సముద్రంపై 60 కి.మీ. డ్యామ్.. భారత ఇంజనీరింగ్‌కు ప్రపంచం సలాం
ఇండియా డెవలపింగ్ కంట్రీ కాదు.. ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ. ఎందుకంటే భారత్ నదులపై డ్యాంలు కట్టే స్థాయి నుంచి సముద్రంపై 60 కిలోమీటర్ల పొడవైన డ్యాంలు కట్టే స్థాయికి చేరుకుంది. అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా అసూయతో మనవైపు చూసేలా చేస్తోంది. గుజరాత్‌లోని ఖంభాత్ వేదికగా రూ. 1.2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్నదే కల్పసర్ ప్రాజెక్ట్. హిందూ పురాణాల్లోని "కల్పవృక్షం" పేరు మీదుగా కల్పసర్ అని నామకరణం చేశారు.
ప్రపంచ మౌలిక సదుపాయాల చరిత్రలోనే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రయోగం. భావ్‌నగర్ నుండి భరూచ్ మధ్య సముద్రంపై సుమారు 60 కిలోమీటర్ల పొడవున భారీ ఆనకట్ట నిర్మిస్తున్నారు. సముద్రంలో వృథాగా కలిసే శబర్మతి, మహి, ధాధర్, నర్మద నదుల నీటిని నిలిపేసి సముద్రం నడిబొడ్డున 1,800 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి జలాశయాన్ని ఇక్కడ సృష్టిస్తున్నారు. నెదర్లాండ్స్ దేశానికి చెందిన నిపుణుల సలహాలు కూడా మన ఇంజనీర్లు తీసుకుంటున్నారు.

16 లైన్ల హైవే, 4 లైన్ల రైల్వే
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాలలో 10.5 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందడమే కాకుండా, కోటి మందికి పైగా ప్రజలకు తాగునీటి ఎద్దడి తీరుతుంది. అంతేకాదు, ఈ డ్యామ్‌పై 10 నుండి 16 లేన్ల భారీ హైవే, 4 లైన్ల రైల్వే కారిడార్‌ను నిర్మిస్తున్నారు. దీనివల్ల సౌరాష్ట్ర నుండి దక్షిణ గుజరాత్ మధ్య ప్రయాణ దూరం 136 కిలోమీటర్లు తగ్గి, ప్రయాణ సమయం ఏకంగా 8 గంటల నుండి కేవలం 1 గంటకు తగ్గిపోతుంది. ఇది రవాణాతో పాటు గ్రీన్ ఎనర్జీ రంగానికి ఎంతో ఊతమిస్తుంది. ధోలేరా స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి కొరత శాశ్వతంగా తీరడమే కాకుండా, సముద్రపు అలలు, సోలార్ ద్వారా దాదాపు 5,000 మెగావాట్ల స్వచ్ఛమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
ఈ నిర్మాణం సముద్రంలో జరగడం వల్ల ఏ ఒక్క గ్రామాన్ని కూడా ఖాళీ చేయించాల్సిన అవసరం లేదు. ఈ మెగా ప్రాజెక్ట్‌లో భాగంగా నర్మదా నది ముఖద్వారం వద్ద రూ. 4,000 కోట్లతో భాద్భూత్ బ్యారేజ్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. ఇది నర్మద నదీ జలాలు సముద్రపు ఉప్పునీటి బారిన పడకుండా కాపాడుతూ, కల్పసర్ జలాశయానికి నిరంతర మంచినీటిని అందిస్తుంది.
ప్రపంచ రికార్డు బద్దలవుతుంది
అయితే, గుజరాత్ తీవ్రమైన భూకంప ప్రభావిత ప్రాంతం కావడం వల్ల సముద్రంలో డ్యామ్ నిర్మించడం, నదులు తెచ్చే పూడికను అరికట్టడం, స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని కాపాడటం వంటి సవాళ్లు ఉన్నాయి. పర్యావరణ అనుమతులతో దశలవారీగా ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, భారతదేశ నీటి, రవాణా రంగాల్లో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభమవడంతోపాటు ప్రపంచంలోనే అతి పెద్ద డ్యాంలుగా ఉన్న దక్షిణ కొరియాలోని సైమంగమ్ సీవాల్, నెదర్లాండ్స్ లోని అఫ్స్లూయిట్డైక్ రికార్డులను బద్ధలు కొడుతుంది.














Click it and Unblock the Notifications