ఆహార పదార్థాలను న్యూస్ పేపర్ లో చుట్టి ఇవ్వడం నిషేధం: కేంద్రం సంచలన ఆదేశాలు
సాధారణంగా మనకు రోడ్ సైడ్ దొరికే ఫుడ్ ను అక్కడి విక్రేతలు న్యూస్ పేపర్ లో చుట్టి ఇవ్వడం అలవాటుగా మారిపోయింది. మనం కూడా అవేమీ పట్టించుకోకుండా తినేస్తుంటాం. ఇలా చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. అలాగే టిఫిన్ సెంటర్ల వద్ద కూడా పార్శిల్ సమయంలో టిఫిన్స్ ను న్యూస్ పేపర్ లో చుట్టి ఇస్తుంటారు విక్రేతలు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆహార పదార్థాలను న్యూస్ పేపర్ లో చుట్టి ఇవ్వడం నిషేధం అని పేర్కొంది.
ఆహార పదార్థాలను వార్తాపత్రికలలో చుట్టి ఇవ్వడం నిషేధమని తాజాగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI) స్పష్టం చేసింది. వార్తాపత్రికల్లో ముద్రించే సిరా ఆరోగ్యానికి చాలా హానికరం అని పేర్కొంది. అందుకే ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని ఆహార వ్యాపారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వార్తాపత్రికల సిరాలో సీసం వంటి భారీ లోహాలు ఉంటాయి. ఇవి ఆహారంలో కలిసి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. పత్రికలను రవాణా చేసేటప్పుడు వాటికి దుమ్ము, ధూళి అంటుకుంటాయి. దీనివల్ల ప్రమాదకర బ్యాక్టీరియా ఆహారంలోకి చేరే అవకాశం ఎక్కువగా ఉంది.
ఆంక్షల అమలు
ముంబైలో ఒక వడపావ్ వ్యాపారీ వార్తాపత్రికలను వాడటాన్ని అధికారులు గుర్తించారు. దీనిపై తనిఖీలు చేసి వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ నిబంధన రెస్టారెంట్లు, చిన్న తినుబండారాల దుకాణాలు, క్యాటరింగ్ సంస్థలకు వర్తిస్తుంది. అందరూ ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్(ప్యాకేజింగ్) నిబంధనలు 2018 ప్రకారం ఇది ఇప్పటికే నిషేధితం. వేయించిన పదార్థాల నుండి నూనె పీల్చుకోవడానికి కూడా వార్తాపత్రికలను వాడకూడదు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గతంలోనే దీనిపై హెచ్చరికలు జారీ చేసింది.

ఆహార వ్యాపారులు అనుమతించిన నాణ్యమైన ప్యాకేజింగ్ మెటీరియల్స్ మాత్రమే వాడాలి. అపరిశుభ్రమైన ప్యాకేజింగ్ ఉన్న ఆహారాన్ని కొనవద్దని వినియోగదారులకు సూచించారు. రాష్ట్ర అధికారులతో కలిసి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ నిబంధనలను దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది.












Click it and Unblock the Notifications