ప్రేక్షక దేవుళ్లా? బలిపశువులా?: ప్రజల్ని నిలువు దోపిడీ చేస్తున్న టాలీవుడ్ !!
తెలుగు ప్రేక్షకులంత మూవీ లవర్స్ ఎక్కడా లేరు.. సినిమా బాగుంటే ఆదరించే వారిలో తెలుగు వాళ్లే ముందుంటారు. హీరో ఎవరైనా కానీ.. ఏ పరిశ్రమ నుంచి వచ్చినా కానీ ఈ ఎమోషనల్ డ్రామా లాంటి డైలాగ్ ఒకటి కొట్టడం అలవాటు అయిపోయింది. ఓ పక్క "సినిమా బ్రతకాలి.. సినిమాను థియేటర్లోనే చూడండి.. ప్రేక్షక దేవుళ్లే మాకు సర్వస్వం" అంటూ వేదికలపై మన టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు తరచుగా ఊదరగొడుతున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆ 'ప్రేక్షక దేవుడే' తమ వ్యాపారానికి ప్రధాన బలిపశువు అవుతున్నాడా? అనే అనుమానం కలగక మానదు. ఒకప్పుడు సామాన్యుడికి చౌకైన వినోద సాధనంగా ఉన్న సినిమా, నేడు సామాన్యుడు భయపడే స్థాయికి చేరుకుందంటే అతిశయోక్తి కాదు.
ఆకాశంలో టికెట్ ధరలు..
సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. భారీ బడ్జెట్ సినిమా వస్తోందంటే చాలు.. ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి మరీ టికెట్ ధరలు పెంచుకుంటున్నారు. 'ప్రేక్షక దేవుళ్లు' అని సంబోధించే వ్యక్తులు, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం సినిమాకు వెళ్లాలంటే 2000 నుండి 3000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు. కేవలం కొన్ని వారాల పాటు భారీ కలెక్షన్లు రాబట్టాలనే అత్యాశతో, సామాన్యుడి వినోదాన్ని విలాసంగా మార్చేస్తున్నారు.

కాస్ట్లీ క్యాంటీన్లు..
ఇక థియేటర్ల లోపల జరిగే దోపిడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బయట 20 రూపాయలు ఉండే నీళ్ల బాటిల్ లోపల 60 రూపాయలు, చిన్న పాప్‌కార్న్ టబ్ 200 నుండి 300 రూపాయలు. మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగాక, టికెట్ ధర కంటే క్యాంటీన్ బిల్లు ఎక్కువవుతోంది. ప్రేక్షకులు సినిమాను ప్రేమించి థియేటర్‌కు వస్తే, వారి అవసరాలను ఆసరాగా చేసుకుని నిలువు దోపిడీ చేయడం ఎంతవరకు సమంజసం?
కలెక్షన్స్ పిచ్చి.. భారం ప్రేక్షకులపైనే!
ఒక సినిమా బడ్జెట్ వందల కోట్లు దాటడానికి ప్రధాన కారణం కథలోని గొప్పతనం కాదనేది నిజం. హీరోలు, దర్శకులు తీసుకునే భారీ రెమ్యూనరేషన్లు. తమ పారితోషికాలను పెంచుకుంటూ పోతున్న స్టార్స్, ఆ భారాన్ని అంతిమంగా ప్రేక్షకులపైనే వేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అయితే పారితోషికం వెనక్కి ఇచ్చే వారు తక్కువ, కానీ హిట్ అయితే మాత్రం తర్వాతి సినిమాకు టికెట్ రేటు పెంచేలా ప్లాన్ చేస్తారు. వందల కోట్ల ఖర్చుతో నిర్మించే సినిమాల్లో కంటెంట్ ఎంత ఉంటోందో ఎవరికీ తెలియదు కానీ, ప్రచారం మాత్రం ఆకాశాన్ని తాకుతుంది. ట్రైలర్లు, టీజర్లతో ఒక హైప్ క్రియేట్ చేసి, మొదటి మూడు రోజుల్లోనే ప్రేక్షకుల జేబులు ఖాళీ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
సినిమా అనేది ఒక కళ, ఒక వ్యాపారం. కానీ ఆ వ్యాపారం 'నీతి'తో కూడి ఉండాలి. ప్రేక్షకులను కేవలం డబ్బులు ఇచ్చే మిషన్లుగా చూడకుండా, వారి ఆర్థిక పరిస్థితిని కూడా గౌరవించాలి. సినిమాను బ్రతికించాల్సింది కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, ఆ సినిమాను నిర్మించే వారు కూడా ధరలను అదుపులో ఉంచి సహకరించాలి. లేకపోతే 'ప్రేక్షక మహా దేవుళ్లు' థియేటర్లకు శాశ్వతంగా దూరం అయ్యే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications