రూఫ్ గార్డెన్-తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి అనుభవాలు(ఫొటోలు)
తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారి రూఫ్ గార్డెన్‌ను ఇటీవల నేను స్వయంగా చూశాను. ఆయన గత ఆరు సంవత్సరాలుగా ఇంటి పైకప్పు/మేడపై కుటుంబానికి సరిపడా కూరగాయలను, కొన్ని పండ్లను, పువ్వులను కూడా పండిస్తున్నారు.
తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి ప్రముఖ కథా రచయితగా తెలుగు పాఠకులకు సుపరిచితమే. అయితే ఇప్పుడు ఆయన ఇంటిపై మేడ మీద 160 గజాల స్థలంలో చేపట్టిన వైవిద్యభరితమైన వ్యవసాయ కృషి మనల్ని అబ్బుర పరస్తుంది. చాలా చిన్న స్థలంలో ఎంతై వైవిధ్యాన్ని సాగుచేసి చూపించవచ్చో అదంతా చేసి చూపించారు.

రూఫ్ గార్డెన్‌ను కేవలం ఫలసహాయం కోసం మాత్రమే కాక సేదతీరడానికి పార్క్‌లా రూపొందించడంలో చాలా కృషి ఉంది. వ్యవసాయం అన్ని సంస్కృతులకు మూలం అయితే రఘోత్తమ్, వ్యవసాయం మానవ జీవితానికి అవసరమయ్యే విలువల్ని నేర్పుతుందంటారు. శ్రమ విలువను అర్థమయ్యేలా చేసి, శ్రమ పట్ల గౌరవాన్ని పెంచుతుందంటారు.
ఆయనకి వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్నా ఆయన వ్యవసాయంలో స్థిరపడలేదు. గణితంతో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయకుండానే సింగరేణి బొగ్గు గనిలో కార్మికుడిగా జీవితం ప్రారంభించి కొనసాగారు. అయితే ఆయనకు చిన్నపటి నుంచి వ్యవసాయం పట్ల మక్కువ. తన ఆసక్తిని ఆయన ఈ కాలమంతా కొనసాగిస్తూనే ఉన్నారు. భూమిలోని బొగ్గును పైకి తీసారు, ఇప్పుడు మేడపైన పూలు, పండ్లు, కూరగాయలనూ తీసి చూపిస్తున్నారు. అంతేగాకుండా తన అనుభవాలను, పరిశీలనలను తాత్వికతతో కూడిన కొటేషన్స్‌గా ఇప్పటికే 13వేలకు పైగా రాశారు. ఆ రకంగా ఆయనది కార్మిక - కర్షక- సాహిత్య హృదయం అని చెప్పవచ్చు.

ప్రతి ఇంటా రూఫ్ గార్డెన్ వ్యవసాయంతో శారీరక వ్యాయామం, మంచి ఆహారం, ఆరోగ్యం వర్ధిల్లుతాయి. పచ్చని ఆలోచనల సృజనకాంతులు విరజిమ్ముతాయని ఆయన అంటారు. వారి రూఫ్ గార్డెన్‌లో టమాట, వంకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లి, దొండ, నేతిబీర, మిరప, మునగ, చేమగడ్డ వంటి కూరగాయలు.. కరివేపాకు పుదినా వంటి సుంగధ ద్రవ్యాలు.. తోటకూర, బచ్చలి, గంగవాయిలి కూర వంటి ఆకు కూరలు, సీతాఫలం, రామాఫలం, అల్లనేరేడు, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, పంపర పనస, సపోటా, బొప్పాయి, మామిడి ఇలా పండ్ల మొక్కలు, ఇంటిలోని కోళ్ల కోసం కొర్ర, సజ్జ, జొన్న వంటి గింజనిచ్చే మొక్కలు పెంచుతున్నారు.
ఇక పూల విషయానికొస్తే ములకబంతి, నిత్య వరహాలు, చంద్రకాంతలు, సీతజడలు, బిళ్లగన్నేరు, మల్లి, రంగు రంగుల మందారాలు, గులాబీ, జాజి, రంగు రంగుల బోగస్ విలియాలు పెంచుతున్నారు. 160 గజాల మేడ స్థలంలో 'హారిజంటల్'గా అంటే సమతలంగానే కాక, వెర్టికల్ గా అంటే లంబంగా పైకి తీగల పందిరి సహకారంతో సాగును కొత్త అడుగులు వేయిస్తున్నారు. ఇంటి అవసరాలకు ఉపయోగించుకుంటూ, ఎక్కువ వచ్చిన ఫలసాయాన్ని ఇరుగుపొరుగులతో పంచుకుంటున్నారు. ఈ పనిని ఆయన సొంత అభిరుచి, స్వయం కృషితో కొనసాగిస్తున్నారు. ఎవరి నుంచి ఎటువంటి సహకారం తీసుకోలేదు. అయితే ఉద్యానశాఖ వారు ఇటువంటి రూఫ్‌గార్డెన్‌లు పెంచాలనుకునే వారికి సహకారం అందిస్తున్నారు.

'మట్టి ఆరోగ్యంతోనే మనిషి ఆరోగ్యం' అన్న తాత్వికత మనమంతా విన్నదే.. ఆయన మరొక అడుగు ముందుకు వేసి 'మట్టి, పర్యావరణ ఆరోగ్యాలతో కేవలం మనిషే కాదు సమస్త విశ్వ ఆరోగ్యం' అని అంటారు. అందువల్ల ఆయన మానవ కళ్యాణం అనే మాటకు బదులుగా 'విశ్వకళ్యాణం' అనే మాటను వినియోగిస్తారు.
అటువంటి తాత్వికతతో ఆయన ఎటువంటి రసాయన పురుగు మందులు, ఎరువులు వాడకుండా తన 'రూఫ్ గార్డెన్' కృషిని కొనసాగిస్తున్నారు. పశువుల పెంట, మేక పెంట, కోళ్ల పెంట వంటివి ఎరువులుగా వినియోగిస్తున్నారు. వేరుపురుగు, తెల్ల చీమలు వంటి వాటికి వేపపిండి, వేపనూనె వినియోగిస్తున్నారు. ఇంక ఇతరత్రా పురుగులను ఎప్పటికప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా మొక్కలను సంరక్షిస్తున్నారు. ఎండిపోయిన, రోగంతో వడలిపోయిన వాటిని తుంచి తొలగిస్తున్నారు.

మొత్తంగా ఇవాళ నగర ప్రాంతాల్లోని సమాజం ఇటువంటి 'రూఫ్ గార్డెన్' వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది. గాలి, నీరు, మట్టి, శబ్దం, తినే ఆహారం అన్నీ కలుషితమైపోతున్న ఈ పరిస్థితుల్లో సమాజ, పర్యావరణ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. సమస్త ప్రాణకోటికి ముప్పు వాటిల్లుతోంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సర్వసాధారణమయిపోయి మనుషులు ప్రాణాంతక వ్యాధుల బారినపడి అర్ధాంతర, అసహజ మరణాల పాలవుతున్నారు. ఇటువంటి తరుణంలో రఘోత్తమ్ 'రూఫ్ గార్డెన్'ల ప్రత్యామ్నాయాన్ని ఎంతో సృజనాత్మకంగా ఆవిష్కరిస్తున్నారు.
ఇది ఆశాజనకం, మంచి పరిణామం. దాదాపు కోటి జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 20 లక్షల ఇళ్లు ఉన్నాయి అనుకుంటే, సగటున 100 గజాలు(2సెంట్లు) మేడపైన స్థలం ఉంటుందనుకుంటే ఆ స్థలంలో ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. 20 లక్షల ఇళ్లుX 2సెంట్లు = 40,00,000 సెంట్లు అవుతాయి. అంటే వంద సెంట్లు ఒక ఎకరం కాబట్టి, నగరంలో దాదాపు 40వేల ఎకరాలలో ఈ రూఫ్ గార్డెన్ సాగు సాధ్యమవుతుంది.

రూఫ్ గార్డెన్ తాత్వికత - తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి అభిప్రాయాలు:
'మనుషులు గాయపరిస్తే, మొక్కలు మలాం పూస్తాయి' అని ఆయన అంటారు. 'రూఫ్ గార్డెన్‌ల కోసం నడుములు వంచగలిగితే అవి సన్నబడి.. రూఫ్‌లు పచ్చబడతాయి' అని అంటారు. 'ఇంటి మీద తోటను పెంచితే, అది ఇంటిలోపలి.. లోలోపలి చల్లదనాన్ని పెంచుతుంది' అని అంటారు. 'మనం మొక్కలను పెంచితే, అవి మనలో సృజనను పెంచుతాయి' అని అంటారు. 'లాభాల అన్వేషణలో పరిగెత్తేవారు... జీవన మాధుర్యాలను నష్టపోతారు' అని అంటారు.
రూఫ్ గార్డెన్ వలన క్రిమి సంహారక మందులు వాడని తాజా కూరగాయలు, పండ్లు లభిస్తాయి. ఆరోగ్యపరంగా వీటి విలువ ఇంత అని చెప్పలేము. ఇంటిలోపల చల్లగా ఉంటుంది. కూలర్, ఏసీలు వాడనక్కర లేదు. విద్యుత్ ఆదా అవుతోంది. ఆయనకు 2016, మార్చి 10 నుంచి ఏప్రిల్ 10 నెలకు గాను వచ్చిన కరెంటు బిల్లు కేవలం 524 రూపాయలే. అందరికీ మండు వేసవి అయితే రూఫ్ గార్డెన్ చల్లదనంతో తమకు పండు వేసవి. కంటికి పచ్చని ప్రకృతి కనిపిస్తుంది. మంచి గాలి, మనసుకు ప్రశాంతత లభిస్తాయి. మనలో సృజనాత్మకత పెంచుంతుంది.
ఇంటిలో అనవసర గొడవలు సమసి కొంత శాంతి నెలకొంటుంది. తద్వారా ఇంటిల్లిపాదికి, మనతో సంబంధాలు ఉన్న అందరికీ ప్రశాంతత లభిస్తుంది. ఇట్లా కంటికి కనిపించని బహుళ ప్రయోజనాలు రూఫ్ గార్డెన్‌ల వలన సిద్ధిస్తాయి.

మా ఇంటి అడుగు స్థలం 163 గజాలే! మూడున్నర సెంట్లకు కొంచెం తక్కువ. అరఫీటు అటు ఇటుగా రూఫ్ కూడా అంతే విస్తీర్ణం. 36 ఫీట్ల వెడల్పు - 40 ఫీట్ల వెడల్పు ఉన్న ప్లాట్ మాది. స్థలం ఖరీదు అధికం కనుక కూరగాయల మొక్కల కోసం స్థలం కొనడం మానుకుని, ప్లాటు ఎంతుందో అంత స్థలాన్ని రూఫ్ మీద నిర్మించుకోవాలనుకున్నాను.
ఇంటి నిర్మాణ సమయంలోనే, రూఫ్ గట్టిదనం, వాలు గురించి శ్రద్ధ తీసుకున్నాను. ఇవి సాధారణంగా అందరూ తీసుకునే జాగ్రత్తలే. రైతు కుటుంబం నుంచి వచ్చినవాన్ని కనుక, సేద్యం నా అభిరుచిగా మారింది. రైతు కుటుంబం నుంచి వచ్చినవాన్ని కనుకనే వ్యవసాయోత్పత్తులు క్రిమిసంహారక మందులతో ఎంత విషతుల్యం అవుతున్నాయో తెలుసు. ఇంటర్ చదివే రోజుల్నుంచే కూరగాయల పెంపకం పట్ల ఆసక్తిని పెంచుకున్నాను. నేను సింగరేణి క్వార్టర్స్‌లో ఉన్నన్ని సంవత్సరాలు స్థలం సమస్య లేకుండె. హైదరాబాద్‌కు మారాలనుకున్న తర్వాతే నాకు పెరిటి తోటకు స్థలం సమస్య ఎదురైంది. రూఫ్ గార్డెన్ ఆలోచనలతో స్థలం సమస్యని అధిగమించాను.

ఆరు సంవత్సరాల క్రితం రూఫ్ గార్డెన్‌ని మిద్దె మీద ప్రారంభించాను. సుమారు 20వేల రూపాయలు ఖర్చు చేసి ఉంటాను. బరువు పనులు విషయంలో మా అబ్బాయి తిలక్ సాయం మినహా ఒక్క కూలీని కూడా వాడుకోలేదు. రూఫ్ గార్డన్‌న్ని మించిన వ్యాయామశాల లేదు.
గత ఆరు సంవత్సరాలుగా బయట మార్కెట్‌లో కూరగాయలు కొనలేదు. రసాయన ఎరువులు పరుగు మందులు లేని కూరగాయల్ని పొందుతున్నాం. పెస్టిసైడ్స్ కొట్టని కూరగాయలు - అది చాలా చాలా ముఖ్యమైన విషయం.
అనేక విషయాల పట్ల, సామాజిక విషయాల పట్ల పట్టింపు ఉన్నవాళ్లు కూడా తమని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. ఆహారం విషయంలో మరీ అధ్వాన్నం. ఆహారం ఎంత కలుషితమవుతుందో, దాన్ని ఉత్పత్తి చేసే క్రమంలో ఎన్ని విషాలను క్రిమిసంహారక మందుల పేరుతో ఉపయోగిస్తున్నారో అందరికీ తెలుసు. తినేవాళ్ల ఆరోగ్యం చెడిపోవడమే కాదు, ఆయు:ప్రమాణం తగ్గిపోతోంది. అన్నీ తెలిసిన వాళ్లు, వనరులు ఉన్నవాళ్లు స్థలం లేకపోయినా రూఫ్ గార్డెన్‌లను ఏర్పాటు చేసుకొని, మంచి కూరగాయాలను, పండ్లను పండించుకోవచ్చు. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా, సమాజ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్లు అవుతారు. కేవలం పండ్లు, కూరగాయలే కాదు ఇంతకు ముందు చెప్పుకున్న అనేక కనబడని ప్రయోజనాలు రూఫ్ గార్డెన్ తో ముడిపడి ఉన్నాయి. మన కృషిని బట్టి, అవగాహన శక్తిని బట్టి అవన్నీ మన అనుభవంలోకి వస్తాయని రఘోత్తమ్ అంటారు.

మన రైతుల వలనే రఘోత్తమ్ మంచి విత్తనాల కోసం అవస్థ పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి తనంతట తానే విత్తనాలను కూడా ఉత్పత్తి చేసుకుంటున్నారు. స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, మట్టి నాణ్యత సమస్యలు, విత్తనాల సేకరణ - పరిరక్షణ, చీడపీడలకు సంబంధించి ప్రత్యామ్నాయ యాజమాన్య పద్ధతులకై అన్వేషిస్తున్నారు. మొక్కల కోసం ఉపయోగించే తొట్టెలు, నిర్మించుకున్న తొట్టెలు, ఉపయోగించిన మట్టి అన్నింటిని చాలా సూక్ష్మంగా పరిశీలించి తగిన పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వ్యవసాయానికి మూల సూత్రం 'పున:చంక్రమణం'(రీసైక్లింగ్) కాబట్టి, ఆ సూత్రాన్ని పదార్థ వినియోగంలో, యాజమాన్యంలో మెళకువతో ఉపయోగిస్తున్నారు. వనరులు వృథా కాకుండా పరిరక్షిస్తున్నారు.

ఇంటి పైభాగంలో మొక్కలు పెంచుకోవడం మధ్య యుగాల సాంప్రదాయంలోను ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే, నేడు ఒక అవసరంగా రూఫ్ గార్డెన్‌ను చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇల్లు కొత్తగా కట్టుకునే వారు రూఫ్ గార్డెన్ పెంచే దృష్టితో గార్డెన్ వలన మేడపై వచ్చే అదనపు బరువును దృష్టిలో పెట్టుకుని కట్టుకుంటే మంచిది. అయితే, తేలికపాటి కుండీలు, వనరులతో పరిమితంగానైనా రూఫ్ గార్డెన్ పెంచుకునే తాత్వికత చాలా ముఖ్యమైనది.
పట్టణ ప్రాంతాలలో జనాభా పెరుగులతో ఎక్కువ భూమిని ఇంటి నిర్మాణానికి వినియోగిస్తున్నారు. అందువలన కూరగాయలు, అవసరమైన మొక్కలు పెంచడానికి స్థలం ఉండడం లేదు. ప్రత్యేకంగా బహుళ అంతస్తుల భవనాలలో కుండీలను ఉపయోగించి కూరగాయలను, పండ్ల మొక్కలను పెంచుకోవడం ఒక్కటే మార్గం. 40-50చ.మీ. స్థలంలో నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపడా కూరగాయలను పండించుకోవచ్చు. మొక్కల పెంపకం చేపట్టే ముందు ప్రణాళిక తయారు చేసుకోవడం చాలా అవసరం.

రూఫ్ గార్డెన్ వల్ల లాభాలు: మొక్కలు ఉష్ణోగ్రతను తగ్గించి, 'అర్బన్ హీట్ ఐలాండ్' తగ్గిస్తాయి. ప్రకృతికి దగ్గరయ్యే అవకాశం కలుగుతుంది. మొక్కలను సంరక్షించుకుంటూ మానసిక ఉల్లాసం పొందవచ్చు. వత్తిడి, అలసట నుండి బయట పడవచ్చు. ఇంటిపైన స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించవచ్చు. కుటుంబానికి, ఇరుగుపొరుగుకు అవసరమైన కూరగాయలను పండించవచ్చు. సంవత్సరం పొడవునా సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లు, కూరగాయలు లభ్యమవుతాయి. ఖర్చు తగ్గుతుంది. సాధారణంగా దొరకని కూరగాయలను పండించుకోవచ్చు. పచ్చదనాన్ని కాపాడుకుంటూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. దీని వల్ల స్థలం, అపార్ట్‌మెంట్ విలువ కూడా పెరుగుతుంది. తక్కువ వనరులతో మనకు కావాల్సిన ఉత్పత్తులను పండించుకోవచ్చు.
జీవారణ్యాలను సాగుభూమిగా మార్చే ప్రమాదం నుండి ప్రకృతిని సంరక్షించుకోవచ్చు. గ్రామ ప్రాంతాల నుండి పట్టణాలకు ఆహార ఉత్పత్తులను రవాణా చేయడానికి అవసరమయ్యే ఖర్చు, ప్రమాదాలు, కాలుష్యాలను తగ్గించుకోవచ్చు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించుకొని పట్టణ వాతావరణ నాణ్యతను పెంచుకోవచ్చు. మొక్కలు కాలుష్యాన్ని తగ్గించి ప్రాణవాయువును పెంచుతాయి.

రూఫ్ గార్డెన్ మొక్కల పెంపకంలో జాగ్రత్తలు: డాబా పైకప్పు బలంగా మొక్కల బరువు మోయగలిగేలా ప్రణాళిక చేసుకోవాలి. పైకప్పు కారకుండా ఉండాలి. మురుగునీటి పారుదల సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. ప్రణాళికా బద్ధంగా మొక్కలు నాటాలి. కుండీల్లో నింపే మిశ్రమం తేలికపాటి బరువు ఉండేలా చూసుకోవాలి. నీళ్ల ట్యాంక్‌ను పైనే అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. గాలి వేగాన్ని తగ్గించే మొక్కలను చుట్టూ పెంచాలి.

కుండీలను సూర్యరశ్మి సోకే విధంగా ఏర్పాటు చేయాలి. లోతుగా పెరిగే వేర్లుఉన్న మొక్కలను పెద్ద కుండీలలో, పైపైన పెరిగే వేర్లున్న మొక్కలను చిన్నకుండీలలో పెంచాలి. బరువైన పెద్ద కుండీలను భవనం బలమైన భాగాలలో(భీమ్‌లపై) ఉంచాలి. కుండీలో తేమ పరిస్థితులను బట్టి అవసరమైనప్పుడు నీరందించాలి. ఎల్లప్పుడూ కుండీలలో కలుపు మొక్కలు, మొక్కలపై పురుగులు, తెగుళ్లు ఆశించకుండా చూడాలి. కుండీలను గాలిసొకే విధంగా ఒకదానికొకటి ఎడంగా ఉండేటట్లు అమర్చాలి. విష ప్రభావం ఉన్న రసాయనాలను, మందులను పిచికారీ చేయకూడదు.
ఇలాంటి ఆలోచనలు ముందుకు తీసుకుపోవడంలోనే మనందరి భవిష్యత్తు, శ్రేయస్సు, మనుగడ ముడిపడి ఉన్నాయి. అందువల్ల మానవ కళ్యాణ పరిధిని దాటి విశ్వకళ్యాణానికి బాటలు వేద్దాం. మనిషిని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం.
తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డిని సంప్రదించాల్సిన చిరునామా: ఇం.నెం. 4-45/2, తిలక్‌భవన్, నాలుగవ వీధి, బాబానగర్, దివ్యానగర్ రోడ్, నారపల్లి గ్రా, వెంకటాద్రి పోస్ట్, ఘట్‌కేసర్ మం., రంగారెడ్డి జిల్లా. సెల్: 9000184107.
ఈమెయిల్: [email protected].
- డి.వి. రామక్రిష్ణారావు, సహాయ సంపాదకులు, వ్యవసాయ పాడిపంటలు, వ్యవసాయ కమిషన్-సంచాలకుల కార్యాలయం, హైదరాబాద్












Click it and Unblock the Notifications