తమ్ముళ్లకు కాంగ్రెస్ స్నేహ ‘హస్తం’: రేవంత్ రెడ్డి బాటలోనే ప్రముఖ నేతలు?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లోగా టీటీడీపీని ఖాళీ చేయించడానికి భారీ స్కెచ్‌ వేసినట్లు కనిపిస్తోంది. టీటీడీపీ మాజీ నేత రేవంత్‌ రెడ్డి సైకిల్‌ దిగి, హస్తానికి చేయూత ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోంది. తెలంగాణ టీడీపీ ఓటు బ్యాంక్‌పై కన్నేసిన హస్తం పార్టీ, రేవంత్‌ రెడ్డి ద్వారా పలువురు నేతలను పార్టీలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. టీటీడీపీ ముఖ్య నేతలను కాంగ్రెస్‌లోకి వచ్చేలా మంతనాలు సాగిస్తోంది. ఇందుకు జిల్లాల వారీగా టీడీపీ నేతలతో చర్చలు జరుపుతోంది. వీలైనంత ఎక్కువమంది టీడీపీ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ వ్యూహరచనగా కనిపిస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న టీ టీడీపీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు.

మరో రెండు రోజుల్లో భారీగా వలసలు ఉంటాయన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నిన్న రేవంత్‌, ఇవాళ వేం నరేందర్‌ రెడ్డి రాజీనామాలు చేయగా, తాజాగా పటేల్‌ రమేష్‌ రెడ్డి, బెల్లయ్య నాయక్‌, రాజారాం యాదవ్‌ కూడా రాజీనామాలు చేశారు. అదే బాటలో మరికొందరు టీడీపీ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 31న రేవంత్‌తో పాటుగా మరో 30మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో పటేల్ రమేశ్, కంచర్ల చేరిక లాంఛనమే

కాంగ్రెస్ పార్టీలో పటేల్ రమేశ్, కంచర్ల చేరిక లాంఛనమే

ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ముగ్గురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం సాగింది. ఇప్పటికే రాష్ట్రంలో గెలిచిన టీడీపీ ముఖ్యనేతలందరూ అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి మరికొందరు నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్తే టీటీడీపీకి నష్టమే. ఇప్పటివరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంచర్ల భూపాల్‌రెడ్డి, పటేల్‌ రమేష్‌రెడ్డి, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ముఖ్య టీడీపీ నేతలుగా ఉన్నారు. వీరిలో నర్సింహులు మినహా మిగతావారు రేవంత్‌ వెంట వెళతారని సమాచారం. నల్గొండ నుంచి కంచర్ల భూపాల్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు పటేల్‌ రమేష్‌రెడ్డి వెళ్లడం లాంఛనమే. వీరిద్దరూ రేవంత్‌తోపాటే హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. టీటీడీపీని నడిపించిన సమయంలో చాలామంది నాయకులు రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా మారారు. రేవంత్‌ అభీష్టం మేరకు కంచర్ల భూపాల్‌రెడ్డి ఆయన వెంట వెళ్లటానికి సుముఖంగా ఉన్నారని సమాచారం. పటేల్‌ రమేష్‌రెడ్డి, రేవంత్‌ అబిడ్స్‌లోని రెడ్డిహాస్టల్‌లో కలిసి చదువుకున్నారు. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. రమేష్‌రెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. దీంతో ఆయన వెళ్లడం ఖాయమేనని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని కంచర్ల భూపాల్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి పేర్కొన్నారు.

సందిగ్ధంలో ఉమా మాధవరెడ్డి

సందిగ్ధంలో ఉమా మాధవరెడ్డి

కార్యకర్తలు వ్యతిరేకిస్తుండటంతో ఉమామాధవరెడ్డి వెళ్లాలా? పార్టీలోనే ఉండాలా? అన్న మీమాంసలో కొనసాగుతున్నారు. తెలంగాణ గడ్డపై తొలి నుంచి ముఖ్య నాయకుడిగా వెలుగొందిన మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మరణం తర్వాత ఆమె పార్టీలో కీలకంగా పనిచేశారు. ఇటీవల వారి తనయుడు సందీప్‌రెడ్డి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కూడా. ఆ మేరకు ఆయన్ను యాదాద్రి భువనగిరి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతానికి పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని, భవిష్యత్‌లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దామని ఉమా మాధవరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

వరంగల్ జిల్లాలో ‘చెయ్యం’దుకునేదవరు?

వరంగల్ జిల్లాలో ‘చెయ్యం’దుకునేదవరు?

‘రేవంత్ రెడ్డి' నిష్క్రమణ ఉదంతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ ప్రకంపనలు స్రుష్టిస్తుందని భావిస్తున్నారు. టీడీపీ సీనియర్‌ నేత, మహబూబాబాద్‌ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ రెడ్డి కూడా రేవంత్‌రెడ్డి బాటలోనే నడిచారు. తాను టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. నరేందర్‌ రెడ్డితో పాటు ఇంకెవరు రేవంత్‌ను అనుసరించబోతున్నారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొన్నది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, సీతక్క, గండ్ర సత్యనారాయణరావు, ఈగ మల్లేశం భవితవ్యంపై ఊహాగానాలు తలెత్తుతున్నాయి. వారు మాత్రం పార్టీని వీడేది లేదని బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ నాయకుడిగా రేవంత్‌ రెడ్డితో కలిసి పాలక పార్టీ విధానాలపై పోరాడామే తప్ప ఆయనను గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం తమకు లేనే లేదని పలువురు నేతలు అంటున్నారు. ఇంతకు ముందు ఎర్రబెల్లి దయాకర్‌ రావు గులాబీ తీర్థం పుచ్చుకున్నప్పుడు కూడా జిల్లాలో ఇలాంటి ప్రచారమే జరిగిందని గుర్తు చేస్తున్నారు.

దొంతి వర్సెస్ పెద్ది సుదర్శన్ రెడ్డి

దొంతి వర్సెస్ పెద్ది సుదర్శన్ రెడ్డి


నర్సంపేట విషయానికొస్తే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పార్టీ మారడంతో నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని స్థానిక టీడీపీ నేతలు అంటున్నారు. నర్సంపేటలో ఇప్పటికే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు. 2019 ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు కాకుండా మరో అభ్యర్థికి టికెట్‌ కేటాయించే చాన్స్ లేదు. ఇక టీఆర్‌ఎస్‌ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డి నర్సంపేట ఇన్‌చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను కాదని టీఆర్‌ఎస్‌ అధిష్టానం మరో వ్యక్తికి టికెట్‌ కేటాయిస్తుందా? అనే చర్చ ఉంది. టీడీపీ నర్సంపే‌ట శ్రేణులు మాత్రం తమ నాయకుడు రేవూరి గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

చురుగ్గానే కాంగ్రెస్ పార్టీలో పొదెం వీరయ్య

చురుగ్గానే కాంగ్రెస్ పార్టీలో పొదెం వీరయ్య

రేవంత్‌ రెడ్డితో కలిసి ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క క్రియాశీలకంగా పనిచేశారు. రేవంత్‌ పార్టీని వీడడంతో సీతక్క కూడా పార్టీని వీడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ సీతక్క పార్టీని వీడే అవకాశం లేదని ములుగు టీడీపీ నేతలు అంటున్నారు. ఏ క్షణాన ఎన్నికలు వచ్చినా సీతక్క ములుగు నుంచి ఘన విజయం సాధిస్తుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశావహుడిగా వున్నారు. అందువల్ల సీతక్క కాంగ్రెస్‌లో చేరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ విషయానికొస్తే మంత్రి పదవిలో ఉన్న చందూలాల్‌ టీఆర్‌ఎ్‌సలో కీలకమైన నేతగా కొనసాగుతున్నారు. ఆయనను కాదని సీతక్కను అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో నిలబెట్టే అవకాశం ఉండే అవకాశం ఎలా ఉంటుందని సీతక్క అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

సత్యనారాయణరావుకు టీఆర్ఎస్ నుంచి పిలుపు

సత్యనారాయణరావుకు టీఆర్ఎస్ నుంచి పిలుపు


సత్యనారాయణరావు ప్రజా పునాది ఉన్న నేత. అయినా పలు కారణాలరీత్యా ఆయనను ఎమ్మెల్యే పదవి వరించడం లేదు. 30 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ సర్పంచ్‌గా, జడ్‌పీటీసీగా, ఎమ్మెల్యే స్థాయి నేతగా ఎదిగాడు. ఎన్నికల్లో ప్రతిసారి ఏదో కారణాలతో ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేక పోతున్నాడని చెబుతున్నారు. అయినా రేవంత్‌ రెడ్డితో కలిసి రాజకీయ ప్రస్థానం కొనసాగించే అవకాశం ఉందా? అంటున్నారు. చాలా కాలం నుంచే సత్యనారాయణరావును టీఆర్ఎస్ కీలక నేతలు సంప్రదిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. టికెట్‌ విషయం స్పష్టత ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం పలికారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్‌ పరిణామాల తర్వాత సత్యనారాయణరావుకు పార్టీ నేతల నుంచి పిలుపులు పెరగాయని అంటున్నారు. భూపాలపల్లిలో కాంగ్రెస్‌ కీలక నేత గండ్ర వెంకటరమణా రెడ్డి ఉన్నందున సత్యనారాయణ రావుకు టికెట్‌ వచ్చే అవకాశం లేదంటున్నారు. అసలు పార్టీ మారనవసరమే తమ నేతకు లేదని రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, సీతక్కలాగానే తమ నేత స్వతంత్ర అభ్యర్థిగానైనా గెలిచి తీరుతాడన్న నమ్మకంతో ఆయన అనుచరులు ఉన్నారు.

నేతల భవిష్యత్ నిర్ణయం దిశగా ఇలా అడుగులు

నేతల భవిష్యత్ నిర్ణయం దిశగా ఇలా అడుగులు

ఉమ్మడి వరంగల్ జిల్లా టీడీపీలో కీలక నాయకులుగా ఉన్న ముగ్గురిపైనే అందరి దృష్టి ఉంది. అందులో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, ములుగు మాజీ ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క), భూపాలపల్లికి చెందిన గండ్ర సత్యనారాయణ రావు ఉన్నారు. వీరి మీద అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఇపుడు కొనసాగుతున్న టీడీపీ నాయకత్వం ఒత్తిడి ఉంది. రేవంత్‌ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు గులాబీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు కూడా ఈ ముగ్గురి రాక తమకు మరింత బలం చేకూరుస్తుందని ఆశిస్తున్నారు. రేవంత్‌ కూడా వీరి రాజకీయ భవిష్యత్‌కు హామీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా స్థానిక రాజకీయ పరిస్థితులు, కార్యకర్తలు, ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నారు.

రేవంత్‌తోపాటు సండ్ర పార్టీని వీడతారా?

రేవంత్‌తోపాటు సండ్ర పార్టీని వీడతారా?

ఇక తెలుగుదేశం పార్టీకి ఆయువు పట్టుగా ఉన్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల్లో సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేవంత్ రెడ్డితోపాటు ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్నారు. నాడు ఎమ్మెల్సీగా తుమ్మల నాగేశ్వర రావు ఎన్నిక సమయంలో తటస్థంగా ఉండి ఉంటే గులాబీ పార్టీలో చేరిపోవడం తేలిగ్గా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కానీ గులాబీ పార్టీకి వ్యతిరేకంగా.. తుమ్మలకు వ్యతిరేకంగా పని చేయడంతో ఆయన తన రాజకీయ భవితవ్యం గురించి ఆలోచనలో పడ్డారా? అన్న సందేహాలు ఉన్నాయి. మోత్కుపల్లి నర్సింహులు, రమణ, అరవింద్ కుమార్ గౌడ్ నుంచి ప్రతిఘటన ఎదురైన తర్వాత.. ప్రత్యేకించి టీటీడీఎల్పీ సమావేశ నిర్వహణపై మంకుపట్టు పట్టకుండా సలహా ఇచ్చి రేవంత్ రెడ్డి వెనుకకు తగ్గేందుకు కారణమైన సండ్ర వెంకట వీరయ్య కూడా టీటీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారా? లేదా? అన్నది సందేహస్పదంగా ఉన్నది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
T- TDP leader Anumula Revant Reddy resigned party and MLA post. Some of TTDP leaders to be followed Revant foot steps. Each and Every district TDP would empty with its leaders to join in other party. Particularly Congress Party planning to friendly hands with TTDP leaders.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి