ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక కొమురం భీమ్

By Pratap
|
Google Oneindia TeluguNews

కొమురం భీము గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. పలు గిరిజన ఉద్యమాలకు స్ఫూర్తిని అందించిన నాయకుడు. ఆయన ఉద్యమం జల్‌ - జమీన్‌ - జంగిల్‌. ఆయన గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్‌, సోంబాయి దంపతులకు 1900 సెప్టెంబర్‌ 27వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ మండలం సంకేపల్లిలో జన్మించాడని ఉంది. కానీ నిర్దిష్టంగా అతని జన్మ తేదీ అదే అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు.

ఆసిఫాబాద్‌ పరిసర ప్రాంతాలు, జోడెఘాట్‌, బాబేఝరి గుట్టలు కేంద్రంగా నిజాం సైన్యాలపై గెరిల్లా పోరాటం నడిపించాడు. కుర్దు పటేల్‌ అనే నమ్మకద్రోహి సహాయంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్‌ 1వ తేదీన కొమురం భీము స్థావరాన్ని ముట్టడించింది. అతనితో పాటు 12 మందిని హతమార్చింది. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వియుజ మాసం. దాంతో అప్పటి నుంచి గిరిజనులు ఆ తిథి రోజునే కొమురం భీము వర్ధంతిని జరుపుకుంటారు.

తమకు జీవనాధారమైన అడవి నుంచి తరిమేసే ప్రభుత్వ విధానాలకు, చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. తమ భూములను గిరిజనేతరులు ఆక్రమించుకునే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గిరిజనులు పోరాటం చేశారు. కొమురం భీము పోరాటం ప్రధానంగా గిరిజనులను తమ భూముల నుంచి బేదఖలు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా సాగింది.

Komuram Bheem

తమను దోచుకోవడానికి, తమ భూములను ఆక్రమించుకోవడానికి జరిగిన ప్రయత్నాలను అడ్డుకోవడానికి గిరిజనులు ఉద్యమించారు. అడవిని నరికివేస్తే జంగ్లాత్‌ భూమి అని, లేదంటే రెవెన్యూ భూమి అని గోండులను తరిమేయసాగారు. పంటలను ధ్వంసం చేశారు, జరిమానాలు వేశారు. ఈ వేధింపులకు, అణచివేతలకు వ్యతిరేకంగా గోండులు, కోలామ్‌లు పోరు బాట పట్టారు. మా ఊర్లో మా రాజ్యం అంటూ 12 గూడాలు బాబేఝరి లొద్దుల్లో తుడుం మోగించారు. ఈ గోండులకు కొమురం భీము నాయకత్వం వహించాడు.

ధిక్కారం ప్రారంభం

జోడెన్‌ఘాట్‌ ఘటనలో నిందితులు తర్వాతి కోర్టు వాయిదాకు వెళ్లకుండా ధిక్కరిస్తారు. దాంతో సమన్లు తీసుకుని అమీన్‌ జోడెన్‌ఘాట్‌కు వస్తాడు. అమీన్‌ తన సిబ్బందితో రావడం గమనించి గోండులు, కోలామ్‌లు కర్రలతో తయారవుతారు. తాను యుద్ధానికి రాలేదని, కోర్టుకు హాజరు కాకపోవడంతో సమన్లు తీసుకుని వచ్చానని చెబుతాడు అమీన్‌. గోండులు అప్పటికే కోర్టులను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం మేరకే కోర్టు వాయిదాకు వెళ్లరు.

అప్పటికే నిర్ణయం తీసుకోవడం వల్ల తాము సమన్లు తీసుకోబోమని గోండులు తెగేసి చెబుతారు. ఆ కొత్త రకం పరిణామానికి ఆశ్చర్యపోయిన ఆమీన్‌ - వారి తరఫున మాట్లాడేవారెవరైనా ఉంటే తీసుకు రమ్మని చెప్తాడు. దాంతో కొమురం భీము వద్దకు మనిషిని పంపిస్తారు. కొమురం భీము అమీన్‌నే తన వద్దకు రమ్మని కబురు పెడతాడు. లోలోన అమీన్‌ ఉడికిపోతుంటాడు. అయితే, పరిస్థితి తనకు అనుకూలంగా కనిపించడం లేదు. చూస్తే గోండులు తెగించి తన పైకి దూకేట్లుగా ఉన్నారు. దాంతో కోపాన్ని అణచుకుంటూ కొమురం భీము ఇంటి వద్దకు వస్తాడు. కొమురం భీము బయటకు వచ్చి ఏమిటని అడుగుతాడు. కేసులకు హాజరు కావడం లేదని సర్కారు తాఖీదులు పంపిందని అమీన్‌ చెప్తాడు. తాము కేసులకు హాజరు కాదలుచుకోలేదని భీము జవాబిస్తాడు.

సర్కారువాళ్లు పెట్టే దొంగ కేసులకు తాము రాదలుచుకోలేదని, పట్టేదార్లూ, జంగ్లాత్‌వాళ్లూ చేసే దౌర్జన్యాలకు విసిగిపోయామని, తమ పన్నెండు గ్రామాలను కలిపి గోండు రాజ్యంగా ప్రకటించుకున్నామని, నైజాం సర్కారును వ్యతిరేకిస్తున్నామని, నైజాం సర్కారు చట్టాలను తాము పాటించదలుచుకోలేదని సర్కారుకు చెప్పాలని భీము గట్టిగా చెప్తాడు.

కొమురం భీము మాటలతో ఉడికిపోయిన అమీన్‌ భీమును బెదిరించాలని భావిస్తాడు. నాయకులను అరెస్టు చేయాలని తనకు ఆదేశాలున్నాయని, లొంగిపోవాలని భీముకు చెబుతూ అమీన్‌ గాలిలోకి పేలుస్తాడు. అంతే, అప్పటికే సిద్ధంగా ఉన్న గోండులు, కోలామ్‌లు అమీన్‌ మీద పడుతారు. రఘు అమీన్‌ తల మీద కొడతాడు. జవాన్ల బందూకులు లాక్కుంటారు. అందరినీ చితక బాదుతారు. అమీన్‌తో పాటు వచ్చిన పటేల్‌ కుర్దును పెరున పేన్కు (భీందేవర) వద్దకు తీసుకుని వెళ్లి ముక్కుకు నేలకు రాయించి, సర్కారుకు మద్దతుగా మరోసారి రావద్దని హెచ్చరించి పంపించి వేస్తారు. అందరినీ తరిమికొడ్తారు. భీము నాయకత్వంలో పోలీసులను తరిమికొట్టారనే వార్త గూడేలన్నింటికీ వ్యాపిస్తుంది. అడవిలోని అన్ని తెగలవాళ్లు కొమురం భీము స్ఫూర్తితో తిరుగుబాటుకు సన్నద్ధమవుతారు. ఖాత్రి బర్మార్లు తయారు చేయడంలో నిమగ్నమయ్యాడు. కొండల్‌ బర్మార్లు పేల్చడం నేర్పుతున్నాడు. రఘు వొడిసెల విసరడం, బాణాలు వేయడం నేర్పుతున్నాడు. అన్ని గూడేలవాళ్లు యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు. ఓ వైపు అడవులు నరుకుతూ, మరో వైపు సమరానికి గూడేలు సన్నద్ధమవుతున్నాయి.

ఆ తిరుగుబాటుతో అధికార యంత్రాంగంలో మంట పుట్టింది. వకీలు రామచంద్రరావు ఇంటి చుట్టూ పోలీసులు తిరుగుతుంటారు. అతని సహాయసహకారాలు గిరిజనులకు ఏ మేరకు ఉన్నాయనే విషయాన్ని పసిగట్టడానికైనా కావచ్చు, అతని ఇంటికి గిరిజనులు వస్తే అరెస్టులు చేయడానికైనా కావచ్చు. గిరిజనులను అణచేయడానికి మరిన్ని బలగాల కోసం కలెక్టర్‌ నుంచి సుబేదారుకు సమాచారం వెళ్తుంది. బలగాల కోసం జిల్లా అధికారులు వేచి చూస్తారు. పెద్ద యెత్తున జోడెన్‌ఘాట్‌పై దాడి చేయాలనే ఎత్తుగడలో అధికార యంత్రాంగం ఉంది. తిరుగుబాటును సాయుధంగా అణచివేయాలనే నిర్ణయానికి వస్తుంది.

పన్నెండు గ్రామాలకే కాకుండా అన్ని గ్రామాలకు కొమురం భీము తన ప్రకటన పంపిస్తాడు. తమ రాజు రాంజీ గోండు కలను సాకారం చేయడానికి పోరాటం చేద్దామని పిలుపు ఇస్తాడు. గూడేలు పోరాటానికి సిద్ధమవుతాయి.

పోలీసుల దాడిని తిప్పినకొట్టిన భీము

భీము ఊహించినట్లుగానే ఎక్కువ సైనిక బలగాలు దాడికి బయలు దేరాయి. వావుదం నుంచి యాభై మంది నిజాం సైన్యం పెద్దవాగు మీదుగా జోడెన్‌ఘాట్‌ వైపు కదులుతుంది. కుర్దు పటేల్‌ దారి చూపుతుండగా సైన్యం కొండలు కోనలు దాటుతూ నడక సాగించింది. కెప్టెన్‌ యాభై మంది సైనికులను మూడు దళాలుగా విభజించి ఒక దళం ఎడమ వైపు నుంచి, కుడి వైపు ఒక దళం, సూటిగా ఒక దళం కొండ మీదికి సాగాలని ఆదేశించాడు. వారు కొండ ఎక్కుతుండగా తుడుం మోగింది. సైనికులపైకి తెంపు లేకుండా వడిశెల రాళ్లు వచ్చి పడసాగాయి. కొండ మీంచి రాళ్లు జారుతూ మీదికి వచ్చాయి. దీంతో సైనికులు వెనక్కి పరగెత్తారు. సైన్యం కకావికలమైంది. ఆ రకంగా సైనికదాడిని కొమురం భీము దళాలు గెరిల్లా పద్ధతిలో తిప్పికొట్టాయి. గోండులు, కోలామ్‌ల్లో విజయ ఉత్సాహం వెల్లివెరిసింది. ఆనందం పట్టలేకపోయారు.

కొమురం భీము నాయకత్వంలోని తిరుగుబాటుకు ఆసిఫాబాద్‌ జిల్లా యంత్రాంగం కంగు తిన్నది. ఆ సమాచారం తెలుసుకుని నైజాం సర్కారు బిత్తరపోయింది. ఆసిఫాబాద్‌ తాసిల్దార్‌ అబ్దుల్‌ సత్తార్‌ జరిగిన సంఘటన గురించి వివరంగా రెవెన్యూ డైరెక్టర్‌కు రాసి, వెంటనే ఓ మనిషిని హైదరాబాద్‌ పంపించాడు. అదనపు బలగాలను పంపాలని పోలీసు డిఎస్‌పి హిదాయత్‌ అలీ కలెక్టర్‌కు ఆర్జీ పెట్టుకున్నాడు. కలెక్టర్‌ వెంటనే వరంగల్‌ వెళ్లి సుబేదారు అజర్‌ హసన్‌ను కలిశాడు.

సుబేదార్‌ అప్పటికే అలవి కాని సమస్యలతో సతమతమవుతున్నాడు. వరంగల్‌ గ్రామీణ ప్రాంతాల్లో, నల్లగొండలో జాగీర్దార్లకు దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పోరాటాలు ఊపందుకున్నాయి. వాటిని ఎలా అణచాలో అర్థం కాకుండా ఉంది. పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. దానికితోడు, ఈ సమస్య. ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. జైళ్లు నిండిపోతున్నాయి. నిజాం ప్రభువు నుంచి ఫర్మానాల మీద ఫర్మానాలు వస్తున్నాయి.

కొమురం భీము తిరుగుబాటుపై సుబేదార్‌ హసన్‌కు ఏం చేయాలో తెలియలేదు. హోం శాఖకు, పోలీసు డైరెక్టర్‌ జనరల్‌కు వర్తమానం పంపాడు. తనకు ఏం చేయాలో తోచడం లేదని, ఆలోచించడానికి సమయం లేదని, ఏం చేయాలో తక్షణమే తెలపాలని కోరుతూ ఆ వర్తమానం. ఆసిఫాబాద్‌ స్వయంగా వెళ్లి పరిస్థితిని తెలుసుకుని అన్ని వివరాలతో హైదరాబాద్‌ రావాలని సుబేదార్‌కు ఐదు రోజుల తర్వాత పైనుంచి ఆదేశాలు వచ్చాయి.

హసన్‌ ఆసిఫాబాద్‌ వచ్చాడు. తాసిల్దార్‌ సత్తార్‌తో వివరంగా మాట్లాడాడు. గిరిజనుల తిరుగుబాటుకు భూమి సమస్యనే ప్రధాన కారణంగా కనిపించింది. వివరాలు తెలుసుకుని హసన్‌ తిరుగు ప్రయాణానికి సిద్ధపడ్డాడు. గోండులను ఓసారి కలిస్తే బాగుంటుందేమోనని సత్తార్‌ అంటాడు. దాంతో హసన్‌ ఆగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఆ తర్వాత ఓసారి ఆలోచనలో పడి - వకీలు రామచందర్‌ రావును పిలిపిస్తాడు. రామచందర్‌ రావును చూడగానే హసన్‌లో ఆగ్రహం ద్విగుణీకృతం అవుతుంది. గిరిజనుల్లో తిరుగుబాటు రేపావంటూ ఆరోపిస్తాడు. తాను వకీలునని, ఎవరు పైసలిస్తే వారి తరఫున వాదిస్తానని, తిరుగుబాటుతో తనకేమీ సంబంధం లేదని రామచందర్‌ రావు చెప్తాడు. భీము ఎక్కడుంటాడని హసన్‌ అడుతాడు. తనకు తెలియదని రామచందర్‌ రావు సమాధానమిస్తాడు. కాసేపటికి సుబేదారు హసన్‌ చల్లబడి రామచందర్‌ రావును వెళ్లిపొమ్మంటాడు. అదే రోజు హసన్‌ హైదరాబాద్‌ బయలుదేరి వెళ్తాడు.

సుబేదారు ఆసిఫాబాద్‌ జిల్లాలోని గోండుల తిరుగుబాటు గురించి ఉన్నతాధికారులకు వివరించాడు. దాంతో సైన్యాన్ని పెద్ద యెత్తున పంపి గోండులను అణచేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇంతలోనే బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రతినిధి ఉస్మాన్‌ అలీఖాన్‌ వద్దకు వస్తున్నట్లు వర్తమానం వచ్చింది. బ్రిటిష్‌ అధికారి ఉస్మాన్‌ అలీఖాన్‌తో సమావేశమయ్యారు. నిర్మల్‌ నుంచి, చాందా నుంచి తమకు అందిన సమాచారాన్ని అతను నిజాంకు వివరించాడు. నేరుగా కొమురం భీము దళాలు ఉన్న కేంద్రాన్ని ముట్టడించి అణచేయడం కష్టమని, గుట్టల మీది దళాలను దెబ్బ తీయడానికి కింది ప్రజలను హింసించాలని సూచించాడు. గుట్టల మీదికి ఆహారం వంటి సరుకులు వెళ్లకుండా దిగ్బంధం చేయాలని సూచించాడు. దీంతో నైజాం పోలీసులు, జంగ్లాత్‌వాళ్లు, గుండాలు మైదాన ప్రాంతంలోని గూడేల మీద పడి ప్రజలపై హింసాకాండకు పూనుకున్నారు. గూడేలు అల్లకల్లోలమయ్యాయి. సర్వం కోల్పోయినవాళ్లు జోడెన్‌ఘాట్‌కు వెళ్లసాగారు. దీంతో జోడెన్‌ఘాట్‌ జనంతో నిండిపోసాగింది. కింద పంటలు నాశనమవుతున్నాయి.

నాలుగు నెలల పాటు నైజాం మూకలు గ్రామాలపై పడి విధ్వంసం సృష్టించాయి. దీంతో కొమురం భీముకు గిరిజనులు తమ బాధలను చెప్పుకోవడం ప్రారంభించారు. గ్రామాలపై విరుచుకుపడుతూనే జోడెన్‌ఘాట్‌ మీద దాడికి నిజాం సైన్యం ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నది. భీము దళాలు ఆ ప్రయత్నాలను తిప్పికొడుతూనే ఉన్నారు. జోడెన్‌ఘాట్‌కు సరుకులు అందడం కష్టమైంది. ఈ స్థితిలో సమావేశమై కొమురం భీము అందరి సూచన మేరకు రెండు నిర్ణయాలు తీసుకున్నాడు. ఒకటి - గ్రామాల్లో రహస్యంగా సంచరిస్తూ సరుకులు పోగు చేసుకోవడం, రెండోది - తాము కావాలని యుద్ధం చేయడం లేదని, పన్నెండు గ్రామాల మీద అధికారం ఇస్తే నైజాం విధేయులమై ఉంటామని సర్కారుకు వర్తమానం పంపడం. వెంటనే కార్యరంగంలోకి దిగారు. పాటలు పాడుతూ కొంత మంది గ్రామాల నుంచి సరుకులు తీసుకుని వచ్చే కార్యక్రమాన్ని సాగించారు. అధికారుల వద్దకు నైజాం సర్కారుకు చేరవేయడానికి సూరును పంపించాడు భీము. గ్రామాల్లోకి భీము దళాలు ప్రవేశిస్తున్నాయని తెలుసుకుని నిజాం మూకలు సోదాలు నిర్వహించడం ప్రారంభించారు. పన్నెండు గ్రామాలకు రాజ్యాధికారం ఇస్తే తిరుగుబాటు ఆపేస్తామని చెప్పడానికి కొమురం భీము తరఫున రాయబారిగా వెళ్లిన సూరును తాసిల్దార్‌ దూషించి వెనక్కి పంపించాడు. ఆ సమాచారం అందంగానే కొమురం భీము ఫౌజును అప్రమత్తం చేశాడు.

నిజానికి పన్నెండు గ్రామాలపై తమకు హక్కులు ఇస్తే నిలదొక్కుకోవడానికి వీలవుతుందని, ఆ తర్వాత భవిష్యత్తు కార్యక్రమాన్ని ఆలోచించుకోవచ్చునని భీము ఆలోచన. అంటే, కాస్తా విరామం దొరికితే, ఊపిరి సలువుతుందని అనుకున్నాడు. కానీ, తాసిల్దార్‌ దానికి అంగీరించకపోవడంతో ప్రతిఘటన కొనసాగించాల్సిన పరిస్థితే ఉందని భీము గ్రహించాడు.
చర్చలు విఫలం..

ఇలా సమాయత్తమవుతున్న సమయంలోనే కొమురం భీము వద్దకు ఓ రోజు సబ్‌ కలెక్టర్‌ నాజం సాబ్‌ వస్తాడు. పది మందిని వెంట పెట్టుకుని గొండి గూడెం వచ్చి సబ్‌ కలెక్టర్‌ నాజం కొమురం భీముకు వర్తమానం పంపించాడు. ఒక్క నాజం సాబ్‌ను మాత్రమే రమ్మనుమని వర్తమానం తెచ్చిన వ్యక్తికి చెప్పాడు. దాంతో నాజం సాబ్‌ కుర్దు పటేల్‌ను వెంట తీసుకుని వచ్చాడు. బేతాళ చెట్టు కిందికి వారిద్దరిని తీసుకుని సూరు వచ్చాడు.

కొమురం భీముకు, నాజర్‌ సాబ్‌కు మధ్య చర్చలు జరిగాయి. కొమురం భీముకు, అతని చిన్నాయనలకు దున్నుకోవడానికి భూములు ఇప్పిస్తానని, వాటికి పట్టాలు ఇప్పిస్తామని, తిరుగుబాటు మానుకోవాలని నాజర్‌ సాబ్‌ చెప్పాడు. అందుకు భీము అంగీరించలేదు. తాము పన్నెండు గ్రామాల కోసం పోరాటం చేస్తున్నామని, తన ఒక్కడి కుటుంబం కోసం కాదని కచ్చితంగా చెప్పాడు. పోనీ, పన్నెండు గ్రామాలవారికి పట్టాలిప్పిస్తామని నాజర్‌ చెప్పాడు. అప్పటికే అక్కడికి పెద్ద యెత్తున గోండులు, కోలామ్‌లు చేరుకున్నారు.

సత్తార్‌ వద్ద జరిగిన వ్యవహారంపై సూరు చెప్పిన మాటలతో వేడెక్కి ఉన్న కొమురం భీము నాజర్‌ సాబ్‌ మాటలను వినదలుచుకోలేదు. లడాయి చేస్తామని కచ్చితంగా చెప్పాడు. పన్నెండు గ్రామాలపై అధికారం కావాలని కొమురం భీము అడిగాడు. లడాయి ప్రారంభించి ఏడు నెలలు గడిచాయి. కొమురం భీము సంకల్పం తెలిసిన నైజాం సర్కారు గోండులను దెబ్బ తీయడానికి అవసరమైన చర్యలకే పూనుకుంది.

అంతిమపోరు..

పోరాటం కారణంగా పటార్ల మీద వ్యవసాయం దెబ్బ తిన్నది. నిజాం సర్కారు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. రహస్య దళాలు గ్రామాల్లో తిరగలేని వాతావరణం ఏర్పడింది. జోడెన్‌ఘాట్‌కు సరిగా ఆహార పదార్థాలు అందడం లేదు. పోరాటాన్ని మరింత విస్తరిస్తే తప్ప వెసులుబాటు లభించిందని కొమురం భీము ఆలోచిస్తున్న సమయంలో సూరు ఓ సమాచారం తెచ్చాడు. నిజాం సైన్యం పెద్ద యెత్తున తరలి వస్తుందనేది ఆ సమాచారం. మూడు వందలకు పైగా సైన్యం వావుదం వరకు చేరుకుంది. వారికి కుర్దు పటేల్‌ దారి చూపుతున్నాడు.

యుద్ధానికి పూర్తిగా సమాయత్తం కాకముందే నిజాం సైన్యం దాడికి పూనుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఆయుధాలను సేకరించుకునే పని పూర్తి కాలేదు. సైన్యం జోడెన్‌ఘాట్‌ కొండను సమీపించారు. పైకి చేరుకోవాలంటే 800 అడుగుల గుట్టను ఎక్కాలి. కుర్దు కొండపైకి ఎలా వెళ్లాలో చూపించాడు. అలీ రజా బ్రాండస్‌ సైన్యానికి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

అప్పటికే తుడుం మోగించి పౌజును సిద్ధం చేశాడు కొమురం భీము. కొండపైకి ఎగబాకుతున్న సైనికుల మీదికి గోండులు, కోలామ్‌లు బండలు దొర్లించారు. దాంతో సైనికులు చెల్లాచెదురై తమను తాము కాచుకోవడానికి ప్రయత్నించారు. సైనికులు పైకి ఎగబాకడం ఆగిపోవడంతో రాళ్లు దొర్లడం కూడా ఆగిపోయింది. ఆ తర్వాత చాలాసేపటికి కెప్టెన్‌ పలుమార్లు హెచ్చరించడంతో సైనికులు పైకి ఎక్కడం సాగించారు. పై నుంచి బండలు దొర్లుతున్నాయి. రాళ్ల వర్షం కురుస్తుంది. బర్మార్లు పేలుతున్నాయి. అయినా బండలను రక్షణ చేసుకుంటూ సైనికులు పైకి రావడం ప్రారంభించారు. సైనికులు తుపాకులు పేలుస్తూ పైకి వస్తున్నారు.

తాము పైకి వస్తున్నామని, దాడులు ఆపాలని, ఆపితే తాము పట్టాలిస్తామని కెప్టెన్‌తో పాటు ఉన్న తాసిల్దార్‌ అరిచి చెప్పాడు. పట్టాలిస్తామని చెప్పడంతో గిరిజనుల్లో ఆశ పుట్టింది. ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఎదురుదాడికి విఘాతం కలగడంతో సైన్యం పైకి చేరుకోగలిగింది. పైకి వచ్చిన సైనికులు కుర్దు సహాయంతో ముఖ్యులను గుర్తించి కాల్పులు జరపడం ప్రారంభించారు. కొమురం భీము అనుచరులు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే, గందరగోళంలో సైనికులది పైచేయి అయింది. రఘు, ఇంకా కొద్ది మంది కాల్పుల్లో గాయపడి కింద పడిపోయారు. కుర్దు పటేల్‌ భీమును చేయేత్తి చూపించాడు. దాంతో కెప్టెన్‌ భీము మీదికి కాల్పులు జరిపాడు. భీము కుప్పలా కూలిపోయాడు. 1940 సెప్టెంబర్‌ 1వ తేదీన కొమురం భీము అమరుడయ్యాడు.

(గిరిజన నాయకుడు కొమురం భీమ్ 73వ వర్ధంతి సందర్భంగా)

English summary
A tribal leader Komuram Bheem waged struggle against Nizam for the rights on lands for tribals. he was killed by the Hyderabad state ruler Nizam's army.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X