తొలి తెలుగు తీర్పు ప్రేరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు అమలుకు సంబంధించి ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ప్రభుత్వ కార్యకలాపాలు తెలుగు భాషలో సాగడమనేది ఇన్నాళ్లు నేతిబీరకాయ చందంగానే కనిపించింది. కానీ మనసుంటే మార్గం ఉందని నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి మంగారి రాజేందర్ (జింబో) నిరూపించారు. తెలుగు భాషలో తీర్పు వెలువరించి ఆయన ప్రభుత్వ కార్యకలాపాలను తెలుగులో నడపడానికి మార్గదర్శనం చూపారు. ఆయన ఈ నెల 19వ తేదీన తెలుగులో తీర్పు వెలువరించి తెలుగులో తీర్పు వెలువరించిన న్యాయమూర్తిగా ఘనతకెక్కారు. అయితే ఆయన అదేదో మొక్కుబడిగా చేయడం లేదని చెప్పడానికి దాఖలా వెంటనే కనిపించింది. తిరిగి ఆయన ఈ నెల 23వ తేదీన తెలుగు భాషలో తీర్పు వెలువరించారు. నిజామాబాద్ జిల్లా మళ్లూరు మండలం మానిక్‌భండార్ గ్రామానికి చెందిన నర్సమౌల్ల లింబాద్రి అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడనే నమోదైన అభియోగాలపై ఆయన రెండవ తీర్పును వెలువరించారు. అతను అత్యాచారం చేశాడనడానికి ఆధారాలు లేవని, అయితే బాలిక గౌరవ మర్యాదలకు భంగం కలిగించడానికి ఆధారాలున్నాయని అంటూ అతనికి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ మంగారి రాజేందర్ తీర్పు వెలువరించారు.












Click it and Unblock the Notifications