గన్నవరం విమానాశ్రయంలోనూ శ్రీవారి దర్శన టికెట్ల జారీ, టీటీడీ కీలక నిర్ణయం..!!
TTD: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వేసవిలో పెరిగే రద్దీకి అనుగుణంగా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా వీఐపీ బ్రేక్ సిఫారసు లేఖలు నెల రోజుల పాటు రద్దు చేయాలని డిసైడ్ అయింది. ఇదే సమయంలో క్యూ లైన్ మేనేజ్మెంట్ విధానం ద్వారా దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా.. శ్రీవాణి దర్శన టికెట్లను ఇతర ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. ఇందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది.
తిరుమలలో శ్రీవారి భక్తుల సదుపాయాల పెంపు పైన టీటీడీ ఫోకస్ చేసింది. అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. శ్రీవాణి టికెట్ల పంపిణీలో కొత్త మార్పుల దిశగా టీటీడీ ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం శ్రీవాణీ టికెట్ల కోటాలో భాగంగా ప్రతీ రోజు 1500 దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు. అందులో 500 టికెట్లు ఆన్ లైన్ లో ఇస్తుండగా.. కరెంట్ బుకింగ్ ద్వారా 800 టికెట్లు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన 200 టికెట్లను తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో అందుబాటు లో ఉంచుతున్నారు. కాగా.. రేణిగుంటలో టికెట్లు ఉదయం సమయాల్లో హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు కొనుగోలు చేస్తున్నారు. దీని కారణంగా తరువాత వచ్చే భక్తులకు టికెట్లు దొరకటం లేదు. దీంతో, ఇప్పుడు టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో రోజుకు 100 శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయాలని టీటీడీ భావిస్తోంది.

వేసవి రద్దీ వేళ కీలక నిర్ణయాలు
దీని కారణంగా గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి చేరుకునే అమరావతి, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల భక్తులకు అక్కడే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రతిపాదన పైన సీఎం తో చర్చించి.. ఆమోదం తీసుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఆమోదం లభిస్తే వెంటనే గన్నవరం విమానాశ్రయంలో టికెట్ కౌంటర్ ప్రారంభించనున్నారు. ఈ నిర్ణయం అమల్లో కి వస్తే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు మరింత సులభంగా పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇక.. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు.













Click it and Unblock the Notifications