2023లో బాలీవుడ్‌లో వచ్చిన అతిపెద్ద ఫ్లాప్స్‌లో ఒకటిగా నమోదైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, టైగర్ ష్రాఫ్ ఒక్కో సినిమాకు రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే 'గణపత్' సినిమా కనీసం హీరో రెమ్యునరేషన్ మొత్తాన్ని కూడా రాబట్టలేకపోవడం నిర్మాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది ఏమిటంటే... స్టార్ క్యాస్ట్, భారీ బడ్జెట్, పాన్ ఇండియా ట్యాగ్ మాత్రమే సినిమా విజయం నిర్ధారించలేవు. బలమైన కథ, ప్రేక్షకులను ఆకట్టుకునే కథనమే అసలైన విజయానికి కీలకమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications