సిలికాన్ వేలీలో చేతలుడిగిన స్త్రీలు
మానవ హక్కుల్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న 26 ఏళ్ల రీమా సహానీ వంటకాల గురించి ఆన్ లైన్ లో అన్వేషిస్తూ కాలం గడుపుతోంది.
మాజీ క్రెడిట్ అనలిస్టు అయిన 37 ఏళ్ల వర్ఖా చెల్లాని తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ గడుపుతోంది.
పాతికేళ్ల మాజీ కంప్యూటర్ ప్రోగ్రామర్ గోమతి కన్నన్ నృత్య తరగతులు నిర్వహిస్తూ బ్లాగుల్లో రాసుకుంటూ కాలం గడుపుతోంది.
హెచ్ - 1బి వీసాలపై అమెరికాకు వచ్చిన తమ భర్తలతో పాటు వచ్చిన వేలాది మంది మహిళల్లో సహానీ, చెల్లానీ, కన్నన్ ఉన్నారు. సిలికాన్ వ్యాలీలోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో, టెక్నాలజీ ల్యాబ్ ల్లో పనిచేయడానికి వేలాది మంది నిపుణులైన భారతీయులకు హెచ్ - 1బి వీసాలు లభించాయి. వారి డిపెండెంట్స్ కు ఇచ్చే హెచ్ - 4 వీసాలపై సిలికాన్ వ్యాలీకి వచ్చిన మహిళలకు కాలం గడవడమే గండంగా ఉంది. వారికి ఉద్యోగాలు చేయడానికి అనుమతి ఉండదు. ఉన్నత విద్యలు అభ్యసించినప్పటికీ దేశం కాని దేశంలో ఇమడడానికి మానసిక సంఘర్షణకు గురవుతూ సామాజికంగా, ఆర్థికంగా తమ భర్తలపై ఆధారపడి జీవితాలు వెళ్లదీయాల్సి వస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్ ఈ మహిళలపై ఒక వార్తా కథనాన్ని రాసింది.
అమెరికా హోం శాఖ 2006లో 1,35,000 వేల హెచ్-1బి వీసాలు జారీ చేసింది. వారి భార్యలకు 74 వేల హెచ్-4 వీసాలు ఇచ్చింది. సిలికాన్ వ్యాలీలో దాదాపు 35 వేల మంది హెచ్-1బి వీసా హోల్డర్లు ఉద్యోగాలు చేస్తున్నట్లు ఒక అంచనా. సిలికాన్ వ్యాలీలో నివసిస్తున్న భారతీయ మహిళల జీవితకథలు దాదాపు ఒకే తీరుగా ఉన్నాయి. చాలామంది భారతీయ మహిళలు కంప్యూటర్ సైన్సెస్, బిజినెస్ కోర్సులు చదివి డిగ్రీసు పొందినవారే. అత్యధునాత కంపెనీల్లో పనిచేసినవారే. కుటుంబ, మిత్ర బృందాల మద్దతు ఉన్నవారే. అవకాశాలకు కొదవ లేదని భావించి పెళ్లిల్లు చేసుకుని సిలికాన్ వేలీలో కాలు పెట్టిన వారికి నిరాశానిస్పృహలే ఎదురవుతున్నాయి. భర్తలు కెరీర్ నిచ్చెనమెట్లు అధిరోహిస్తుంటే వీరు మాత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తోంది.
ఇక్కడికి వచ్చిన భారతీయ మహిళల్లో నిస్పృహ చోటు చేసుకుంటోందని, ఉద్యోగాలు చేస్తూ సమాజంలో కలిసి పోయే అవకాశాలు వారికి ఉండడం లేదని, దాంతో ఇంటిపై బెంగ వారిని పట్టి పీడిస్తోందని ఇమిగ్రేషన్ లాయర్ శివాలి షా అంటున్నారు. శివాలీ షా వంద మంది హెచ్-4 వీసా హోల్డర్లను తీసుకుని సర్వే చేశారు. చేతి నిండా పని చేస్తూ దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చిన వారు నైతికంగా కూడా బలహీన పడుతున్నారని షా అంటున్నారు.
ఢిల్లీ నుంచి 2006లో ఇక్కడికి వచ్చిన రీమా సహానీ ఇంటర్నెట్ చూస్తూ, ఫుడ్ నెట్ వర్క్ చూస్తూ కాలం గడుపుతోంది. ఆమె భర్త మాత్రం భారీ హైటెక్ కంపెనీలో కెరీర్ నిచ్చెనమెట్లు అధిరోహిస్తున్నాడు. ఆమె జీవితం రెండు బెడ్ రూములున్న అపార్ట్ మెంటుకు పరిమితమైపోయింది. ఏమీ చేయకుండా రోజంతా ఒంటరిగా గడపడం విచారకరమేనని సహానీ అంటున్నారు. తానెందుకు ఇక్కడ ఉండాలని, సమయమంతా వృధా చేసుకోవాలని తాను భర్తతో పదే పదే అంటున్నట్లు ఆమె తెలిపారు.
మొనాటనీతో ఏడాది పాటు గడిపిన సహానీ ఆ తర్వాత మిల్పిటాస్ లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ కు వెళ్లడం ప్రారంభించింది. అక్కడికి వచ్చే మిగతా స్త్రీల పరిస్థితిలో కూడా తేడా ఏమీ లేదు. ఇంటర్నెట్ ల్లో చాట్ రూములనకు వీరు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఆస్టిన్, టెక్సాస్ ల్లోని భారతీయ మహిళల కోసం ఇందుస్లేడీస్ డాట్ కామ్ అనే నెట్ వర్క్ సైట్ ను ప్రారంభించిన మాలతీ జే తన సైట్ నెలకు 2 మిలియన్ల పేజ్ వ్యూలు వస్తాయని చెబుతోంది. దీన్ని బట్టి అమెరికాలోని భారతీయ మహిళల పరిస్థితి ఏమిటో, వారి ఆర్తి ఏమిటో అర్థమవుతుంది.
32 ఏళ్ల జే చెన్నైలోని ఫోర్డ్ మోటార్స్ కంపెనీలో ఐటి స్పెషలిస్టుగా పనిచేసింది. హెచ్-4 వీసాపై ఆస్టిన్ కు వచ్చిన ఆమె చాలా కాలం ఇంటి వద్ద గడిపింది. ఈ స్థితిలో వెబ్ సైట్ పెట్టాలనే ఆలోచన చేసింది. భారతీయ మహిళల సమస్యలకు ఈ వెబ్ సైట్ పరిష్కారాలు చూపుతుది. హెచ్-1బి వీసా హోల్డరును తాను పెళ్లి చేసుకుని హెచ్-4 వీసాతో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తోచేది కాదని, ఒక డాలర్ సంపాదించుకోవడానికి కూడా అవకాశం లేదని, ఒంటరిగా కాలం గడపడం కనాకష్టంగా మారిందని ఆమె అంటోంది.
పర్మినెంట్ రెసిడెన్సీ కోసం లేదా గ్రీన్ కార్డు కోసం దంపతులు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు డిపెండెంట్ గా ఉన్న భార్య కూడా ఉద్యోగం చేయడానికి అనుమతి వస్తుంది. కానీ అందుకు ఏళ్లు పడుతుంది. ఎన్నో ఒడిదొడుకులను చూశానని, ఇక్కడికి వచ్చినందుకు ఎంతో విచారిస్తుంటానని వర్ఖా చెల్లాని అంటోంది. గ్రీన్ కార్డు కోసం ఆమె ఏడేళ్లుగా ఎదురు చూస్తోంది. భారతదేశంలో ఆమె మిత్రులు మాత్రం కెరీర్ లో ఎదిగిపోతున్నారు.
ఒకరి ఆదాయంపై పిల్లలను చదివించడం, జీవితాన్ని వెళ్లదీయడం కూడా కష్టంగానే ఉంటోంది. తమ కెరీర్ అంతం కాకుండా చూసుకోవాలని తాపత్రయపడుతున్న మహిళలే మనకు అధికంగా కనిపిస్తారు. ఇంత నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడం కూడా కష్టమేనని దవాలంటీర్ సెంటర్ డాట్ నెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ పొవార్ అంటున్నారు. ప్రొఫెషనల్ బ్యాక్ గ్రౌండ్ ఉండి, కెరీర్ ను కొనసాగించాలనుకునే మహిళలే ఎక్కువ మంది అని పొవార్ అంటున్నారు.












Click it and Unblock the Notifications