భారత్ సాయం కోసం సరిహద్దులు దాటుతాం..! పాకిస్తాన్ పై పీవోకే ప్రజల రివర్స్ ..!
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో ఇస్లామాబాద్ అధికార పెత్తనానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా పోరాటం మరింత ఉమ్మడిగా, ఉధృత రూపం దాల్చింది. రావలాకోట్‌లోని చారిత్రాత్మక ఈద్గా మైదానంలో జరుగుతున్న ఈ బృహత్ ప్రజా నిరసన ప్రదర్శనలు నిరంతరాయంగా 22వ రోజుకు చేరుకున్నాయి. పాక్ పాలకుల వివక్ష, అణచివేత ధోరణిని వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు, పౌర సమాజ ప్రతినిధులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ స్వేచ్ఛా స్వరాలను వినిపిస్తున్నారు.
పీవోకేలో నిరసనల వెల్లువ (POK Protests)
ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్య బద్ధమైన పాలన కరువైందని, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, విపరీతమైన ద్రవ్యోల్బణం, కరెంట్ బిల్లుల భారం, కనీస మౌలిక వసతుల కొరతతో తాము అల్లాడిపోతున్నామని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా నిరసనల తీవ్రతను ప్రపంచానికి తెలియకుండా దాచేందుకు పాక్ ప్రభుత్వం జూన్ 5 నుంచి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసింది. అంతేకాకుండా, నిరసనలను అణచివేసే కుట్రలో భాగంగా ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువుల రవాణాపై రెండు వారాల పాటు అప్రకటిత రవాణా దిగ్బంధనాన్ని విధించడం స్థానికంగా పెను మానవతా సంక్షోభానికి దారితీసింది.

భారత్ సాయం కోరతాం
ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ స్థానిక పౌర హక్కుల ఉద్యమ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం ఎన్నటికీ పాకిస్తాన్‌లో భాగం కాదని, తమకు పాకిస్తాన్ అవసరం కంటే, పాకిస్తాన్‌కే తమ అవసరం చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ఒకవేళ ఇస్లామాబాద్ ప్రభుత్వం తమపై విధిస్తున్న ఆహార ఆంక్షలను ఇలాగే కొనసాగిస్తే, తాము మానవతా సహాయం కోసం సరిహద్దు దాటి నేరుగా భారతదేశాన్ని ఆశ్రయించక తప్పదని హెచ్చరించారు. ఈ పరిణామం ఈ ప్రాంత రాజకీయ చిత్రపటాన్ని మార్చడమే కాకుండా, ఇస్లామాబాద్‌పై తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడిని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.

నానాటికీ పెరుగుతున్న ఉద్యమాలు
జూన్ 9 నుంచి రగులుతున్న ఈ ప్రజా నిరసనల వేడి ఇప్పుడు నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి ప్రత్యేక ధర్నా కార్యక్రమాలకు దారితీసింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వైఖరిని తప్పుబడుతూ, అక్కడ తమకు సైనిక నియంతృత్వం వద్దంటూ పీఓకే నివాసితులు బహిరంగంగా నినాదాలు చేస్తున్నారు. స్థానికంగా సాగుతున్న ఈ ఉద్యమానికి మద్దతుగా విదేశాల్లో నివసిస్తున్న కశ్మీరీ ప్రవాసులు సైతం వివిధ దేశాలలోని పాక్ రాయబార కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున నిరసనలు నిర్వహిస్తున్నారు. తమ ప్రాంతీయ స్వయంప్రతిపత్తి, ఆర్థిక హక్కులు దక్కే వరకు ఈ సుదీర్ఘ పోరాటం ఆగే ప్రసక్తే లేదని ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications