క్విక్ బాక్సింగ్: దు:ఖ సముద్రం

లీలగా వినిపిస్తున్న కమ్మటి పాటని చెట్లల్లో పైకీ కిందకీ వూయల్లూపుతున్నది గాలి. లీలగా వినిపిస్తున్న కమ్మటి పాట ప్రయాణిస్తున్నది. అనంతంగా సాగిపోతున్న కొండ చిలువ వీపుమీద ప్రయాణిస్తున్న బస్సులో కమ్మటిపాట.

చప్పట్ల హోరు. ఈలల జోరు. గల గల మంటున్నది బస్సు. జరజరమంటున్నది బస్సు. మరో పాట పాడమని రిక్వెస్టు. ష్.. సైలెన్స్ అని అరుపు. ఆగండి.. పాడుతున్నది.. కేక.

జర్రుమంటున్న బస్సు బుర్రుర్రుమన్నది. బుసకొట్టి కీచుమని ఆగింది. ఆవులించింది. తెర్చుకున్న దాని నోట్లోంచి ఒకరొకరుగా బయటకు వచ్చారు. రెండు పదుల వయస్సుదాటని వాళ్లు చేతుల్లో కెమెరాలున్న వాళ్లు ముఖాల్లో ఉత్సాహం వూరకలేస్తున్న వాళ్లు.

chintapatla sudarshan quick-boxing on beas river tragedy

అదొక నది. అదొక జలనిధి. నీటి అంచున కూచునీ నించునీ పడుకున్న బండరాళ్లు అందంగా వరుసగా క్రమంగా వున్నవవి.

నువ్వుదాని మీద నిలబడు. బ్రహ్మాండమైన పోజు. ‘స్మైల్ ప్లీజ్'.. కెమెరా క్లిక్కుమంది. ఏయ్ మీరంతా ఈ రాయి మీద నిలబడండి. ఫొటో తీస్తాను.. వరుసగా నిలబడండి. నువ్వీపక్కకిరా. అరే అంత పొడుగెందుకు పెరిగావురా పొట్లకాయలా. నువ్వు వెనక్కి వెళ్లు.. స్టడీ.. ఒన్ టూ త్రీ.. యస్.. కదలకండి.. ఒన్ మోర్.

క్లిక్.. క్లిక్.. క్లిక్.. కెమెరాలు.. ఫోజులు.. భంగిమలు.. రకరకాలు.. గలగలమంటున్న నీళ్లు.. తమలో తామే పాడుకుంటోన్న నీళ్లు. వినిపించీ వినిపించనట్టు గలగల మంటున్న నీళ్లు. నీళ్ల అంచుల్లో రాళ్లు.. రాళ్ల మీద విరిసే నవ్వులు.. ఆనందపులోతులు.

రెప్పమూసుకుని తెరిచేలోపు.. గాలిలో కానరాని గడుసుదయ్యాలు.. శివ సముద్రమూ.. నయాగరా.. పొటెత్తిన సప్త సముద్రాల్.. యముని మహిషపు లోహ గంటలు.. నరకలోకపు జాగిలమ్ములు.

ఎగిరిఎగిరి దూకే నీళ్లు.. సుడులు తిరిగే నీళ్లు.. పొగలు కక్కే నీళ్లు.. నీళ్లు.. భూమ్యాకాశాలను కలిపే నీళ్ళు..

అరే.. నువ్వెక్కడ.. అరే.. వాడెక్కడ.. ఎక్కడున్నావ్.. నువ్వెక్కడున్నావ్.. ఇట్రా.. ఇట్రా.. పరుగెత్తు.. రన్.. రన్...

ఏం జరుగుతున్నది. అయ్యో.. అమ్మో.. అమ్మా.. కళ్లు తిరుగుతున్నవి.. నీళ్లల్లో ప్యాంట్లూ షర్ట్లూ తలలూ.. పాటపాడిన అమ్మాయిలూ.. పాటపాడిన అమ్మాయీ.. ఇదేంటి అంతా గిరగిరా.. తిరుగుతున్నారా.. అసలేరీ.. ఇక్కడెవరైనా ఉన్నారా? అసలెప్పుడైనా ఉండేవారా..

ఎవరూ లేరే.. ఎక్కడ చూసినా నీళ్ళే.. ఇక్కడ ఇంతకు ముందు.. విరిసిన నవ్వులు.. విరగకాసిన ఉత్సాహం.. చెలరేగిన సందోహం.

సమాప్తం.. నిశ్చబ్దం..

గట్టు మీద ఎవరెవరున్నారు? ఎవరెవరొచ్చారు.. ఒరేయ్.. నువ్వున్నావా?.. మరి వాడేడి.. ఎక్కడ.. అమ్మా నువ్వున్నావా? మరి ఆమె.. ఏదీ.. లేదా? రాలేదా? బా చూడండి.. ఎవరెవరు ఎక్కడవున్నారు?

నదిలో నీళ్లు.. బస్సులో కన్నీళ్లు.. నదిలో ఒళ్ళు తెలీని నీళ్ళ వీరంగం.. బస్సులో కకావికలైన కన్నీళ్ళ విషాదం.

గుండెలు గడియారాలైనవి. మిగిలున్న ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చినయి.. కళ్ళు కాయలై పోయినవి. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. జరిగింది జరగలేదని.. అసలేమీ జరగలేదని.. బస్సు ప్రయాణిస్తూనే ఉందని.. అదెక్కడా ఆగలేదని.. ఎవరూ నది అంచున బండరాళ్ల మీదకి వెళ్లనే లేదని.. కెమెరాలు క్లిక్కనలేదని.. అంతా ఓ కలేనని.. కలే నిజం అని.. నిజం నిజంగా నిజం కాదని నీళ్లునిండిన కళ్ళని మోస్తున్న గుండెల చప్పుడు.

అమ్మాయి ఇంటికి వచ్చేది రేపా ఎల్లుండా అన్న ఆలోచన మదిలో మెదుల్తుంటే అన్యమనస్కంగా టీవీ చూస్తున్న తల్లి హఠాత్తుగా వెర్రి కేక వేసి విరుచుకు పడింది నేల మీద.

అబ్బాయికి ఇంటికి వచ్చాక బైక్ కొంటాలే అని చెప్పాలన్న ఆలోచన మనస్సులో కదలాడ్తుంటే అదేపనిగా మోగిన సెల్ ఎత్తి చెవికి ఆనించి.. అంతే మొదలు నరికిన చెట్టులా పెద్ద చప్పుడు చేస్తూ కింద పడ్డాడు.

ఎక్కడున్నాంరా మనం? అడిగాడు. తడిసి ముద్దయిపోయి ఒంటికి అతుక్కుపోయిన డ్రస్సు బరువైపోయింది. ఏమీ కనిపించడం లేదురా? ఎక్కడున్నాం మనం? మూసుకుపోయిన కళ్ళని బలవంతంగా తెరుస్తూ.

కొంచెం కొంచెం.. ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. అక్కడా.. ఇక్కడా.. కదుల్తున్నది.. మన వాళ్లే.. అవున్రా! నాకూ ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నది తలమీంచి జారుతున్న నీళ్లని రెండు చేతుల్తో కిందకి తోసేసి చూస్తూ.. నువ్వేంట్రా గడ్డకూరిన బొమ్మలా ఇంత లావై పోయావు అన్నాడు. నిజమే.. కెవ్వుమన్నాడు మరొక ఆకారం.

హేయ్! కమాన్! అంతా ఒక్క దగ్గరికి రావాలి..

ఇక్కడున్నది మనమేనా.. అమ్మాయిలు ఎందరున్నారు? మరి మనవాళ్లంతా ఎక్కడున్నారు?

ఇక్కడెందుకున్నాం మనం? చుట్టూ నీళ్లున్నయి.. మనమంతా నీళ్లల్లో వున్నమా? మనపైనించి నీళ్లు పరుగెడ్తున్నాయా?

అవును. నీళ్ల చప్పుడే.. ఇంకేం వినపడ్డం లేదు.

నేనింటికెళ్లాలి. అమ్మ గుర్తుకొస్తున్నది. పెద్ద పెట్టున ఏడ్చిందో అమ్మాయి.

వెళ్తాంలే.. ఏడవకు.. అన్నది మరో అమ్మాయి. అమ్మ కోసం.. అమ్మ ఎన్నాళ్లనించో కావాలనుకున్న లెదర్ బ్యాగ్ కొన్నానే.. ఏడ్చిన అమ్మాయి అంది మళ్లీ ఏడుపు అందుకుంది.

నేను తమ్ముడి కోసం స్వెట్టర్ కొన్నాను.. నేను నాన్న కోసం పర్సుకొన్నాను.. నేనది కొన్నాను.. నేనిది కొన్నాను.

ఇంటికెప్పుడు వెళ్తాం... వెళ్తామా?

మనమంతా ఇంజనీర్లం.. మనకెంతో భవిష్యత్తు వుందని మనసార్లు చెప్పారు... మనకేం కాదు.. మనకేం కాలేదు.. మన కోసం వస్తారు.. ఎవరో వస్తారు.. ఇక్కడ్నించి తీసుకుపోతారు.

బస్సులో పాడిన పాట.. మళ్లీ పాడవూ.. ఇప్పుడా.. పాడలేను.. ముందు ఇక్కడ్నించి వెళ్లిపోవాలి. మన కోసం కలలు కంటున్న అమ్మా నాన్నల దగ్గరికి వెంటనే వెళ్లిపోవాలి. మన కోసం ఎదిరిచూస్తూ గేట్ దగ్గర నిలబడ్డ అమ్మ కోసం, ఇంట్లో వున్నా చూపులన్నీ గేట్ బయటే నిలబెట్టే నాన్న కోసం.. వెళ్లిపోవాలి... వెళ్దాం.. వెళ్దాం.. వెళ్దాం.. ఇంటికి వెళ్దాం..

ఏరా చెకుముకీ ఈళ్లేంట్రా ఇంటికెళ్దాం అంటున్నారు.. కొమ్ములు పెరిగిన తల్లో చింపిరి జుట్టు పీక్కుంటూ అన్నాడు లకుముకి

ఇంకెక్కడి ఇల్లురా లకుముకీ యమలోకం నుంచి వెహికిల్ రాగానే ఈ బాడీలన్నీ పైకి రవాణానే.. అన్నాడు చెకుముకి చెవిలో వేలుపెట్టి తిప్పుకుంటూ

పాపం.. బతికున్నామనీ.. ఇళ్లకు వెళ్తామనీ అనుకుంటున్నారు పసిపిల్లలు.. మొగ్గలు.

పాపం మనది కాదురా.. దేశానికి అవసరమైన మానవ వనరుల్ని, సాంకేతిక విజ్ఞాన గనుల్ని పొట్టన పెట్టుకున్నది మనం కాదురా! వీళ్ల తల్లిదండ్రుల్ని పుట్టెడు దు:ఖంలో ముంచేసింది.. జీవితాంతం గర్భశోకానికి బలిచేసింది మనం కాదురా.. మన డ్యూటీ మనం చేస్తున్నాం కానీ ఈ పాపం.. మహా పాపం.. మనది కానేకాదురా.. అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. డ్యూటీలో ఎన్నడూ కన్నీరు పెట్టని లకుముకి. తనూ అప్పట్నించీ ఆపుకున్న దాన్ని ఆపలేక పెద్ద పెట్టున యేడ్చాడు చెకుముకి.

ప్రాణాలు తీసే వాళ్లకి వున్న జాలి కూడా లేదు ఈ వ్యవస్థకి. ఈ తప్పు ఎవరిది? ఈ పాపం ఎవ్వరది? తప్పు నీది అంటే నీదని.. పాపం నీదంటే నీదని తమ మీదనించి దులిపేసుకుంటున్నారు. బిడ్డల్ని పోగొట్టుకున్న తలిదండ్రుల దు:ఖానికి ఖరీదు కట్టే పనిలో వున్నారు.

- చింతపట్ల సుదర్శన్
(8-6-2014 బియాస్ నది తాగేసిన ప్రాణాల కోసం లయతప్పిన గుండె స్పందన)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+