తెలంగాణ: ఎమ్మెస్సార్ లొల్లి
మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణరావు తెలంగాణకు సంబంధించి ఒక కొత్త రకం లొల్లికి తెర తీశారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని, రాజశేఖర రెడ్డి వైఖరి మార్చుకుంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన ప్రకటించి ఆ లొల్లికి శ్రీకారం చుట్టారు. సత్యనారాయణ రావు ఏం ఆశించే ఈ ప్రకటన చేశారో అర్థం కావడం లేదు కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఆయన ఎరగా పెట్టినట్లు మాత్రం అనిపిస్తున్నది. అన్ని పార్టీల్లోనూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నవారు ఉన్నారని, వారందరూ వైఖరి మార్చుకోవాలని ఆయన అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారని, అలాంటప్పుడు తెలంగాణ ఎలా ఇస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నట్లు ఆయన తెలిపారు. ఒక నాయకుడు వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ అధిష్ఠానవర్గం ముందుకు సాగలేని స్థితిలో ఉందా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తున్నది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ తమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని రాజశేఖర రెడ్డి పలు మార్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అంటే రాజశేఖర రెడ్డి పైకి ఒక మాట మాట్లాడుతూ లోలోపల పార్టీ అధిష్ఠానవర్గాన్ని కూడా ప్రభావితం స్థాయిలో ఉన్నారా అనేది రెండో ప్రశ్న.
పై ప్రశ్నల నేపథ్యంలో ఆలోచిస్తే రాజశేఖర రెడ్డి ఆషామాషీ నాయకుడేమీ కారనేది అందరూ అంగీకరించే విషయమే. కాంగ్రెసు నాయకుల్లో రాజశేఖర రెడ్డికి మాత్రమే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ అనుచరులున్నారు, విశ్వాసపాత్రులు ఉన్నారు. ఈ రీత్యా కాంగ్రెసుకు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బలమైన నాయకుడే. అయితే ఈ బలం ఆయనదొక్కటే కాదు. ఆంధ్ర పాలకవర్గాలకు, ఆధిపత్య వర్గాలకు రాజశేఖర రెడ్డిని ప్రతినిధిగా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు ఆధిపత్య వర్గాల ప్రభావాలకు, ఒత్తిళ్లకు తలొగ్గి నడుస్తుంటాయి. ఈ రీత్యా చూసినప్పుడు ఆధిపత్య ప్రాంతంలోని ఆధిపత్య వర్గాలకు ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో పెద్ద పాత్ర ఉంటుంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఆధిపత్య వర్గాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి ఈ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, కె.యస్. రావు వంటివారి వైఖరులు ఈ విషయాన్ని పట్టిస్తాయి. ఈ వర్గాలకు ప్రజల ఆకాంక్షల కన్నా, ప్రజాభిప్రాయం కన్నా తన ప్రయోజనాలే ప్రధానమవుతాయి.
అయితే, తెలంగాణ ప్రజల ఆకాంక్ష గురించి, వారి అభిప్రాయం గురించి ఇక్కడ ఒక ఆలోచన చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నల్లగొండ శాసనసభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాలో తెలంగాణపై ఒక సర్వే నిర్వహించినట్లు సమాచారం. 80 శాతం మంది నల్లగొండ జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఆ సర్వేలో వెల్లడైంది. నిజానికి, నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం బలహీనంగా ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి అంచనా మాత్రమే కాకుండా తెలంగాణ మేధావుల అభిప్రాయం కూడా. అయితే నల్లగొండ జిల్లాలోని సగం ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం కాస్తా తక్కువగానూ, మిగతా సగం మెట్ట ప్రాంతంలో ఉధృతంగానూ ఉంది. నల్లగొండ జిల్లా పరిస్థితి ఇలా ఉంటే, ఉద్యమం బలంగా ఉన్న వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందనే విషయంపై ఒక నిర్ధారణకు రావచ్చు. తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందనే విషయాన్ని కాంగ్రెసుకు చెందిన తెలంగాణ నాయకులు కచ్చితంగానే చెబుతున్నారు.
ఈ పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతున్నదో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ లోకసభ ఎన్నికల్లో ప్రజలు దాన్ని రుచి చూపించారు. కాంగ్రెస్ దెబ్బ తింటే తెలుగుదేశం పుంజుకునే పరిస్థితి తెలంగాణలో ఉందని చెప్పడానికి ఏమీ లేదు. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య ఓట్లు చీలిపోయి తమకు లాభం జరుగుతుందని తెలుగుదేశం నాయకులు అనుకుంటే అది అత్యాశే అవుతుంది. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని సమానస్థాయిలో తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఒక అంచనాకు వచ్చారు. తెలంగాణవాదం నివురు గప్పిన నిప్పులా ఉందని, ఎన్నికల నాటికి అదంతా ఓట్ల రూపంలో తమకు అనుకూలంగా ఎగిసిపడుతుందని ఆయన నమ్ముతున్నారు. చంద్రశేఖర రావు నమ్మకాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. తెలంగాణవాదాన్ని ముందుకు నడిపించడానికి ఎన్నికలనే ప్రధాన పోరాటరూపంగా తీసుకున్న చంద్రశేఖరరావుకు వచ్చే ఎన్నికలే కీలకం. ఈ ఎన్నికల్లో ఆయన తగిన సీట్లను సాధించలేకపోతే దాని ప్రభావం కచ్చితంగా ఆయన రాజకీయ జీవితంపై వ్యక్తిగతంగా పడుతుంది. అందువల్ల ఆయన సర్వశక్తులూ ఒడ్డుతారు. ఇప్పటి నుంచే ఆయన వివిధ జిల్లాల్లో జరుగుతున్న సదస్సులో పాల్గొంటున్నారు. కొన్ని వేల మంది విద్యార్థులకు శిక్షణాతరగతులు నిర్వహించారు. తెలంగాణవాదాన్ని బలంగా వినిపించడానికి, ఎదురు పక్షం నుంచి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి వారిని సమాయత్తం చేశారు. వివిధ అంశాలపై తెలంగాణ కోణాన్ని వారికి అందించడమే కాకుండా కావలసినంతగా గణాంక వివరాలు వారి చేతుల్లో పెట్టారు. ఇది చాలా నిశబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ప్రస్తుత, భవిష్యత్తు రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కాంగ్రెసుకు మళ్లీ గట్టెక్కుతుంది. లేకుంటే అధికారాన్ని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ వదులుకోవడానికి సిద్ధపడాలి.












Click it and Unblock the Notifications
