Fact Check: కేంద్రం మీ వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేస్తుందా..? ఆ ప్రచారంలో నిజమెంత?
సోషల్ మీడియా,ఓటీటీ,డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై నిర్ణయం తెలిపేందుకు ప్రభుత్వం మూడు నెలల గడువు ఇచ్చింది. మంగళవారం(మే 25)తో ఆ గడువు ముగిసింది. వాట్సాప్,ట్విట్టర్ ఇంకా ఇందుకు అంగీకారం తెలపలేదు. దీంతో ఈ సోషల్ నెట్‌వర్క్స్‌పై నిషేధం పడుతుందా అన్న చర్చ జరుగుతోంది.
అదే సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు సంబంధించి ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం వాట్సాప్ కాల్స్‌ను ప్రభుత్వం రికార్డు చేస్తుంది. అంతేకాదు,యూజర్ల మొబైల్ డివైజ్‌లు కేంద్ర మంత్రిత్వ శాఖతో కనెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ మీరు పంపించిన మెసేజ్‌కు ఒక రెడ్ టిక్ కనిపిస్తే... ప్రభుత్వం ఆ మెసేజ్‌ను పరిశీలిస్తోందని అర్థం. మూడు టిక్ మార్కులు కనిపిస్తే... ప్రభుత్వం దానిపై చర్యలకు ఉపక్రమించిందని సంకేతం. అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు.

ఇది పూర్తిగా ఫేక్ మెసేజ్. ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఇటువంటి నిబంధనలేవీ లేవు. కాబట్టి సోషల్ మీడియా యూజర్స్ ఈ ప్రచారాన్ని నమ్మవద్దు.
ప్రభుత్వ మార్గదర్శకాలపై వాట్సాప్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒకవేళ వాట్సాప్ సందేశాల్లో దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే కంటెంట్ ఉంటే దాని మూలాలను తమకు తెలియజేయాలని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల్లో ఉంది. అయితే ఎన్‌క్రిప్టెడ్ మెసేజ్‌ల వివరాలను బహిర్గతపరచడం వినియోగదారుల ప్రైవసీకి భంగం కలిగించడమేనని వాట్సాప్ పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం.. కొత్త డిజిటల్ నిబంధనలు వ్యక్తిగత సమాచార గోప్యతకు వ్యతిరేకం కాదని.. దేశ భద్రత, సార్వభౌమత్వం అంశాల్లో మాత్రమే కొన్ని మెసేజ్‌లను పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Fact Check
వాదన
వాట్సాప్ కాల్స్ కేంద్ర ప్రభుత్వం రికార్డు చేస్తుందని ప్రచారం.
వాస్తవం
ఆ ప్రచారంలో నిజం లేదు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల్లో అలాంటి నిబంధనలేవీ లేవు.












Click it and Unblock the Notifications