కెసిఆర్ కరెక్టేనా?

తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన కాంగ్రెసు పార్టీని, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని ఓడించడం తెలంగాణ రాష్ట్ర సాధనకు కెసిఆర్ కు అవసరం. పైగా, తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ప్రతిపాదిస్తామని కూడా చెప్పింది. ఈ మేరకు తెలుగుదేశంతో కలిసి ఉండడం రాష్ట్రంలో తెరాసకు అవసరం. అదే విషయాన్ని తెరాస నాయకులు స్పష్టంగా చెబుతున్నారు. మహా కూటమి రాష్ట్రానికే పరిమితమని, రాష్ట్రంలో తాము మహా కూటమితోనే ఉంటామని కెసిఆర్ తో సహా తెరాస నాయకులంతా చెబుతున్నారు. ఆ స్పష్టత తెరాసకు ఉంది. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేయించడానికి తెరాస తెలుగుదేశంతో ఉండాల్సిన అవసరం ఉంది. అయితే, తెలుగుదేశం, వామపక్షాలకు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన మెజారిటీ వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతారా అనేది సందేహం. అటువంటి తీర్మానానికి సిపిఐ కాకున్నా సిపిఎం అడ్డు పడే అవకాశాలున్నాయి.
కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఇస్తామని బిజెపి నాయకులు స్పష్టంగా చెబుతున్నారు. అందువల్ల కేంద్రంలో ఎన్డీయె ప్రభుత్వ ఏర్పాటుకు శక్తి మేరకు చేయూత అందించాల్సిన అవసరం కెసిఆర్ కు ఉంది. అందులో భాగంగానే ఆయన లూథియానా ర్యాలీకి వెళ్లారు. ఇది విధానాలు లేకపోవడం గానీ, ద్వంద్వ వైఖరిని అవలంబించడంగానీ కాదనే విషయాన్ని వామపక్షాలు గుర్తించాల్సి ఉంటుంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తృతీయ కూటమితో ఉంటామని కూడా కెసిఆర్ స్పష్టంగానే చెబుతున్నారు. అందువల్ల కెసిఆర్ ను విమర్శించే నైతిక హక్కు సిపిఎం, సిపిఐ నాయకులకు లేదనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.
తన లక్ష్య సాధనను కాదని తృతీయ కూటమితో కలిసి ఉండాల్సిన అవసరం కెసిఆర్ కు ఎంత మాత్రమూ లేదు.సిపిఎం మొదటి నుంచీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తూ వస్తోంది. సిపిఐ కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఏ మేరకు చర్యలు చేపడుతుందో అనుమానమే. అందువల్ల జాతీయ స్థాయిలో తన లక్ష్యాన్ని సాధించుకోవడానికి కెసిఆర్ ముందుకు సాగుతున్నారనే విషయాన్ని గమనించాలి. ఒక ప్రభుత్వాన్ని గద్దె దింపి మరో పార్టీని గద్దెనెక్కించే రాజకీయాలు తప్ప మరో రాజకీయాలు వామపక్షాలు లేకుండా పోయాయి. వాటికి కెసిఆర్ ను తప్పు పట్టే నైతిక హక్కు లేదు.












Click it and Unblock the Notifications